జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-12T06:26:34+05:30 IST

జిల్లాలో ఈ సంవత్సరం ఆరువేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వచ్చి వెళ్లిన తర్వాత ఆయిల్‌పామ్‌ సాగుపై అధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికే పదమూడు వందల ఎకరాల కోసం రైతులను ఎంపిక చేయగా మిగితా రైతులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు సన్నద్ధం

వానాకాలం నుంచి ఆరువేల ఎకరాల్లో సాగు లక్ష్యం

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ

ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన

జిల్లాలో ఇప్పటి వరకు 1300 ఎకరాల్లో రైతుల ఎంపిక

 నిజామాబాద్‌, మే 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఈ సంవత్సరం ఆరువేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వచ్చి వెళ్లిన తర్వాత ఆయిల్‌పామ్‌ సాగుపై అధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికే పదమూడు వందల ఎకరాల కోసం రైతులను ఎంపిక చేయగా మిగితా రైతులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీపై మొక్కలను సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సాగు ప్రారంభంకాగానే ఆయిల్‌పామ్‌ను సాగుచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

   రైతులకు అవగాహన..

జిల్లాలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌ సాగుకోసం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పెద్దమొత్తంలో సాగుచేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నా రు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ 6వేల ఎకరాల్లో ప్లానిటేషన్‌ చేసేవిధంగా అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ఆర్మూర్‌ మండలం చేపూ ర్‌లో ఆయిల్‌పామ్‌ సాగుకోసం 40 ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో ఆరు వేల ఎకరాల కోసం మొక్కలను సిద్ధం చేస్తున్నా రు. నిర్ణీత సైజులోకి రాగానే ఎంపిక చేసిన రైతులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

    ఆరువేల ఎకరాల్లో ప్లాంటేషన్‌..

జిల్లాలో ఆరువేల ఎకరాల్లో ఈ సంవత్సరం టార్గెట్‌గా పెట్టుకుని ప్లాంటేషన్‌ చేసేందుకు నిర్ణయించగా ఇప్పటికే 1300 ఎకరాల కోసం అధికారులు రైతులను ఎంపిక చేశారు. వీరికి ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. మిగతా రైతులను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్మూర్‌, నందిపేట, వేల్పూర్‌, బోధన్‌, మాక్లూర్‌, కోటగిరి, రుద్రూర్‌ మండలాల పరిధిలో రైతులను ఎంపిక చేశారు. మిగతా మండలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నీరు ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టు నుంచి కాల్వలు ఉన్నచోట ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసేందుకు ఉద్యానవనశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సబ్సిడీపై రూ.20 మొక్క..

ఆర్మూర్‌ మండలం చేపూర్‌లోని నర్సరీలో ఆయిల్‌పామ్‌ మొక్కలను పెంచుతుండగా సబ్సిడీపై 20 రూపాయలకు ఒక మొక్క చొప్పున రైతులకు సరఫరా చేయనున్నారు. ఎకరాకు 56 నుంచి 57 మొక్కలను పెట్టనున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో పాటు మూడేళ్ల వరకు ఈ భూముల్లో అంతర్‌ పంటలను కూడా సాగుచేయనున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతులకు సబ్సిడీ కూడా అందించనున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా సబ్సిడీ ప్రకటించకున్నా 60 శాతం వరకు నాలుగేళ్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం బట్టి తెలుస్తోంది. ఇవేకాకుండా సబ్సిడీ పై ఆయిల్‌ సాగుకోసం మైక్రో ఇరిగేషన్‌ కింద డ్రిప్‌ కూడా అందించనున్నారు. ఎకరాకు 49వేల రూపాయలు ఖర్చు అవుతుండగా రైతులు సబ్సిడీ పోను మిగతా మొత్తం చెల్లిస్తే డ్రిప్‌ మంజూరు చేయనున్నారు.

వానాకాలంలో మొక్కల సరఫరా..

వానాకాలం సాగు మొదలుకాగానే మొక్కల పెరుగుదలకు అనుగుణంగా ఎంపిక చేసిన రైతులకు ఆయిల్‌పామ్‌ మొక్కలను సరఫరా చేయనున్నారు. నాలుగో సంవత్సరం నుంచి ఆయిల్‌పామ్‌ కాతకు రానుండడంతో అప్పటి వరకు అంతర్‌పంటలను సాగుచేసే విధంగా రైతులను ప్రోత్సహించనున్నారు. ఈ ఆయిల్‌పామ్‌ కోతకు వచ్చే సమయానికి జిల్లాలో వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉత్సాహం ఉన్న రైతులను ప్రోత్సహించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి జిల్లాకు వచ్చి వెళ్లిన తర్వాత రైతుల ఎంపికను వేగవంతం చేశారు. ఈ సంవత్సరం ఎలాగైనా సాగును మొదలుపెట్టి వచ్చే మూడేళ్లలో సుమారు 30 నుంచి 40వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుచేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు ముందుకు వస్తేనే జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఆయిల్‌పామ్‌ సాగయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఈ సంవత్సరం ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి నరసింహదాస్‌ తెలిపారు. ఇప్పటికే రైతుల ఎంపిక మొదలుపెట్టామన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు అవసరమైన మొక్కలను నర్సరీలో పెంచుతున్నామన్నారు. సాగుచేసే రైతులందరికీ సబ్సిడీ అందిస్తామని ఆయన తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగు వల్ల రైతులకు లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు.


Read more