ఏడేళ్లుగా వ్యాపారం చేస్తున్నా అప్పులుండటంతో ‘Pushpa’ సినిమా స్టైల్లో స్మగ్లింగ్‌.. ఇలా సీన్ రివర్స్..

ABN , First Publish Date - 2022-05-14T12:15:14+05:30 IST

వాళ్లు అరటి పండ్ల వ్యాపారులు. ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నా.. లాభాలు రాకపోగా

ఏడేళ్లుగా వ్యాపారం చేస్తున్నా అప్పులుండటంతో ‘Pushpa’ సినిమా స్టైల్లో  స్మగ్లింగ్‌.. ఇలా సీన్ రివర్స్..

  • పైన అరటి పండ్లు.. కింద ఎర్రచందనం దుంగలు
  • ఇద్దరి అరెస్ట్‌.. రూ.68.18 లక్షల విలువైన దుంగలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : వాళ్లు అరటి పండ్ల వ్యాపారులు. ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నా.. లాభాలు రాకపోగా అప్పులు పేరుకున్నాయి. దీంతో.. ఏదో ఒకటి చేసి ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలని భావించారు. ఇందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. సినీ పక్కీలో ఎర్రచందనం (Red Sandal) స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు అరటి పండ్ల వ్యాపారులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.68.18 లక్షల విలువైన క్వింటన్నర (30 దుంగలు) ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు (Kadapa) చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీ అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఏపీ నుంచి యూపీ, రాజస్థాన్‌, డిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు అరటి పండ్లు సరఫరా చేస్తుంటాడు. 


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ముల్లా బషీర్‌ అహ్మద్‌ కూడా ఇదే వ్యాపారంలో (Business) ఉన్నాడు. అతడు హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ పరిధిలోని సైనిక్‌ పురిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో.. బషీర్‌కు మహ్మద్‌ రఫీతో పరిచయం ఏర్పడింది. ఇటీవల కాలంలో అరటి పండ్ల వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో ఇద్దరికీ అప్పులు పెరిగిపోయాయి. రఫీకి ఎర్రచందనం సరఫరా చేసే వ్యక్తులతో పరిచయాలు ఉండడంతో.. స్మగ్లింగ్‌ చేసి డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన మూర్తి అనే వ్యక్తిని కలిసి.. అతడికి రూ.లక్ష చెల్లించి 30 ఎర్రచందనం దుంగలు కొనుగోలు చేశారు. వాటిని తమ అరటి పండ్ల లారీలో లోడ్‌ చేసి.. వాటి పైభాగాన్ని పూర్తిగా అరటి పండ్లతో నింపేశారు. 


పైకి చూసేందుకు అది అరటి పండ్ల (Banana) లోడ్‌తో వెళుతున్న లారీలానే కనిపిస్తుంది. దీంతో.. ఆ లారీ ఎలాంటి అడ్డంకులూ లేకుండా హైదరాబాద్‌ చేరుకుంది. మల్కాజిగిరి ప్రాంతంలోని మౌలాలికి సమీపంలోని ప్రభుత్వ భూమిలో వీటిని దాచిపెట్టారు. వాటిని విక్రయించేందుకు యత్నిస్తుండగా.. పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు.. మల్కాజిగిరి పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి.. 150 కేజీల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం దుంగలను అమ్మిన మూర్తి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాకచక్యంగా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యామ్‌ప్రసాదరావులను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు అభినందించారు.

Read more