చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2022-05-14T05:38:43+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరంలో కూడా నీళ్లు పారలేదని తొండిమాటలు చెప్పే బీజేపీ నాయకులు.. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలకు వస్తే రుజువు చూపిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

చర్చకు సిద్ధమా?
ములుగులో ఐవోసీ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న హరీశ్‌రావు


కాళేశ్వరం జలాలు కనిపించాలంటే సిద్దిపేట జిల్లాకు రండి

బీజేపీ నాయకులవి తొండి మాటలు

అధునాతన హంగులతో గజ్వేల్‌ బస్టాండ్‌, ప్రజ్ఞాపూర్‌లో బస్‌బేల నిర్మాణం

ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం

రెండేళ్లలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్‌ బోర్డు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌/కొండపాక/వర్గల్‌, మే, 13 : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరంలో కూడా నీళ్లు పారలేదని తొండిమాటలు చెప్పే బీజేపీ నాయకులు.. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలకు వస్తే రుజువు చూపిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు. శుక్రవారం మంత్రి గజ్వేల్‌ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ములుగు, వర్గల్‌, మర్కుక్‌ మండల కేంద్రాల్లో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవన(మినీ ఐవోసీ) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మర్కుక్‌లో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి, విలేజ్‌ ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభించారు. గజ్వేల్‌ బస్టాండ్‌, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌లలో బస్‌బేల నిర్మాణానికి, వీరభద్రీయ సంఘ భవనానికి, కుమ్మరి సంఘ భవనం, విశ్వకర్మ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కొండపాకం మండలం కుకునూరుపల్లిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు పూలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాతనే గజ్వేల్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు, నిరంతర కరెంటు సరఫరా అందిస్తున్న ఘనత తమేదనన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న గీతారెడ్డి, సంజీవరావు, నర్సారెడ్డి, విజయరామారావులకు ఎన్ని అర్జీలు ఇచ్చినా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రోడ్డు విస్తరణ చేయలేకపోయారని, ప్రస్తుతం రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. డివైడర్‌, బటర్‌ఫ్లై లైట్లు, చెట్లతో కళకలలాడుతుందన్నారు. రూ.297 కోట్లతో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు, ఎడ్యూకేషన్‌హబ్‌, సమీకృత మార్కెట్‌, మహాతిఆడిటోరియం ఇలా అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.. గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రి కార్పొరేట్‌ ఆసుపత్రికి దీటుగా సేవలందిస్తుందని, త్వరలోనే పూర్తిస్థాయి మాతా, శిశు ఆసుపత్రి అందుబాటులోకి రానుందని తెలియజేశారు.. అధునాతన హంగులతో గజ్వేల్‌ బస్టాండ్‌ను, ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌లో బస్‌బేలను నిర్మిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వ అధికారుల సేవలు సులభంగా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆఫీసులను ఒకేచోట నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ మానవతావాదిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి బంధువులకు మూడు పూటలా భోజనం పెట్టిస్తున్నారన్నారు. కాగా పామాయిల్‌ తోటల సాగుకోసం సీఎం కేసీఆర్‌ రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ పెట్టారని, రైతులు విరివిగా సాగు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వర్గల్‌లో పలువురు కాంగ్రెస్‌ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. 


ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కొండపాకం మండలం కుక్కునూరుపల్లిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మంజూరైన రూ.80 లక్షల పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులకు ఇంగ్లీ్‌షపై శిక్షణ అందిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ భాషల్లో పుస్తకాల ముద్రణ చేపట్టామని అందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో కనీస వసతుల కల్పన కోసం రూ.7,300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేయాలని కోరారు. వచ్చే రెండేళ్లలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్‌ బోర్డులు ఉంటాయని తెలిపారు. కాగా విద్యార్థులను ఎండలో నిలబెట్టి స్వాగతం పలకడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి చేయొద్దని సూచించారు. 


అన్ని నియోజకవర్గాల్లో ఐవోసీలు

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సమీకృత కార్యాలయ భవనాలను (ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌) నిర్మిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ములుగులో మండల కార్యాలయ ఆవరణలో ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయని, ఆ విమర్శలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోదన్నారు. ప్రజల పక్షాన నిలిచే వారికే అండగా నిలవాలని కోరారు. కాగా త్వరలోనే సంగారెడ్డి కెనాల్‌ను పూర్తి చేసి చెరువులను నింపుతామని చెప్పారు. వంటిమామిడిలో కోల్డ్‌ స్టోరేజీ, పండ్ల మార్కెట్‌ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కాగా ములుగులో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై కో ఆప్షన్‌ సభ్యులు, వైస్‌ ఎంపీపీ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ల పేర్లు లేకపోవడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, జడ్పీటీసీలు మంగమ్మరామచంద్రం, పంగ మల్లేశం, అనంతుల అశ్వినిప్రశాంత్‌, బాలుయాదవ్‌, ఎంపీపీలు తాండ పాండుగౌడ్‌, అమరావతి, సుగుణదుర్గయ్య, జాలిగామ లతారమేశ్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, సర్పంచులు భాస్కర్‌, ప్రవీణ్‌, నర్సింహులు, పోల్కంపల్లి జయంతినరేందర్‌, సంతోషవెంకటేశ్‌, గణే్‌షగుప్తా, గజ్వేల్‌ పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మర్కూక్‌ మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి,  ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణ, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. డబ్ల్యూఐడీసీ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, పి.నరేందర్‌, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యులు సద్గుణ, ఆత్మ కమిటీ సభ్యురాలు పద్మ, జిల్లా విద్యాధికారి రవికాంతారావు, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివా్‌సరెడ్డి, ఆయా సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.


ఆలయాల అభివృద్ధికి కృషి

నారాయణరావుపేట/చిన్నకోడూరు/నంగునూరు, మే 13: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామం శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రాచీన ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. అంతకు ముందు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌తో కలిసి గోదాంను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. చిన్నకోడూరు మండలంలోని పెద్దకోడూరు గ్రామంలో పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని దుర్గమాత, మైసంపల్లి లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం నర్మెట్ట గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నంగునూరు జడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్‌రెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు బాలక్రిష్ణ, మాణిక్యరెడ్డి, అరుణదేవి, పారిశ్రామికవేత్త రవీందర్‌రావు, సర్పంచ్‌ ఆంజనేయులు, రమేశ్‌, అజీద్‌, స్వరూప రాజెల్లయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచందు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.




Read more