ఆర్భాటానికే ఆర్బీకేలు

ABN , First Publish Date - 2022-05-05T08:41:30+05:30 IST

విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చెయ్యి పట్టుకుని నడిపించేలా రైతుభరోసా కేంద్రాలు పని చేస్తాయని సీఎం జగన్‌ చాలాసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఆర్బీకే వ్యవస్థను

ఆర్భాటానికే ఆర్బీకేలు

ప్రచారం కొండంత.. సేవలు అంతంతే

పూర్తిస్థాయిలో అందని ప్రయోజనాలు 

రైతులకు అవసరమైన పురుగు మందులు,

ఎరువులు, విత్తనాలు లభించని దుస్థితి 

ప్రైవేట్‌ కొనుగోళ్లకు చాలామంది మొగ్గు 

కనిపించని ‘48 గంటల్లో డోర్‌ డెలివరీ’

నామమాత్రపు సేవలేనని విమర్శలు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చెయ్యి పట్టుకుని నడిపించేలా రైతుభరోసా కేంద్రాలు పని చేస్తాయని సీఎం జగన్‌ చాలాసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఆర్బీకే వ్యవస్థను అభివర్ణిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం తప్ప, ప్రభుత్వం చెబుతున్నట్టుగా మెరుగైన సేవలు అందడం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ప్రధానంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా, పశువుల కొనుగోళ్లు, ఆక్వా ఇన్‌పుట్‌తో పాటు ఈ-క్రాప్‌ బుకింగ్‌, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అద్దె యంత్రాల కేంద్రాలు, బ్యాంకింగ్‌ తరహా సేవలు రైతులకు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. పైగా ఈ సేవలు విప్లవాత్మకమని ఊదరగొడుతోంది.


క్షేత్రస్థాయిలో మాత్రం.. పత్తి, మిర్చి వంటి విత్తనాలు, తగినన్ని ఎరువులు, అవసరమైన పురుగు మందులు ఆర్బీకేల్లో ఉండటం లేదన్నది రైతుల వాదన. రాయితీ విత్తనాలు తప్ప ప్రధాన కంపెనీల విత్తనాలు లభ్యం కావడం లేదని రైతులు చెబుతున్నారు. ఎరువులు కూడా అన్ని రకాలు ఉండటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా అంతటి మేలైన సేవలు అందడం లేదని, నామమాత్రంగా ఉంటున్నాయని  చెబుతున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు విడివిడిగా అందించే సేవల్నే ఆర్బీకేల్లో అందిస్తున్నారు. దీంతో ఆ శాఖల సిబ్బందికి పని లేకుండా పోయింది. 


కన్నబాబు, కాకాణి మాటల్లో ఏది నిజం? 

2021-22లో ఆర్బీకేల ద్వారా 3.5 లక్షల టన్నుల ఎరువులను రైతులకు పంపిణీ చేసినట్లు గత మార్చిలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. తాజాగా బుధవారం ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 4.75 లక్షల టన్నుల ఎరువులను 12.50 లక్షల మంది రైతులకు ఇచ్చామని చెప్పారు. కానీ 2021-22లో రాష్ట్రంలో ప్రైవేటు డీలర్ల వద్ద అమ్ముడుపోయిన ఎరువులతో పోల్చితే.. మొత్తం ఆర్బీకేల్లో 20ు ఎరువులను కూడా రైతులు కొనలేదు. ఆర్బీకేల్లో నగదు చెల్లించిన రెండురోజులకు ఎరువులు తీసుకోవాలి. రిటైల్‌ వ్యాపారుల వద్ద అయితే వెంటనే తీసుకోవచ్చు. అంతేగాక అరువు పద్ధతిలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందువల్ల రైతులు ఎక్కువగా డీలర్లనే ఆశ్రయిస్తున్నారు. పైగా ఆర్బీకేల్లో అన్ని రకాల ఎరువులు, పురుగు మందుల లభ్యత లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీనికితోడు అధికార పార్టీకి చెందినవారికి, వారికి కావాల్సినవారికి ఎక్కువగా ఎరువుల్ని సరఫరా చేశారన్న విమర్శలు ఆర్బీకేలపై వచ్చాయి. 


ఆర్బీకేలు లేక ముందు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది రాయితీ విత్తనాలు, సూక్ష్మపోషకాలు, జీవన ఎరువులు, కొన్ని రకాల పురుగు మందులను మార్కెట్‌ యార్డులు, సొసైటీల్లో అందించేవారు. ఎరువులను సహకార సంఘాలు పంపిణీ చేసేవి. ప్రైవేటు డీలర్లు మూడొంతుల ఎరువులను అమ్మేవారు. వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వహించిన కార్యకలాపాలనే ప్రస్తుతం ఆర్బీకేల్లో అందిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు పరిశ్రమల సహాయకులుగా నియమితులైన ఉద్యోగులను ఆర్బీకేలకు పరిమతం చేసి, వారి సేవలను వినియోగించుకుంటున్నారు.


కొద్దికాలంగా పశువైద్య సేవలు, పశుదాణా, రొయ్యలు, చేపలు సాగు చేసే ప్రాంతాల్లో ఆక్వా సీడ్‌, ఫీడ్‌ వంటి ఇన్‌పుట్స్‌ను అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్బీకేల్లోని కియో్‌స్కలో పేరు, అవసరమైన విత్తనాలు ఎరువు లు, పురుగు మందులు నమోదు చేయించి, నగ దు చెల్లింపులు జరిపితే.. 48 గంటల్లో డోర్‌ డెలివరీ చేస్తారని ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పారు. అయితే డోర్‌ డెలివరీ ఎక్కడా అమలు కావడం లేదు. గతంలో వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది రైతుల పొలాలకు స్వయంగా వెళ్లి పంట స్వరూపం, రైతు వివరాలను ట్యాబుల్లో నమోదు చేసేవారు. ఇప్పుడు అలా చేయడంలేదనే విమర్శలున్నాయి.  


అనుసంధానంపై అనుమానాలు 

సహకార సంఘాలను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు అగ్రి ఇన్‌పుట్స్‌ అందించేందుకు తీసుకొచ్చే సరుకును నిల్వ చేయడానికి తగిన వసతులు లేవు. పీఏసీఎ్‌సలకు గోదాముల నిర్మాణానికి కేంద్రం సాయం, నాబార్డు రుణం అందుతోంది. దీంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని ప్రభు త్వ పెద్దలు భావిస్తున్నారు. పీఏసీఎ్‌సలకు గోదాముల నిర్మాణానికి అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ కింద కేంద్రం కొంత, ఆప్కాబ్‌ ద్వారా నాబార్డు కొంత రుణం ఇస్తోంది. గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ఖాళీ స్థలాలను ఎంపిక చేస్తోంది. వీటికి సంబంధించి సహకారశాఖ పేరుతో రెవెన్యూ అధికారులు స్వాధీన పత్రాలు అందిస్తున్నారు. అయితే గోదాముల నిర్మాణానికి రుణాన్ని మాత్రం పీఏసీఎ్‌సలే నాబార్డుకు చెల్లించాల్సి ఉంటుంది. నామమాత్రపు అద్దెలు వడ్డీకే సరిపోవని, రుణభారాన్ని ఏవిధంగా తీర్చాలన్న ప్రశ్న పీఏసీఎస్‌ వర్గాల్లో తలెత్తుతోంది. ఇక సహకార సంఘాల్లోని రైతుల ఖాతాలను ఆర్బీకేలకు అనుసంధానం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. కానీ పీఏసీఎ్‌సల్లోని రైతులకందించే రుణ ఖాతాలను ఆర్బీకేలకు అనుసంధానం చేయడం నాబార్డు, ఆప్కాబ్‌, డీసీసీబీల విధానానికి విరుద్ధం. అంతేగాక రైతుల ఖాతాల వివరాలకు భద్రత ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


కార్యాలయాల్లో అరకొర వసతులు 

2020 మే 30న ఆర్బీకే వ్యవస్థకు జగన్‌ సర్కారు శ్రీకారం చుట్టింది. 234 అర్బన్‌ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. కానీ వందల ఆర్బీకేల్లో సిబ్బందికి కనీస వసతులు లేవు. అరకొర వసతులతో పని చేస్తున్నారు. 3 వేల ఆర్బీకేలకు సొంత భవనాలు కడుతున్నామని చెబుతున్నా.. అత్యధిక శాతం అద్దె ఇళ్లల్లో, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో నడుపుతున్నారు. 

Read more