బీసీసీఐ సంచలన నిర్ణయం.. 87 ఏళ్ల తర్వాత తొలిసారి..
ABN , First Publish Date - 2021-01-31T01:07:50+05:30 IST
దేశంలో క్రికెట్‌కు వెన్నెముకగా ఉన్న ఫస్ట్‌క్లాస్ దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్‌ను ఈసారి
న్యూఢిల్లీ: దేశంలో క్రికెట్‌కు వెన్నెముకగా ఉన్న ఫస్ట్‌క్లాస్ దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్‌ను ఈసారి రద్దు చేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తెలిపింది. దేశంలో రంజీ ట్రోఫీ రద్దు కావడం 87 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్రాల క్రికెట్ సంఘాలు అన్నీ దాదాపు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహణకే మొగ్గు చూపడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, వినూ మన్కడ్ ట్రోఫీలో భాగంగా అండర్-19 జాతీయ వన్డే టోర్నమెంట్, మహిళల 50 ఓవర్ టోర్నమెంట్ నిర్వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా రాష్ట్ర విభాగాలకు లేఖ రాశారు.
ఒక్కో మ్యాచ్‌కు ఆటగాళ్లకు గరిష్టంగా రూ. 1.5 లక్షలు చెల్లించే ఈ బ్లూరిబండ్ టోర్నమెంట్ కోసం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శ జే షా ఆసక్తిగా ఉన్నప్పటికీ, రెండు నెలలపాటు రెండు దశల్లో రంజీ ట్రోఫీని నిర్వహించడం ప్రస్తుత కొవిడ్ సమయంలో కష్టసాధ్యమైన పని. ఈ నేపథ్యంలో రంజీ సీజన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
‘‘విజయ్ హజారే ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీతో ఏకకాలంలో సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ నిర్వహిస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశవాళీ సీజన్ 2020-21కు సంబంధించి మీ అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని రాష్ట్ర శాఖలకు రాసిన లేఖలో జే షా పేర్కొన్నారు. అలాగే, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంటును విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్నవిజయ్ హజారే ట్రోఫీలోనూ బయోబబుల్‌ను నిబంధనలు పాటించాలని బీసీసీఐ యోచిస్తోంది.

