సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-08T06:44:48+05:30 IST

వానాకాలం సీజన్‌లో పంటల సాగు కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సాగుకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసేందుకు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. వానాకాలంలో రైతులు వేసే విత్తనాలకు అనుగుణంగా పచ్చిరొట్టతో పాటు విత్తనాలను అందుబాటులో ఉంచుతుంది.

సాగుకు సన్నద్ధం
సొసైటీలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న విత్తన బ్యాగులు

వానాకాలం సీజన్‌లో పంటల సాగు కోసం విత్తనాలు సిద్ధం

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధికారుల కసరత్తు 

సొసైటీల ద్వారా పచ్చిరొట్ట, వరి విత్తనాల సరఫరా

ఆరు లక్షల ఎకరాలలో సాగవనున్న వరి

సబ్సిడీపై సోయాతో పాటు ఏ ఇతర విత్తనాల సరఫరాకు మినహాయింపు

సాగుకు ప్రణాళికలు సిద్ధం  

కలెక్టర్‌కు ఎరువులు, విత్తనాల వివరాలపై అధికారులు నివేదిక

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు అవకాశం 

జిల్లా పరిధిలో 5.42 లక్షల ఎకరాలకు పైగా సాగుపై అంచనా

నిజామాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానాకాలం సీజన్‌లో పంటల సాగు కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సాగుకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసేందుకు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. వానాకాలంలో రైతులు వేసే విత్తనాలకు అనుగుణంగా పచ్చిరొట్టతో పాటు విత్తనాలను అందుబాటులో ఉంచుతుంది. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లను చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు లక్షల ఎకరాల వరకు వరి సాగు కానుండడంతో కావాల్సిన రకాలను కూడా రైతులకు అందించేందుకు స్టాక్‌ను సిద్దం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వానాకాలంలో సాగుచేసే సబ్సిడీ సోయా మాత్రం ఈ సంవత్సరం కూడా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేయడం లేదు. పచ్చిరొట్టకు మినహా వేరే ఏ విత్తనాలకు కూడా సబ్సిడీపై సరఫరా చేయకపోవడం గమనార్హం.

వానాకాలం సాగుకు ప్రణాళికలు

ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు వానాకాలం సీజన్‌లో సాగుకు సన్నదమవుతున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల పరిధిలోని వ్యవసాయ అధికారులు వానాకాలం ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్‌ల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, వివరాలను కూడా నివేదికల్లో పేర్కొన్నారు. జిల్లాలో ఏయే పంటలను ఎక్కువగా వేస్తారో? ఆ ప్రణాళికల్లో పొందుపర్చారు. ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసే విత్తనాలతో పాటు ప్రైవేట్‌ సంస్థల ద్వారా ఏ విత్తనాలను సరఫరా చేస్తారో? అందులో పొందుపర్చారు. ఉమ్మడి జిల్లా పరిదిలో ఈ వానాకాలం తొమ్మిది లక్షల ఎకరాలకుపైగా సాగు కానుంది. జిల్లా పరిధిలోని ఐదు లక్షల 42వేల ఎకరాలకుపైగా వానాకాలంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికల్లో జిల్లాలో నాలుగు లక్షల వరకు వరి సాగవుతుందని అంచనా వేశారు. కామారెడ్డి జిల్లా పరిధిలో  నాలుగు లక్షల ఎకరాల వరకు పంటలు సాగవుతాయని అంచనా వేయగా.. అందులో రెండు లక్షల ఎకరాల వరకు వరి వేస్తారని అంచనా వేశారు. మిగతా రెండు లక్షల ఎకరాల వరకు సోయా, కంది, పెసర, మొక్కజొన్న పంటలు ఎక్కువగా వేస్తారని పొందుపర్చారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి పంపించిన నివేదికల్లో స్థానిక వ్యవసాయ అధికారులు పొందుపర్చారు.

అన్ని మండలాల పరిధిలో సరఫరా

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వానా కాలం సీజన్‌ సాగు కోసం విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. అన్ని మండలాల పరిధిలో సరఫరా చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పంటలు వేసే ముందు రైతులు వేసే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా ఈ విత్తనాలను సరఫరా చేసేందుకు అందుబాటులో ఉంచారు. సబ్సిడీతో పాటు వరి విత్తనాలను సబ్సిడీ లేకుండా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం పచ్చిరొట్టతో పాటు వరి విత్తనాలు అందుబాటులో ఉండగా.. మరికొన్ని రోజుల్లో పప్పు దినుసుల విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట

రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు దంచ క్వింటాలు రూ. 6,325 ఉండగా, 65 శాతం సబ్సిడీపైన రూ.2,214లకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లను చేశారు. సన్‌హెంప్‌ రకం విత్తనాలు క్వింటాలు రూ.8,325 ఉండగా, 65 శాతం సబ్సిడీపైన రూ.2,914 అన్ని కేంద్రాల్లో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లిపెసర క్వింటాలు రూ.8,850 ఉండగా, 65 శాతం సబ్సిడీపై రూ.3,398 సరఫరా చేస్తున్నారు. రైతులకు అవసరం మేరకు దైంచ 20 వేల క్వింటాళ్లు, సన్‌హెంప్‌ ఐదు వేల క్వింటాలు ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. పిల్లిపెసర మరో వారం రోజుల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

వరి విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కువగా సాగయ్యే వరి విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లను చేస్తుంది. సారంగపూర్‌లో ఉన్న ఈ సంస్థ గోడౌన్‌ నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో వరి విత్తనాలను సరఫరా చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగు చేసే వరి ఎంటీయూ 1010 రకం వరి విత్తనాన్ని 20వేల క్వింటాళ్లను అందుబాటులో ఉంచారు. బీపీటీ ఎనిమిది వేల క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌ ఆరు వేల క్వింటాళ్లు, జేజీఎల్‌ వెయ్యి క్వింటాళ్లను ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా వీటి సరఫరాకు ఏర్పాటు చేశారు. ఎంటీయూ 1010 25కిలోల బ్యాగును రూ.850, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, జేజీఎల్‌ 25కిలోల బ్యాగు రూ.850 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇవేకాకుండా ఇతర రకాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉండడంతో ఇతర రకాల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా దొడ్డు రకాలతో పోలిస్తే సన్న రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తుండడంతో.. వాటిని కూడా అందుబాటులో ఉంచే ఏర్పాట్లను చేస్తున్నారు. 

సబ్సిడీ లేకుండా మొక్కజొన్న, సోయా

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా అయ్యే విత్తనాలకు గత రెండు సంవత్సరాల నుంచి సబ్సిడీ ఇవ్వడం లేదు. సబ్సిడీపైన మొక్కజొన్న, సోయా విత్తనాలను సరఫరా చేయడం లేదు. రైతులు ప్రైవేట్‌ విత్తన సంస్థల విత్తనాల ను డీలర్స్‌ వద్ద కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. మహారాష్ట్రలోని రైతులు, డీలర్ల దగ్గర కొనుగోలు చేసి వేస్తున్నారు. మొక్కజొన్నకు సీడ్‌ అందుబాటులో ఉన్నా.. సోయాబిన్‌కు ప్రైవేట్‌ విత్తన సంస్థల నుంచి తగినంతగా విత్తన సరఫరా లేకపోవడం వల్ల నాసిరకం విత్తనాలతో రైతులు సమస్యలు ఎదు ర్కొంటున్నారు. గత సంవత్సరం వేరే ప్రాంతాల్లో కొనుగోలు చేసిన సోయాబీన్‌ మొలకెత్తకపోవడం వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై సరఫరా అయిన సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు దిగుబడి కూడా అత్యధికంగా వచ్చింది. ఈ దఫా కూడా సరఫరా మాత్రం చేయడం లేదు. దీంతో సోయాబీన్‌ విత్తనాలు రైతులు ప్రైవేట్‌లోనే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది.

కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచాం

: విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎం, విత్తనాభివృద్ధి సంస్ధ

ఉమ్మడి జిల్లా పరిధిలో వానాకాలం సాగుకోసం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచాం. సబ్సిడీపైన పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తున్నాం. జిల్లాలో వరి సాగు చేసే రైతులకు కావాల్సిన విత్తనాలను సొసైటీల ద్వారా అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నాం.  మరికొన్ని రోజుల్లో ఇతర విత్తనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ సంవత్సరం కూడా ఏ విత్తనాలు సబ్సిడీపై ఈ సంస్థ ద్వారా అందించడం లేదు. 

Read more