వానాకాలం సాగు ఖరారు

ABN , First Publish Date - 2022-05-13T05:54:42+05:30 IST

వానాకాలం సీజన్‌కు సంబంధించిన పంటల సాగు ఖరారు అయింది. ఈ వానాకాలం పంటల సాగు ప్రణాళికను ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు.

వానాకాలం సాగు ఖరారు
వరి నాట్ల దృశ్యాలు(ఫైల్‌)

- ప్రణాళికను సిద్ధం చేసిన జిల్లా వ్యవసాయశాఖ

- జిల్లాలో 5.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా

- వరి 2.48 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 86వేల ఎకరాలు

- పత్తి 73 వేల ఎకరాల్లో సాగుతుందని అంచనా

- గత ఏడాదితో పోలిస్తే వచ్చే వానా కాలంలో పెరగనున్న సాగు విస్తీర్ణం

- 93వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు

- 1లక్ష 2వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేసిన అధికారులు


కామారెడ్డి, మే 12(ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించిన పంటల సాగు ఖరారు అయింది. ఈ వానాకాలం పంటల సాగు ప్రణాళికను ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వానాకాలం 2022లో అధికారుల అంచనా ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా 5.36 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రణాళికను రూపొందించారు. ఇందులో ప్రధానంగా వరి 2.48 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా తర్వాత మొక్కజొన్న, పత్తి, సోయాబిన్‌ వేల ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికలో చేర్చారు. పంటల సాగు విస్తీర్ణానికి తగ్గట్టుగా ఎరువులు, విత్తనాల అవసరాలను కూడా రూపొందించారు. ఈ వానాకాలంలో లక్ష క్వింటాళ్లలో విత్తనాలు అవసరం కానున్నాయన్నారు. 98వేల మెట్రిక్‌ టన్నులలో ఎరువుల కోసం ప్రతిపాదనలను రూపొందించారు.

5.36 లక్షల ఎకరాల్లో పంటల సాగు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ పరిధిలో వానాకాలం పంటల సాగుకు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయశాఖ రూపొందించింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ వానాకాలంలో కాస్తా సాగు విస్తీర్ణం పెరగనుంది. గడిచిన వానాకాలం సీజన్‌లో 5.16 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈ సీజన్‌లో 5.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ లెక్కన ఈ సీజన్‌లో పంటసాగు విస్తీర్ణం కాస్తా పెరగనుంది. దీంతో వరి 2,48,150 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, మొక్కజొన్న 86,205 ఎకరాలు, పత్తి 73,545 ఎకరాలు, సోయాబిన్‌ 72,878 ఎకరాలు, కందులు 22,151 ఎకరాలు, పెసర్లు 10,900 ఎకరాలు, మినుములు 10,500 ఎకరాలు, చెరుకు 4100 ఎకరాలు, జొన్నలు 300 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు.

1లక్ష 2వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం

ఈ వానాకాలం సీజన్‌లో సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తనాలను సైతం అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి ప్రణాళికను రూపొందించారు. 60,313 క్వింటాళ్లలో వరి, 18,083 క్వింటాళ్లలో సోయాబిన్‌, 70,256 పత్తి ప్యాకెట్లు, మొక్కజొన్న 4,667 క్వింటాళ్లలో, కందులు 1,054 క్వింటాళ్లలో, పెసర 1,440 క్వింటాళ్లలో, మినుములు 880 క్వింటాళ్లలో విత్తనాలు అవసరం కానున్నాయి. అయితే ఈ విత్తనాలకు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీని ఇవ్వడం లేదు. వీటితో పాటు సబ్సిడీపై 10,700 క్వింటాళ్లలో, జనుము, జిలుగు విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయనుంది.

93వేల మెట్రిక్‌ టన్నుల్లో ఎరువులు

వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి ఆయా రకాల పంటలు సాగు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులకు 93వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో 67,044 మెట్రిక్‌ టన్నుల యూరియా, 26,371 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 8,716 మెట్రిక్‌ టన్నులలో వీఏపీ, 6,537 మెట్రిక్‌ టన్నులలో ఎంఓపీ ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే యూరియా 8,122 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని కాంప్లెక్స్‌ 4,969 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 1,767 మెట్రిక్‌ టన్నులలో, ఎన్‌ఓపీ 260 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సహకార సంఘాలు గుర్తింపు పొందిన సంస్థల ద్వారా రైతులకు సీజన్‌ ప్రారంభానికి ముందు అందుబాటులో ఉంచడానికి కసరత్తు చేస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ ఎరువుల కొరత ఏర్పడింది. ప్రధానంగా యూరియా వాడకం పెరగడంతో రైతులకు దొరకలేని పరిస్థితి ఎదురైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అంతటా ఎరువులను స్టాక్‌ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read more