ధర.. దిగుబడి తగ్గిపాయే

ABN , First Publish Date - 2022-05-04T05:30:00+05:30 IST

పసుపు రైతులకు ఈ సారి పంట దిగుబడి భారీగా తగ్గింది. మరి మార్కెట్లో ధరైనా ఉందా? అంటే అదీ గిట్టుబాటు కావడం లేదు. దీంతో పెట్టుబడైనా వచ్చేలా లేదు.

ధర.. దిగుబడి తగ్గిపాయే


  • గిట్టుబాటుకాక పసుపు రైతుల కుదేలు
  • అనుకూలించని కాలంతో సగానికి పడిపోయిన దిగుబడి
  • గతంతో పోలిస్తే ధరా భారీగా తగ్గింది
  • పెట్టుబడైనా రాక నష్టాల ఊబిలో రైతులు 
  • క్వింటాలకు రూ.20వేలివ్వాలని డిమాండ్‌

పసుపు రైతులకు ఈ సారి పంట దిగుబడి భారీగా తగ్గింది. మరి మార్కెట్లో ధరైనా ఉందా? అంటే అదీ గిట్టుబాటు కావడం లేదు. దీంతో పెట్టుబడైనా వచ్చేలా లేదు. ఏడాది పొడవునా రైతు ఇంటిల్లిపాది పనిచేసిన కూలి గురించి మర్చిపోవాల్సిందే? ఇదీ పసుపు రైతుల దుస్థితి.  పెట్టుబడిఎకరానికి రూ.80నుంచి రూ.90వేల అయ్యింది. ధరేమో క్విటాలుకు రూ.6500 నుంచి రూ.9500 ఉంది. దిగుబడి పది క్వింటాళ్లకు మించడం లేదు.   ఈ ధర,దిగుబడితో అప్పుల  పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము పసుపు సాగునే వదులుకొనే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

పరిగి, మే 4: వాణిజ్య పంటల్లో పసుపు ప్రధానమైంది. మార్కెట్‌లో పసుపును బంగారం అని పిలుస్తుంటారు. పసుపు ఏడాది పంట. ఏడాది పొడవునా సాగుచేసి పంట తీస్తే చివరకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. తక్కువ నీరవసరమయ్యే పసుపును నల్లరేగడి నేలల్లో ఎక్కువగా పండిస్తున్నారు. పసుపు రైతులకు పదేళ్లలో ఎప్పుడో ఓ సారి కచ్చింతగా భారీ ధర వస్తుందని రైతులంటుంటారు. ఈ సారి భారీ పెట్టుబడితో సాగుచేసిన పసుపు కలిసిరాని కాలంతో  దిగుబడి తగ్గింది. రేట్లు కూడా అంతంతే ఉంది. జిల్లాలోని 18 మండలాల్లో 6వేల ఎకరాల్లో పసుపు సాగుచేశారు. పరిగి, పూడూరు, వికారాబాద్‌, మర్పల్లి, పేద్దేముల్‌, తాండూరు, ధారూర్‌ మండలాల్లో పసుపు ఎక్కువ వేశారు. అధిక వర్షాలకు నీరు పట్టి పసుపు గడ్డ ఊరలేదని రైతులు అంటున్నారు. పరిగి మండలం జాఫర్‌పల్లి, రాఘవాపూర్‌, పరిగి, మాధారం, పొల్కంపల్లి, బర్కత్‌పల్లి, నస్కల్‌, నారాయణపూర్‌; లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో టెర్మరిక్‌ ఎక్కుం సాగు చేశారు.

లాభాల పంట నష్టాలు తెచ్చింది..

ఇతర పంటల వలె కాకుండా పసుపు ఏడాదిలో ఒకే పంట వస్తుంది. చెరకు లాగీ దీరకాల పంట. నల్ల రేగడి భూముల రైతులు పసుపును ఎక్కువ వేశారు. ఎకరా పసుపు సాగుకు విత్తనం రూ.25వేలు, కోడి ఎరువుకు రూ.25వేలు, కలుపు నివారణకు రూ.15వేలు, డీఏపీ, మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాష్‌ రూ.7వేలు, దున్నుకానికి రూ.20వేలు ఇలా మొత్తం రూ.80 నుంచి రూ.90వేల పెట్టుబడి అవుతుంది. బాగా పండితే ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల ఒట్టు పసుపు పండుతుంది. క్వింటాలుకు 10వేల నుంచి 12వేల ధర ఉంటే పెట్టుబడి పోను రైతుకు రూ.లక్ష పైచిలుకు మిగులుతుంది.

దిగుబడి లేదు.. ధరా పడిపోయె!

ఈ సారి పసుపు దిగుబడి బాగా పడిపోయింది. ఎకరానికి సరాసరి 8 నుంచి పది క్వింటాళ్లే వస్తోంది. సాధారణ దిగుబడితో పోలిస్తే ఇది నాలుగైదు క్వింటాళ్లు తక్కువ. ఈ మేరకు మార్కెట్లో తక్కువ పంట వస్తే రేటు పెరగాలి కానీ.. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పరిగి మార్కెట్‌లో క్వింటాలు రూ.6500 నుంచి నాణ్యతను బట్టి రూ.9500 వరకు పెడుతున్నారు. ఈ ధరకు అమ్మితే పెట్టుబుడులు కూడా వస్తలేవని, మరి రైతుల కష్టం నీటి పాలే అయ్యిందని కూడా సరిగ్గా రా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఆరేళ్ల కింద పసుపు ధర రూ.18వేలకుపైగా పలికింది. ఇప్పుడాధరలో సగంసగం తగ్గింది.

పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు

ఈ సారి పసుపు పం టతో పెట్టుబడైనా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాలో వేశారు. 10 క్వింటా ళ్లయినా వచ్చేలా లేదు. రూ.80వేల పెట్టుబడైంది. ధర కూడా బాగా తగ్గింది. ఆశతో అప్పులు తెచ్చి పెట్టాం. మిత్తి, అసలు కట్టాలంటే ఏఓ ఒకటి అమ్మాల్సిన పరిస్థితే వచ్చింది. పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

                                                                                      - సుధాకర్‌రెడ్డి, పసుపు రైతు, 

నారాయణపూర్‌ క్వింటాలుకు రూ.20 వేలివ్వాలి

పసుపునకు క్వింటాలుకు రూ.20వేల కసీన ధర కల్పించాలి. ఇప్పుడు మార్కెట్‌లో వస్తున్న ధరలు రైతుల ఏ మాత్రం గిట్టుబాటు కాదు. సర్కారు రైతులకు ప్రత్యేక ధర, వసతులు కల్పిస్తామని చెబుతోందే కానీ పట్టించుకోవడం లేదు. దిగుబడులు లేని సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు పసుపు సాగునే వదులుకొనే ఆస్కారం ఉంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తున్న పసుపునకు ధర పెంచేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

                                                                               -టి.ప్రదీప్‌, పసుపు రైతు, సుల్తాన్‌పూర్‌

Read more