Rain alert.. రేపు 11 జిల్లాలకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2022-05-13T15:22:01+05:30 IST

రాష్ట్రంలో 11 జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. చెన్నై కేంద్ర సంచాలకుడు సెంథామరై కన్నన్‌

Rain alert.. రేపు 11 జిల్లాలకు భారీ వర్షసూచన

- వాతావరణశాఖ హెచ్చరిక

- తూత్తుకుడిలో పడవ బోల్తా 


చెన్నై: రాష్ట్రంలో 11 జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. చెన్నై కేంద్ర సంచాలకుడు సెంథామరై కన్నన్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అసాని తుఫాను ఆంధ్రాతీరంలో గురువారం వేకువజామున బలహీనపడిందని ఈ ప్రభావంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడిందన్నారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయని, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలో, పుదుచ్చేరిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, ఈ నెల 14న నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, తేని, దిండుగల్‌, ఈరోడ్‌, సేలం, నామక్కల్‌, కరూరు, తిరుచ్చి, పెరంబలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా నగరంలోని రాయపేట, మైలాపూరు, మధురవాయల్‌, కోడంబాక్కం, ట్రిప్లికేన్‌ తదితర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరుగా వర్షం కురిసింది.


నీట మునిగిన జాలర్లు...

తూత్తుకుడి సమీపంలో అసాని తుఫాను ప్రభావంతో వీచిన పెనుగాలులకు సముద్రంలో ఓ పడవ బోల్తాపడింది. అందులోని తొమ్మిదిమంది జాలర్లు నీట మునిగి ఇబ్బందులకు గురయ్యారు. ఆ ప్రాంతంలో చేపలుపడుతున్న కొంతమంది జాలర్లు అక్కడికి చేరుకుని వారిని కాపాడి తీరానికి చేర్చారు. తూత్తుకుడి తిరేసపురం ప్రాంతానికి చెందిన రహీమ్‌ (42), అబ్దుల్‌ ఖాదర్‌ (42), అసమ్‌ (40), మైదీన్‌ (45), సదన్‌ (35), మీరాన్‌ (45), కిజో (25), కని మరక్కాయర్‌ (45), రఫీక్‌ (19) అనే జాలర్లు  నాటుపడవలో చేపలవేటకు వెళ్ళారు. పది నాటికల్‌ మైళ్ల దూరంలో వారు చేపలుపడుతుండగా వీచిన పెనుగాలులకు పడవ అటూఇటూ ఊగి అడుగుభాగాన పెద్ద రంద్రం ఏర్పడటంతో సముద్రపు నీరు ప్రవేశించి పడవ బోల్తాపడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది జాలర్లు నీట మునిగారు. సుమారు గంటకు పైగా ఈదుకుంటూ కాపాడమంటూ కేకలు పెట్టారు. అది విని కాస్త దూరంలో చేపలపడుతున్న కొంతమంది జాలర్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని నీటిలో ఈదుతున్న వారిని తమ పడవల్లో ఎక్కించుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

Read more