మంత్రి ఉన్నా అభివృద్ధి సున్నా

ABN , First Publish Date - 2022-05-12T05:29:24+05:30 IST

కొత్త జిల్లా.. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో జిల్లాకు ప్రాతినిధ్యం.. ఇంకేంలే.. కొత్త జిల్లా పురోగమిస్తుందని ఆశించారు. బోలెడు కలలు కన్నారు.

మంత్రి ఉన్నా అభివృద్ధి సున్నా

అడియాశలు చేసిన జిల్లా మంత్రి

నిధుల కేటాయింపులో స్పష్టత కరువు

పడకేసిన అభివృద్ధి పనులు

కొత్త జిల్లా ప్రజల్లో అసంతృప్తి


కొత్త జిల్లా.. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో జిల్లాకు ప్రాతినిధ్యం.. ఇంకేంలే.. కొత్త జిల్లా పురోగమిస్తుందని ఆశించారు. బోలెడు కలలు కన్నారు. అన్ని రంగాల అభివృద్ధిని ఊహించారు. జిల్లా నుంచే ఆర్థిక మంత్రి ఉండగా నిధులకు కొరతేముంటుందని భరోసా పొందారు. ఆ కలలన్నీ చెదిరిపోతున్నాయా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు దీనికి ఊతం ఇస్తున్నాయి. జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నిధుల విషయంలో కనీసంగా స్పందించడం లేదు. జిల్లా ఏర్పడి నెలన్నర అవుతున్నది. ఆర్థిక మంత్రి జిల్లా అవసరాలకు నిధుల కేటాయింపు గురించిన ఊసే ఎత్తడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగంగా కూడా నంద్యాల ప్రాంత సమస్యలు అలాగే ఉండిపోయాయి. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం అనుకోలేదు. నిధులు లేక చాలా అభివృద్ధి పనులు పడకేశాయి. గ్రామీణ రోడ్లు, ప్రాజెక్టులు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రుల నిర్మాణ పనులకు నిధులు లేవు. 


-నంద్యాల, ఆంధ్రజ్యోతి


జిల్లా గురించి పట్టదా..


వైసీపీ అధికారంలోనికి వచ్చాక ఉమ్మడి జిల్లా వాసిగా బుగ్గన ఆర్థిక మంత్రి అయ్యారు. కర్నూలు, నంద్యాల ప్రాంతం అభివృద్ధికి ఇక తిరుగేలేదన్న మాటలు వినిపించాయి. కానీ ఉమ్మడి జిల్లా ప్రజల ఆశలు అడియాశలు కావడానికి ఎంతో కాలం పట్టలేదు.  మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా ఆయన ఆదే పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పుడైనా తన గడ్డ గురించి పట్టించుకుంటారని కొత్తగా ఏర్పడ్డ నంద్యాల వాసులు అనుకున్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు జిల్లా గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కాగా గత శనివారం జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాటలు దిగ్ర్భాంతి కలిగించాయి. నంద్యాల జిల్లాకు అన్ని హంగులు ఉన్నాయని, కొత్తగా ఏ అవసరాలు లేవన్నట్లు మంత్రి మాట్లాడారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని అన్నారేగాని, అందుకు కావాల్సిన నిధులు కేటాయిస్తానని ఒక్క మాట కూడా అనలేదు. 


ఇక అంతేనా..


నంద్యాల జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు అస్తవ్యస్తంగా ఉంది. తాత్కాలిక భవనాల కోసం కేవలం రూ.3 కోట్లు కేటాయించారు. అయితే ఏ ఒక్క కార్యాలయం కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 50 ఎకరాల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించి, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చూస్తామని ప్రభుత్వం అన్నది. ఈ పని జరగాలంటే భారీగా నిధులు కావాలి. ఆయా శాఖలకు చెందిన మంత్రులు తమ పరపతిని ఉపయోగించి తమ జిల్లాకు అధిక శాతం నిధులు తీసుకెళుతుంటారు. అన్ని శాఖలకు నిధులు కేటాయించే ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మంత్రి బుగ్గన మాత్రం రాష్ట్రానికి అవసరమయ్యే అప్పులు తెచ్చే పనిమీద ఢిల్లీలో మకాం వేస్తూ జిల్లాను పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఏర్పడిందన్న ఆనందం తప్ప అభివృద్ధి జరుగుతుందన్న భరోసా సమీప దూరంలో కనిపించేలా లేదని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు.


జిల్లా కేంద్రమైనా సరే..


నంద్యాల జిల్లాకు గత ఏడాది ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేసింది. స్థల వివాదం కోర్టులో నడుస్తోంది. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని 200 నుంచి 300కి పెంచాల్సి ఉంది. నంద్యాల మునిసిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఆ పనులు ముందుకు పోవడం లేదు. కుందూనది, చామకాల్వ, మద్దిలేరు వరద ఉధృతి పట్టణానికి తగలకుండా శాశ్వత వరద గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించలేదు.


ఆళ్లగడ్డకు నిధులు లేవు..


ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధికి ఆర్థిక మంత్రి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. ఆళ్లగడ్డ పట్టణంలో మున్సిపాల్టీలో వీధి లైట్లు, 50 పడకల వైద్యశాల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. గ్రామాల్లో సచివాలయాల నిర్మాణాలు నిధులు లేక నిలిచి పోయాయి. పేరాయిపల్లె- కొండాపురం రహదారి, దొర్నిపాడు మండలంలో చాకరాజువేముల- యాళ్లురు రహదారికి నిధులు మంజూరు కాలేదు. చాగలమర్రి మండలంలో నేలంపాడు రహదారి, శిరివెళ్ల మండలంలో ఎర్రగుంట్ల- వెంకటేశ్వరనగర్‌ రహదారి, ఉయ్యాలవాడ మండలంలోని ఆర్‌. పాంపల్లె వక్కిలేరు వంతెన నిర్మాణానికి, రుద్రవరం మండలంలో ప్రధాన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు.


 శ్రీశైలంలో ఇవీ సమస్యలు


 ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి బ్రాంచ్‌ కెనాల్స్‌ పంట కాలువలు నిర్మించాలి. ఆత్మకూరు పట్టణంలో నాన్‌ అమృత్‌ పథకం పనులు చేపట్టాలి. అలాగే వీబీఆర్‌ ఆయకట్టు కింద పంట కాలువలు నిర్మించాలి. శ్రీశైలం క్షేత్రంలో మాస్టర్‌ ప్లాన్‌ పనులు సక్రమంగా చేపట్టాలి. ఇవన్నీ నిధులు మంజూరు చేస్తేనే అయ్యే అవకాశ ఉంది. 


డోన్‌లో ఇలా..

 

డోన్‌ నియోజకవర్గంలో కొన్ని పనులు హామీలకే పరిమితమయ్యాయి. రుద్రాక్షగుట్టలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులు, కూరగాయల మార్కెట్‌ భవన సముదాయ  పనులు సాగడం లేదు. ప్యాపిలి మండలంలోని హుశేనాపురం గ్రామంలో ఏర్పాటు చేయనున్న గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం,  పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణాల పనులు అతీగతీ లేదు. బేతంచెర్ల పట్టణ సమీపంలో బీసీ బాలుర గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాల పనుల జాడ కనిపించడం లేదు. 


 బనగానపల్లెలో నత్తనడకన  పనులు


బనగానపల్లె తహసీల్దారు కార్యాలయం భవనం పనులు మందకొడిగా సాగుతున్నాయి. అలాగే పాతపా డు గ్రామ సమీపంలో 2.50 కోట్లతో నిర్మిస్తున్న పర్క్యు లేషన్‌ ట్యాంక్‌ పనులు ఆగిపోయాయి. అలాగే బనగా నపల్లె పట్టణంలో పెట్రోల్‌ బంకు కూడలి నుంచి రోడ్డు విస్తరణ పనులు, క్రిష్ణగిరి నుంచి మంగంపేట తండా వరకు రోడ్డు పనులకు నిధులు మంజూరు కాలేదు. 


 మంత్రి అలా.. ఎమ్మెల్యేలు ఇలా..


మంత్రి బుగ్గన మొదటిసారి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలో డోన్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లో సాగునీటి ప్రాజెక్టులు, సారవంతమైన భూములు ఉన్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అన్ని జిల్లాల కంటే నంద్యాల జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని గొప్పలు చెప్పుకొచ్చారు. అవకాశాలు పుష్కలంగా ఉన్నా అవసరమైన నిధులు కేటాయిస్తే గాని అభివృద్ధి చెందదని మంత్రికి తెలయదా? అని జిల్లా వాసులు అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపు కోసం మంత్రిని కలవడం లేదని, కేవలం తమకంటే జూనియర్‌ అన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు బుగ్గనను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యేలు చొరవ చూపక జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లా అధికారుల సమావేశానికి మంత్రి హాజరైనా ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం వారి మధ్య సయోధ్య లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 


నీరసించిన నందికొట్కూరు


జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలోని జైన్‌ పరిశ్రమ పనులు ముందుకు సాగడం లేదు. నందికొట్కూరు పట్టణంలోని ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్‌ ఇచ్చే నాన్‌ అమృత్‌ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి.  మిడుతూరు మండలంలోని 10 గ్రామాలకు శుద్ధజలం అందించేందుకు 2017లో రూ.14.5 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ(ఎస్‌డీపి) నిధులతో సమ్మర్‌స్టోరేజీ వాటర్‌ స్కీం పనులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్యాకేజీ(ఎస్‌డీపీ) పథకానికి నిధులు నిలిపి వేసింది.

Read more