కొలంబో : శ్రీలంక నూతన ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే శనివారం తన మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు. ఆయన మంత్రివర్గంలో గరిష్ఠంగా 20 మంది మంత్రులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. పార్లమెంటులో ఆయన మెజారిటీని నిరూపించుకోవడానికి అధికార పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
జీఎల్ పెయిరిస్, దినేశ్ గుణవర్ధనే, ప్రసన్న రణతుంగ, కాంచన విజేశేకరలను విక్రమసింఘే మంత్రివర్గంలో చేర్చుకున్నారు. పెయిరిస్‌కు విదేశాంగ శాఖ, దినేశ్‌కు ప్రభుత్వ పాలన, ప్రసన్నకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం; కాంచనకు విద్యుత్తు, ఇంధనం శాఖలను అప్పగించారు.
ఇటీవల రాజీనామా చేసిన మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స మంత్రివర్గంలో కూడా పెయిరిస్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరేందుకు శ్రీలంక ప్రతిపక్షాల్లో చాలా పార్టీలు విముఖత వ్యక్తం చేశాయి.
దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరుడు మహింద రాజపక్స ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశాధ్యక్ష పదవికి గొటబయ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో మహింద తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం యునైటెడ్ నేషనల్ పార్టీ నేత రణిల్ విక్రమసింఘేను ప్రధాన మంత్రిగా గురువారం నియమించారు.
ఇవి కూడా చదవండి