ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-05T05:30:00+05:30 IST

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 21వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల ఇంటర్‌ విద్యార్థులను పరీక్షలు నిర్వమించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ వచ్చారు.

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం
హాల్‌ టికెట్‌ నెంబర్లను వేస్తున్న సిబ్బంది

- నేటి నుంచి 21వ తేదీ వరకు కొనసాగనున్న పరీక్షలు

- ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం

- 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాలకు అనుమతి

- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

- జిరాక్స్‌ సెంటర్లపై నియంత్రణ ఉండేనా?


కామారెడ్డి టౌన్‌, మే 5: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 21వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల ఇంటర్‌ విద్యార్థులను పరీక్షలు నిర్వమించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి, మార్చి నెలలోనే ముగిసేవి. కానీ కరోనా కారణంగా కళాశాలలో లేటుగా ప్రారంభమవడమే కాకుండా విద్యార్థులు సైతం కరోనా భయానికి కళాశాలలకు అంతంతమాత్రంగానే హాజరు కావడం, ప్రైవేట్‌, ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌లు అంతంత మాత్రంగానే హాజరవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సిలబస్‌ పూర్తి కాలేదు. దీంతో రెండు నెలల పాటు పరీక్షలు ఆలస్యం అయిన ప్రతీ సంవత్సరం లాగే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో మొత్తం 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 16 ప్రభుత్వ కళాశాలలు, 5 మోడల్‌ కళాశాలలు, 1 రెసిడెన్షియల్‌ కళాశాల, 19 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 41 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 43 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 5 సిట్టింగ్‌ స్క్వాడ్‌లతో పాటు 2 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 19,560 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 10,352 మంది కాగా ఇందులో జనరల్‌ 9,118, ఒకేషనల్‌ 1,234 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,208 మంది కాగా ఇందులో జనరల్‌ 8,183 , ఒకేషనల్‌ 1,025 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా గంట ముందే పరీక్ష కేంద్రాలకు హాజరై తమకు కేటాయించిన సెంటర్ల వద్ద హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఆధారంగా రూం నెంబర్‌ను చూసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తామని నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతించరని కావున విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచిస్తున్నారు. 

నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్‌ మీడియట్‌ బోర్డు అధికారులు నిమిషం నిబంధనను అమలులోకి తీసుకువచ్చారు. పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయంలోగా చేరుకోవాలని సూచించడంతో పాటు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 18005999333 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌ 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఇంటర్‌ అధికారులు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఈ పరీక్ష నిర్వహణలో వైద్య, విద్యుత్‌, పోలీసు, ఆర్టీసీ శాఖ ఉద్యోగులు పాలు పంచుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచేలా చూడాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు సైతం ఇచ్చారు.

ప్రతీసారి నిబంధనలను పట్టించుకోని జిరాక్స్‌ సెంటర్ల నిర్వాహకులు

పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ జరగకూడదనే ఉద్దేశ్యంతో అధికారులు ముందుస్తుగానే జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ లాంటి ప్రాంతాల్లో నిబంధనలు ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రతీసారి పరీక్ష ప్రారంభమైన నిమిశాల వ్యవధిలోనే జిరాక్స్‌ సెంటర్లను తెరుస్తున్నారు. జిరాక్స్‌ సెంటర్లను తెరిసి ఉంచినప్పటికీ నియంత్రణ చర్యలు చేట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పరపాటిగా మారింది. ఈ సంవత్సరమైన జిరాక్స్‌ సెంటర్ల మూసివేతపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారా లేక ప్రతీసారి మాదిరి చూసీచూడనట్లు వ్యవహరిస్తారో వేచిచూడాలి


పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నాం

- సలాం, ఇంటర్‌ నోడల్‌ అధికారి, కామారెడ్డి

జిల్లాలో నేటి నుంచి జరగనున్న పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. మొత్తం 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 19,560 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. అర గంట ముందే పరీక్ష కేంద్రాలకు పంపుతాం.

Read more