మందుల్లేవ్‌..!

ABN , First Publish Date - 2022-05-14T06:20:45+05:30 IST

మందుల్లేవ్‌..!

మందుల్లేవ్‌..!
మందులిచ్చే కౌంటర్ల వద్ద బారులుతీరిన రోగులు..

జీజీహెచ్‌లో మందుల కొరత 

ఉచిత మందులు ఐదు రోజులకే.. 

కావాలంటే మళ్లీ రావాల్సిందే.. 

దూరప్రాంతాల రోగుల కష్టాలు

ప్రభుత్వం నుంచి సరఫరా తగ్గినందు వల్లనే..

అదంతా యాంటీ బయోటిక్‌ కోర్సే.. : సూపరింటెండెంట్‌


నూజివీడుకు చెందిన ఓ మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతూ జీజీహెచ్‌లో  గత జనవరి నుంచి చికిత్స పొందుతోంది. ఆమెకు గతంలో          పది రోజులకు సరిపడా మందులు ఉచితంగా ఇచ్చేవారు. గత బుధవారం ఆసుపత్రికి వచ్చి వైద్యులకు చూపించుకోగా, మళ్లీ వైద్యులు మందులు రాశారు. అయితే, ఈసారి ఆసుపత్రి సిబ్బంది ఐదు రోజులకే మందులిచ్చారు. ఇదేంటని అడిగితే, మళ్లీ ఐదు రోజుల తర్వాత వచ్చి సరిపడా మందులు తీసుకెళ్లాలని చెప్పారు. ఇప్పటికే పేదరికంతో ఇబ్బందులు పడుతున్న తాను నూజివీడు నుంచి ఐదు రోజులకోసారి రాలేనని, మందులను బయట కొనుక్కునే స్థోమత కూడా లేదని కన్నీటితో వెనుదిరిగింది. 

జగ్గయ్యపేటకు చెందిన మరో వ్యక్తి పరిస్థితి కూడా ఇదే. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన్ను వైద్యులు పరీక్షించి అవసరమైన మందులు రాశారు. వాటిని తీసుకోవడానికి ఆసుపత్రిలోని ఫార్మసీకి వెళ్లగా, వాటిలో కొన్ని మందులు ఇచ్చి.. గ్యాస్‌, కాల్షియం ట్యాబ్లెట్లు లేవని, వాటిని బయట కొనుక్కోవాలని సిబ్బంది చెప్పారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో జీవితాలను కష్టంగా నెట్టుకొస్తున్న తాను బయట మందులు కొనాలంటే ఎలా అంటూ బిక్కముఖం వేసుకుని ఉసూరుమంటూ ఊరికి బయల్దేరాడు. 

..వీరిద్దరే కాదు. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రోజూ వేలసంఖ్యలో వస్తున్న రోగులకు చెప్పే మాట ఒకటే. ‘మందులు లేవు. ఐదు రోజుల తరువాత రండి..’ అని. కారణాలేమైనా, దూరప్రాంతాల నుంచి వస్తున్న రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత రోగులకు పెద్ద సమస్యగా మారింది. మందుల కొరత లేదని వైద్యాధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇంతకుముందు వైద్యులు రాసిన మందుల చీటీలను తీసుకెళ్తే.. నెలకు లేదా పదిహేను రోజులకు సరిపడా ఇచ్చేవారు. ఇప్పుడు ఐదు రోజులకే సరిపెడుతున్నారు. అవి కూడా అరకొరగానే ఇచ్చి, మిగిలినవి బయట తెచ్చుకోమంటున్నారు. దూరం నుంచి వచ్చామని, మందుల కోసం మళ్లీమళ్లీ రావడం కష్టమని రోగులు ఫార్మశీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ‘ఐదు రోజులకే మందులు ఇవ్వబడును’ అని బోర్డులు పెట్టేశారు. 

దూరప్రాంత రోగులకు కష్టమే.. 

జీజీహెచ్‌కు రోజూ 1,500 నుంచి 2వేల మంది ఓపీ పేషెంట్లు వస్తుంటారు. రెండు జిల్లాలతో పాటు పొరుగున ఉన్న గుంటూరు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి కూడా వస్తారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులోని కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలు ప్రారంభం కావడంతో రోగుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. వీరందరికీ దూరప్రాంతాల నుంచి రావడం ఒక ఎత్తయితే, మందులు తీసుకోవడం మరో ఎత్తయింది. గుండె జబ్బులు, నరాల వ్యాధులకు సంబంధించిన మందులు ఖరీదైనవి కావడంతో బయట కొనలేక ఐదు రోజులకు సరిపడా మందులనే వాడేసి సరిపెడుతున్నారు. 

కొందామంటే డబ్బుల్లేవ్‌.. 

ప్రభుత్వం నుంచి మందుల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతోనే ఈ సమస్య వచ్చింది. గతంలో మందుల సరఫరా తగ్గినప్పుడు ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి లేదా ఆరోగ్యశ్రీ నిధుల నుంచి స్థానికంగా కొనేవారు. ఇప్పుడు మందులను స్థానికంగా కొనడానికి ఆసుపత్రిలో డబ్బు లేకపోవడంతో వైద్యాధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. అందుబాటులో ఉన్న మందులనే ఇస్తూ, మిగతావి బయట కొనుక్కోమంటున్నారు. ఈ నేపథ్యంలో సరిపడా మందులను పూర్తిగా ఇచ్చేలా వైద్యాధికారులు ఏర్పాట్లు చేయాలని రోగులు కోరుతున్నారు. 


మందుల కొరతేమీ లేదు..

ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత లేదు. అయితే, రోగులకు మెరుగైన వైద్యసేవలందించే క్రమంలో ఐదు రోజులు యాంటీ బయోటిక్‌ కోర్సు ఇస్తున్నాం. వారు ఆసుపత్రికి వస్తే వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన మందులు రాయడానికి వీలవుతుంది. అలాకాకుండా 15, నెల రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఒకే రకం మందులను వాడటం మంచిది కాదు. గతంలో ఎక్కువ రోజులకు సరిపడా మందులు ఇవ్వడం వల్ల ఒకే రకం మందులను నెలల తరబడి వాడటం అలవాటైపోయింది. అందుకే ఐదు రోజులకు సరిపడా మందులు ఇస్తే, మళ్లీ వచ్చి వైద్యులకు చూపించుకున్నప్పుడు వ్యాధి పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. దీనివల్ల మందుల వృథా వినియోగం తగ్గుతుంది. రోగులకు కూడా అవసరమైన మేరకే తగిన మందులను సరఫరా చేసే వీలవుతుంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

- డాక్టర్‌ బి.సౌభాగ్యలక్ష్మి, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌






Read more