శివ శివా..!

ABN , First Publish Date - 2022-05-09T06:26:05+05:30 IST

శివ శివా..!

శివ శివా..!
అక్రమార్కులు చదును చేసిన రామలింగేశ్వరస్వామి ఆలయ స్థలం

నందిగామ రామలింగేశ్వరస్వామి భూములు అన్యాక్రాంతం

ఆలయం వెనుక ఉన్న రూ.15 కోట్ల విలువైన భూమిపై కన్ను

బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి యత్నం

రాత్రికి రాత్రి చదును చేసిన ఆక్రమణదారులు

అక్రమ రిజిస్ట్రేషన్‌, అధికార పార్టీ అండతోనే..


గుడినే కాదు.. గుడిలో లింగాన్ని కూడా మాయం చేసే మాయగాళ్లు నందిగామ ఇలవేల్పయిన రామలింగేశ్వర స్వామి ఆలయంపై కన్నేశారు. ఉదయం లేవడంతోనే మహేశ్వరా.. మమ్మల్ని రక్షించు.. అంటూ నక్క వినయాలు ప్రదర్శిస్తూ.. రాత్రి కాగానే ఆ మహేశ్వరుడికే టోకరా వేస్తూ ఆయన స్థలాన్నే చదును చేసేస్తున్నారు. ఆలయ అధికారులు, ఉన్నతాధికారులకు కూడా ముడుపులు అందడంతో మూడో కంటికి తెలియకుండా ముక్కంటి భూములనే స్వాహా చేస్తున్నారు. 


నందిగామ, మే 8 : నందిగామలోని రామలింగేశ్వరస్వామి ఆలయానికి అత్యంత విలువైన భూములున్నాయి. ఈ భూములపై దశాబ్దకాలంగా రాజకీయ పార్టీల నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కన్నేశారు. స్వామివారి ఆలయంలో సేవలందించే మంగళ్లు, చాకళ్లు, ఇతర కులవృత్తుల వారికి ఇనాం కింద రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈ భూములు ఇచ్చారు. సదరు భూములను ఆయా సేవకులు వంశపారంపర్యంగా అనుభవించాలి తప్ప ఎటువంటి క్రయవిక్రయ అధికారాలు లేవు. కానీ, ఇటీవల కాలంలో ఆ భూములకు పెద్ద ఎత్తున ధరలు రావడంతో కొందరు అమ్ముకున్నారు. మరికొందరు వాటిని అనుభవించే స్థితిలో కూడా లేరు. 

అక్రమార్కుల కన్ను

కబ్జా చేసినా ఇదేమిటని ప్రశ్నించే స్థాయిలేని వారి ఆస్తులే లక్ష్యంగా అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమార్కులు స్కెచ్‌ వేశారు. ఇనాం అనుభవదారుల రూప సారూప్యం ఉన్న వ్యక్తులకు నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించి వారితో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు సమాచారం. నందిగామ మునిసిపల్‌ పరిధిలో శంకరమంచి పార్వతి అనే మహిళ కుటుంబానికి ఆధారంగా ఉన్న ఇనాం భూమితో పాటు మరికొందరి భూములను ఇలాగే గతంలో అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అధికారులను లోబరుచుకుని కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కొల్లగొట్టారు. ఇదే క్రమంలో ఆలయానికి వెనుక భాగంలో సర్వే నెంబర్‌ 522-3లో ఉన్న 15 సెంట్ల భూమిని అర్చకుల నివాసం కోసం కేటాయించారు. ఈ భూమిలో నివాసం ఉంటున్న శంకరమంచి పార్వతికి తెలియకుండా సదరు విలువైన నివాస స్థలానికి అక్రమార్కులు నకిలీ వీలునామా సృష్టించి అధికారుల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ విషయంపై బ్రాహ్మణ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. దీనిని అక్రమార్కులు ఎదుర్కోలేకపోయారు. కొద్దికాలంగా స్తబ్దుగా ఉండి శనివారం రాత్రి యంత్రాల సహాయంతో స్థలాన్ని చదును చేశారు. బహుళ అంతస్థు భవన నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన స్వామివారి భూమిని ఇంత దారుణంగా ఆక్రమిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. పెద్దఎత్తున ముడుపులు అందడం కారణంగానే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు వారికి సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో రికార్డులను సైతం తారుమారు చేసే కుట్ర చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి సదరు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కావడంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విలువైన స్థలాన్ని అధికారులు కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు జరిగితే సహించేది లేదని, అవసరమైతే ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్నారు. 


చర్యలు తీసుకుంటాం..

ఆ స్థలం ఆలయానికి చెందినది. ఆక్రమణదారులపై కేసు నమోదు చేస్తాం. దాని పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతాం.


- హరిగోపీనాథ్‌, ఆలయ ఈవో




Read more