గాలి వాన బీభత్సం

ABN , First Publish Date - 2022-05-11T07:18:51+05:30 IST

శాంతిపురం మండలంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.

గాలి వాన బీభత్సం
బెళ్లకోగిలలో నేలమట్టమైన అరటిచెట్లు

శాంతిపురంలో 500 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు

పదికిపైగా గ్రామాలకు ఆగిన సరఫరా


శాంతిపురం, మే 10: శాంతిపురం మండలంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బెల్లకోగిల, అనికెరె, రేగడదిన్నెపల్లె, శివకురుబూరు, చెంగుబల్ల, శెట్టిబల్ల, మొరసనపల్లె, వడ్డివానికొత్తూరు గ్రామాల్లో తీవ్రత ఎక్కువగా ఉండింది. దాదాపు 500 ఎకరాల్లో టమోటా, బీన్స్‌, కాకర, వరి, సొరకాయతోటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలాయి. అరటిచెట్లు కిందపడ్డాయి. పట్టుపురుగుల షెడ్లు, గ్రీన్‌హౌ్‌స ధ్వంసమయ్యాయి. వడగండ్లకు టమోటాలు, మామిడికాయలు దెబ్బతిన్నాయి. టమోటాకు మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తున్న తరుణంలో తోటలు ధ్వంసంకావడం రైతులను కలచివేసింది. కాస్తోకూస్తో ఉన్న మామిడికాయలూ నేలరాడంతో నిరాశను మిగిల్చింది. కారేగానూరు గ్రామంలో మూడు పూరిగుడిసెలు ధ్వంసమై బాధితులు నిరాశ్రయులయ్యారు. పదికిపైగా గ్రామాల్లో 100 విద్యుత్‌ స్తంభాలు, 50 ట్రాన్స్‌ఫార్మర్లు నేలమట్టమయ్యాయి. దీంతో సోమవారం రాత్రి నుంచి ఆయా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా స్తంభించి అంధకారం నెలకొంది. వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట, ఆస్తినష్టాలను అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, పంట, ఆస్తినష్టం కలిగిన రైతులు, ప్రజలను ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు కోరారు. గాలివాన ప్రభావిత గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించి రైతులను కలుస్తారన్నారు. 


 ఉమ్మడి జిల్లాలో 35 మండలాల్లో వర్షం


చిత్తూరు కలెక్టరేట్‌, మే 10: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారిన నేపథ్యంలో వీచిన ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో ఆకాశం మేఘావృతమై గాలులు వీచింది.  సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు  35 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పుంగనూరులో 36.4, అత్యల్పంగా శ్రీకాళహస్తిలో 0.8 మి.మీ నమోదైంది. మండలాల వారీగా.. పెద్దపంజాణిలో 19.8, వాయల్పాడులో 18.2, బైరెడ్డిపల్లెలో 16.2, శాంతిపురంలో 12.4, నిమ్మనపల్లెలో  10.4, యాదమరిలో 10.2, పెనుమూరులో 10, చౌడేపల్లెలో 9.4, రామకుప్పంలో 8.8, గంగవరంలో 8.6, పీటీఎంలో 8.4, కేవీపల్లెలో 8.4,  పీలేరులో 8.2, పలమనేరులో 8, సోమలలో 6.4, ఐరాలలో 6.2, కలికిరిలో 5.6, తవణంపల్లెలో 5.4, బి.కొత్తకోటలో 5.2, కలకడలో 5.2, సదుంలో 5.2, రొంపిచెర్లలో 4.2, జీడీనెల్లూరులో 4, చిన్నగొట్టిగల్లులో 3.6, పూతలపట్టులో 3.6, పులిచెర్లలో 3.2, వి.కోటలో 3.2, చిత్తూరులో 2.8, ఎర్రావారిపాళెంలో 2.4, కుప్పంలో 2.2, గుడుపల్లెలో 1.6, పెద్దమండ్యంలో 1.4, తొట్టంబేడులో 1 మి.మీ చొప్పున వర్షం కురిసింది.


వి.కోట మండలంలో గాలి వానకు భారీ వృక్షాలు విద్యుత్‌ లైన్లపై పడటంతో పలు గ్రామాల్లో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్తంభాలూ నేలకొరిగాయి. కుప్పం మండలంలో నిమ్మతోట, టమోటా, బీన్స్‌, ఉర్లగడ్డ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ఐరాల ఎంపీడీవో కార్యాలయం సమీపంలో కొబ్బరి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. పెనుమూరు, యాదమరి, సోమల తదితర మండలాల్లోనూ గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. 




Read more