Hyderabadలో నీటి ఇబ్బందులకు ఇక శాశ్వత పరిష్కారం..

ABN , First Publish Date - 2022-05-14T13:34:02+05:30 IST

ప్రస్తుతం మూడు ఫేజ్‌ల్లో కృష్ణా జలాలను నగరానికి తీసుకొస్తున్నా, వేసవి వస్తే నీటి తరలింపుల్లో ఇబ్బందులు తప్పడం లేదు...

Hyderabadలో నీటి ఇబ్బందులకు ఇక శాశ్వత పరిష్కారం..

  • సుంకిశాలతో జల కళ
  • 20 టీఎంసీలు తరలింపే లక్ష్యం
  • సాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచీ నీటిని తీసుకునే అవకాశం
  • భూగర్భ లోతున భారీ బావి నిర్మాణం
  • వచ్చే ఏడాది జూన్‌లోగా అందుబాటులోకి ప్రాజెక్టు

ప్రస్తుతం మూడు ఫేజ్‌ల్లో కృష్ణా (Krishna) జలాలను నగరానికి తీసుకొస్తున్నా, వేసవి వస్తే నీటి తరలింపుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. తాత్కాలిక చర్యలతో పెద్దగా  ఉపశమనం లభించడం లేదు. దీంతో భవిష్యత్‌ తాగునీటి అవసరాలకు నీటిని తరలించేందుకు శాశ్వత చర్యలకు వాటర్‌బోర్డు శ్రీకారం చుట్టింది. వేసవిలోనూ నీటి తరలింపునకు ఆటంకాలు లేకుండా ఎండీడీఎల్‌ (మినిమం డ్రాయల్‌ డౌన్‌ లెవెల్‌) కంటే దిగువ నుంచి కూడా నీటిని తరలించేందుకు సుంకిశాల ఇన్‌టెక్‌ వెల్‌ ప్రాజెక్టును చేపడుతోంది. వచ్చే ఏడాది జూన్‌కు ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులను వేగవంతం చేసింది.  నేడు సుంకిశాల ఇన్‌టెక్‌ వెల్‌ ప్రాజెక్టుకు భూమి పూజ జరగనుంది. దీంతో త్వరలోనే నగర నీటికష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ : నాగార్జునసాగర్‌ పరిధిలోని సుంకిశాల (Sunkisala) వద్ద ఇన్‌టెక్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.1,450 కోట్లతో నాలుగు నెలల క్రితం వాటర్‌బోర్డు (Water Board) ప్రారంభించింది. మున్ముందు మరిన్ని ఫేజ్‌లను పెంచినా నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ (Greater Hyderabad) తాగునీటి అవసరాల కోసం నిత్యం 270 మిలియన్‌ గ్యాలన్ల నీటిని మూడు ఫేజ్‌ల్లో తీసుకుంటుండగా, మున్ముందు మరో 20 టీఎంసీలను తరలించే లక్ష్యంతో సుంకిశాల ఇన్‌టెక్‌ చానల్‌ తీసుకొస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్ట్‌ స్కీమ్‌ ఫేజ్‌ 1, 2, 3లతో పాటుగా భవిష్యత్‌ (Future) తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు తీర్చనుంది.


ప్రస్తుతం ఇలా..

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కెనాల్‌ నుంచి నగరానికి మూడు ఫేజ్‌ల్లో నీటిని తరలిస్తున్నారు. ఈ కెనాల్‌ సాగునీటి తరలింపు కోసం ఏర్పాటు చేసింది. కానీ తాత్కాలికంగా మంచినీటి తరలింపునకు వినియోగిస్తున్నారు. దీనివల్ల వేసవిలో నీటి తరలింపునకు ఆటంకం కలుగుతోంది. ఒకవేళ నాగార్జున సాగర్‌లో నీరు 510 ఫీట్ల కంటే దిగువకు చేరితే అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఏఎంఆర్పీ కెనాల్‌కు నీరు అందదు. ఇలాంటి సమయంలో నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ (Nagarjuna Sagar) నుంచి అత్యవసర పంపింగ్‌ చేసి ఏఎంఆర్పీకి నీటిని తరలించాల్సి ఉంటుంది.


భవిష్యత్తులో ఇలా..

సుంకిశాల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే తాత్కాలికంగా పంపింగ్‌ చేయాల్సిన అవసరాలు రావు. పూర్తి స్థాయిలో నీటిని తీసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, నాగార్జున సాగర్‌లో నీటి నిల్వలు తగ్గినా సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా డెడ్‌ స్టోరేజీ నుంచి కూడా తాగునీటిని తరలించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రాజెక్టులో లోతైన భారీ బావి తీస్తారు. నీటి తరలింపునకు మూడు ఇన్‌టెక్‌ టన్నెల్స్‌, మోటార్లు, ట్రాష్‌ గేట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్‌, ప్రత్యేక హెచ్‌టీ ఫీడర్‌ మెయిన్లు, ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్లు, స్టాఫ్‌ క్వార్టర్లు, ఎస్కేప్‌ టన్నెళ్లు అందుబాటులోకి రానున్నాయి.


పనులు సాగుతున్నాయిలా..

వచ్చే ఏడాది జూన్‌ వరకు సుంకిశాల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ బావి కోసం రాతి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. 82 మీటర్ల లోతులో రాయి తొలగించాల్సి ఉండగా, ఇప్పటికే 62 మీటర్లు పూర్తయ్యింది. యాక్సెస్‌ టన్నెళ్లు, లింక్‌ టన్నెళ్ల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ట్రాన్స్‌కో నుంచి ప్రత్యేకంగా హెచ్‌టీ ఫీడర్‌ మెయిన్‌ తీసుకున్నారు. మొత్తం ఐదు కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు ఏర్పాటయ్యాయి. నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రచించారు.

Read more