‘పాలు’ పోలేదు..!

ABN , First Publish Date - 2022-05-13T05:16:17+05:30 IST

రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్లకు పాలను ప్యాకెట్‌ రూపంలో సరఫరా చేయడానికి ఉద్దేశించిన టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ ఆదిలోనే హంసపాదు అన్నట్లు మారింది.

‘పాలు’ పోలేదు..!
మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద విజయ పాల డెయిరీ

టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ మూత

రూ.26 కోట్ల నిధులు నీళ్ల పాలేనా?


రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్లకు పాలను ప్యాకెట్‌ రూపంలో సరఫరా చేయడానికి ఉద్దేశించిన టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ ఆదిలోనే హంసపాదు అన్నట్లు మారింది. రూ.26 కోట్లు వెచ్చించి ఏడాదిపాటు శ్రమించి నిర్మించిన యూనిట్‌.. ఆరు నెలలు తిరక్కుండానే మూతపడింది. మూడేళ్లుగా వినియోగంలో లేకపోవడంతో కోట్ల రూపాయల విలువ చేసే విలువైన యంత్రాలు, మిషనరీస్‌ తుప్పు పట్టే పరిస్థితి ఏర్పడింది. యూనిట్‌లో తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలు, వాటిని సరిచేసే నిపుణులు అందుబాటులో లేకపోవడంతో మూత దిశకు చేరింది. ప్రస్తుతం ప్యాకింగ్‌కు కావాల్సిన పాలు అందుబాటులో ఉన్నా.. వినియోగించుకోలేక పొరుగు ప్యాకింగ్‌పై ఆధారపడాల్సిన వస్తోంది. 


మదనపల్లె, మే 12: మదనపల్లె పట్టణ శివారులోని చిప్పిలి వద్ద ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో విజయ డెయిరీ నడుస్తోంది. రోజుకు సుమారు లక్ష లీటర్ల పాల సేకరణ చేసిన ఘనత ఈ డెయిరీకి ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటకలో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో విజయ డెయిరీ వద్ద టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి అప్పటి సహకార శాఖ కమిషనర్‌, పాడి పరిశ్రమ శాఖ ఎండీ మురళి పునాది వేశారు. ఇక్కడ ప్యాకింగ్‌ చేసిన పాలను రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ కేంద్రంగా రూ.26 కోట్ల ఆర్‌కేవీవై నిధులతో టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ను నిర్మించారు. 90 రోజుల పాటు నిల్వ ఉండే ఈ టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ పనులను 2018 అక్టోబరులో ప్రారంభించి 2019 మార్చి 3వ తేదీ అప్పటి సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. విదేశాల నుంచి నిపుణులు వచ్చి ట్రయల్‌రన్‌ నిర్వహించి యూనిట్‌ ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో వినియోగంలోకి వచ్చింది. ఈ యూనిట్‌లో ప్రధానమైన తిమోనియర్‌, స్టార్క్‌ స్టెరిలైజర్‌ యంత్రాలను ఫ్రాన్స్‌, నెదర్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకోగా, అత్యంత సూక్ష్మంగా ఎలక్ర్టానిక్స్‌ పద్ధతిలో పనిచేసే వీటిని ఫ్రాన్స్‌, నెదర్లాండ్‌ దేశాల నుంచి నిపుణులు వచ్చి ప్యాకింగ్‌కు యంత్రాలను సిద్ధం చేశారు. 

    రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 80 వేల లీటర్ల సామర్థ్యంతో పాలను టెట్రా ప్యాకింగ్‌ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యూనిట్‌కు యంత్రాలను కూడా అక్కడి నుంచే దిగుమతి చేసుకున్నారు. రోజూ 80 లక్షల లీటర్ల పాలను టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌లో సాచురేషన్‌ చేసి 200 మి.లీ., 500 మి.లీటర్లతో ప్యాకెట్‌లలో ప్యాకింగ్‌ చేసేవారు. ఇందుకోసం విజయ డెయిరీకి వచ్చే పాలతో పాటు, కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ నుంచి కూడా పాలను సేకరించారు. యూనిట్‌ ప్రారంభంలో రోజుకు 10-15 వేల లీటర్ల పాలను మాత్రమే ప్యాకింగ్‌ చేశారు. ఇక్కడ 80 వేల లీటర్ల కెపాసిటీ ఉన్నా..అందుకు తగినట్లు యంత్రాలు, సౌకర్యాలు లేకపోవడం, యూనిట్‌లో సాంకేతిక సమస్యలు, తదితర కారణాలతో నాలుగు నెలలకే ప్యాకింగ్‌ ప్రక్రియ ఆగిపోగా, తర్వాత కరోనా లాక్‌డౌన్‌తో మూతపడింది. తర్వాత విజయ డెయిరీని ప్రభుత్వం 2020 డిసెంబరులో అమూల్‌కు అప్పగించడం కూడా ప్యాకింగ్‌ జరగకపోవడానికి కారణమైంది. ఇక్కడ ప్యాకింగ్‌ చేసిన పాలను నిల్వ చేయడానికి వీలుగా గోదాముతో పాటు నెయ్యి తయారీ కేంద్ర నిర్మాణానికి రూ.9 కోట్ల వ్యయంతో అప్పట్లోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

     బీఎంసీలు, బయట డెయిరీల నుంచి సేకరించిన పాలను ఇన్‌పుట్‌ మోటార్లతో సైలో ట్యాంకర్లకు చేర్చి అక్కడ ఈ పాలను నీటి ఆవిరితో 74 డిగ్రీల సెల్సియస్‌తో వేడి చేస్తారు. తరువాత 24 డిగ్రీల సెల్సియస్‌కు చల్లార్చి 30 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు సైలో ట్యాంకర్లలో పాలను నిల్వ చేసేవారు. అక్కడి నుంచి స్టార్క్‌ స్టెరిలయిజర్‌ యంత్రం ద్వారా ఈ పాలను 140 సెల్సియస్‌ డిగ్రీల వరకు వేడి చేసి బ్యాక్టీరియా లేకుండా శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో పాలకు బ్యాక్టీరియా సోకకుండా నీటి సాంధ్రత తగ్గించేందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చి, తరువాత తిమోనియర్‌ యంత్రం ద్వారా టెట్రా ప్యాకింగ్‌ చేస్తారు. 5 నుంచి 7 లేయర్ల మందమున్న ప్లాస్టిక్‌ ఫిల్మ్‌లలో ప్యాకింగ్‌ చేసిన పాలు 40 రోజుల నుంచి 120 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా ప్యాకింగ్‌ చేసిన పాలను రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసేవారు. అయితే వివిధ కారణాలతో ఈ ప్రక్రియకు బ్రేక్‌పడగా యూనిట్‌ మూతపడింది.


నెల రోజుల్లో పునఃప్రారంభం

- నవీన్‌కుమార్‌, విజయ డెయిరీ మేనేజర్‌, మదనపల్లె.

టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ను అమూల్‌ సంస్థ స్వాధీనం చేసుకుంది. యూనిట్‌ను రీమోడల్‌ చేసి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తోంది. దీంతో స్థానికంగా 150 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం నుంచి పైసా ఖర్చు లేకుండా అమూల్‌ సంస్థే భరిస్తోంది. ఇప్పటికే డెయిరీ రూపురేఖలు మారిపోయాయి. సాంకేతక నిపుణులు అందుబాటులో ఉంటూ నెల రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తోంది.



Read more