వంద కోట్ల చేప, రొయ్య పిల్లల విడుదలకు ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-11T05:36:06+05:30 IST

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో 88 వేల చెరువులు, జలాశయాల్లో వంద కోట్ల చేప, రొయ్య పిల్లల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శంకర్‌ రాథోడ్‌ తెలిపారు.

వంద కోట్ల చేప, రొయ్య పిల్లల విడుదలకు ప్రణాళిక
నర్సరీని పరిశీలిస్తున్న మత్స్య శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శంకర్‌ రాథోడ్‌

నిజాంసాగర్‌, మే 10: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో 88 వేల చెరువులు, జలాశయాల్లో వంద కోట్ల చేప, రొయ్య పిల్లల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శంకర్‌ రాథోడ్‌ తెలిపారు. మంగళవారం నిజాంసాగర్‌ చిరు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలోని నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జలాశయాలతో పాటు చెరువులు, కుంటల్లో ఉచితంగా చేపల విడుదల, జలాశయాల్లో రొయ్యలను విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిజాంసాగర్‌, పోచంపాడ్‌, కడెం, ఆదిలాబాద్‌, విల్‌గేడి, అప్పర్‌ మానేరు డ్యాం, వైరా, మహబూబ్‌నగర్‌, వనపర్తిలతో పాటు మరో 10 నర్సరీల్లో లక్ష్యానికి మించి చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు నర్సరీలను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి మత్స్య యోజన పథకం కింద మత్స్యకారులకు చేపల పెంపకం యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. ఒక్కొక్క యూనిట్‌కు 11 లక్షలు కేటాయించామన్నారు. ఎన్‌ఎఫ్‌డీఎఫ్‌ పథకం కింద మత్స్యకారులకు ట్రాక్టర్‌ ట్రాలీలను రాష్ట్ర వ్యాప్తంగా 150 మందికి అందించనున్నట్లు తెలిపారు. చేపలు వేటాడేందుకు 32వేల 530 మందికి లైసెన్సులను ఇచ్చేందుకు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 15 వేల మందికి పైగా ఇచ్చామన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఈ ఏడాది 42 లక్షల రొయ్య పిల్లలు, 58 లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది 30 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రిజర్వాయర్లతో పాటు చెరువుల్లో నీటి నిల్వలను బట్టి విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 105 చెరువులకు గాను రూ.34 లక్షల 2 వేల లీజును వసూలు చేశామన్నారు. నిజాంసాగర్‌ పరిధిలో 163 చెరువులుండగా, 80 చెరువులు నీటి పారుదల శాఖ పరిధిలోనివని వీటన్నింటికీ రూ.11లక్షల 68వేల 789 లీజును వసూలు చేశామన్నారు. జిల్లాలో లీజుల వసూళ్లలో వందశాతం పూర్తయినట్లు తెలిపారు. నిజాంసాగర్‌, సిరిసిల్లలో నర్సరీలు పనికి రాకుండా ఉన్నప్పటికీ గత ఏడాది కిందట ఈ నర్సరీలను బాగు చేసి చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చేప ఉత్పత్తి కేంద్రాల్లో చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు చిన్నచిన్న మరమ్మతులు చేసేందుకు ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది జలాశయాలతో పాటు చెరువుల్లో పుష్కలంగా నీరుండటంతో మత్స్య కార్మికుల ఉద్ధరణ కోసం వంద శాతం రాయితీపై చేప పిల్లలను విడుదల చేశామన్నారు. గత ఏడాది కూడా అధికంగా చెరువుల వల్ల సంపద సమకూరిందన్నారు. మత్స్యకారులు చెరువులు, కుంటల్లో ఉన్న ముళ్ల కంపలను తొలగించుకోవాలని సూచించారు. ఆయన వెంట నిజాంసాగర్‌ మత్స్యశాఖ సిబ్బంది ఉన్నారు. 

Read more