పల్లకి సేవపై నిషేధం

ABN , First Publish Date - 2022-05-04T14:04:42+05:30 IST

మైలాడుదురై పట్టణ ప్రవేశ వేడుకల్లో ధరుమపురం ఆధీనం (పీఠాధిపతిని)ను సేవకులు పల్లకీలో మోస్తూ ఊరేగించరాదంటూ సబ్‌కలెక్టర్‌ బాలాజీ జారీ చేసిన ఉత్తర్వులపై ఆధ్మాత్మిక, హిందూ సంస్థలు తీవ్ర

పల్లకి సేవపై నిషేధం

- ఆధ్యాత్మిక, హిందూ సంస్థల ఆగ్రహం

- అనుమతించాలంటూ కలెక్టర్‌కు వినతి


చెన్నై: మైలాడుదురై పట్టణ ప్రవేశ వేడుకల్లో ధరుమపురం ఆధీనం (పీఠాధిపతిని)ను సేవకులు పల్లకీలో మోస్తూ ఊరేగించరాదంటూ సబ్‌కలెక్టర్‌ బాలాజీ జారీ చేసిన ఉత్తర్వులపై ఆధ్మాత్మిక, హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పల్లకీ సేవపై నిషేధం విధించడం గర్హనీయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మంగళవారం ఆధ్యాత్మిక సేవా సంఘాల సమాఖ్య నాయకులు మైలాడుదురై కలెక్టర్‌ లలితను కలిసి ఆధీనం పల్లకీ సేవను ఎప్పటిలాగే చేసేందుకు అనుమతించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ధరుమపురం ఆధీనంను భక్తులు చొక్కనాధుడి (పరమశివుడి)గానే భావిస్తారని, పూర్ణకుంభంతో పూజలు నిర్వహించి కొలువుపీఠంలో ఆశీనులు గావించి భగవత్‌ స్వరూపులుగా పరిగణిస్తారని, అంతటికీర్తి ప్రతిష్టలు కలిగిన ఆధీనం పల్లకీసేవ నిషేధించడం తగదని కలెక్టర్‌ కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. 

   మైలాడుదురై ధరుమపురం ఆధీనం ఆధ్వర్యంలో ప్రతియేటా మేలో పట్టణ ప్రవేశ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఆ సమయంలో ఆధీనం మాసిలామణి దేశిక జ్ఞానసంబంధ పరమాచార్య స్వామిని సేవకులు పల్లకీలో మోస్తూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ద్రావిడ కళగం, కొన్ని నాస్తికవాద సంస్థలు మనిషిని మనుషులు మోసుకెళ్లే ఈ పల్లకీ సేవపై నిషేధం విధించాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నెల 22న పట్టణ ప్రవేశ వేడుకలు నిర్వహించేందుకు ఆధీనం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపడుతున్న నేపథ్యం లో పట్టణ ప్రవేశవేడుకల్లో ధరుమపురం ఆధీనంను మనుషులు మోసుకెళ్ళకూడదంటూ సబ్‌కలెక్టర్‌ బాలాజీ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం సృష్టించింది. మైలాడుదురై ధరుమపురం ఆధీనం ఆధ్వర్యంలో జరుగనున్న పట్టణ ప్రవేశ వేడుకల్లో ఆధీనంను పల్లకీలో సేవకులు మోసుకెళ్ళటం మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుందని, అంతే కాకుండా ఈ రకం పల్లకీ సేవను వ్యతిరేకిస్తూ ద్రావిడ కళగం వంటి కొన్న సంస్థలు ఆంధోళనకు సిద్ధమవుతున్నాయని, అదే జరిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని మైలాడుదురై డీఎస్పీ తమకు నివేదిక పంపారని, దానిని పరిశీలించి పల్లకీ సేవను నిషేధిస్తున్నట్లు సబ్‌ కలెక్టర్‌ ఆ ప్రకటనలో వివరించారు. కాగా మైలాడుదురైలోని ఆధ్యాత్మిక సంరక్షణ సమాఖ్య నాయకులు కూడా జిల్లా కలెక్టర్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.


మదురై ఆధీనం ఆగ్రహం...

ఇదిలా ఉండగా నిషేధపుటుత్తర్వును ఉల్లఘించి ధరుమపురం ఆధీనం పల్లకీని తానే మోస్తానని మదురై ఆధీనం హరహర జ్ఞానసంబంధ దేశిక పరమాచార్యుల స్వామి ప్రకటించారు. ధరుమపురం ఆధీనంను  ఇటీవల గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సందర్శించారనే కారణంగానే ఐదు శతాబ్దాలుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రవేశ పల్లకీ సేవను నిషేధించారని ఆయన తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. నాగపట్టణం జిల్లా మైలాడుదురైలోని ధరుమపురం ఆధీనం అత్యంత ప్రాచీనమైనదని, ఆ ఆధీనం మాసిలామణి దేశిక జ్ఞానసంబంధ పరమాచార్య స్వామిని ప్రతియేటా పట్టణ ప్రవేశ వేడుకల సమయంలో భక్తులు వెండి పల్లకీలో ఊరేగించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ ఏడాది పల్లకీ సేవపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించడం గర్హనీయమన్నారు.  తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, తానే స్వయంగా వెళ్లి ధరుమపురం ఆధీనం పల్లకిని మోస్తానని ప్రకటించారు. ధరుమపురం ఆధీనం పట్టణ ప్రవేశం వేడుకలను ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. పల్లకీ సేవలను యధావిధిగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, రాజకీయాలు వేరు ఆధ్యాత్మికం వేరు అని మదురై ఆధీనం సూచించారు.



Read more