ముంచేస్తున్న మామిడి

ABN , First Publish Date - 2022-05-08T06:36:53+05:30 IST

ముంచేస్తున్న మామిడి

ముంచేస్తున్న మామిడి
నున్న మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న మామిడి కాయలు

నున్న మ్యాంగో మార్కెట్‌లో పడిపోయిన ధరలు

టన్ను రూ.95 వేల నుంచి రూ.40 వేలకు..   

సిండికేట్‌గా మారి రైతులను దెబ్బకొడుతున్న సేఠ్‌లు


సీజన్‌లో లాభాలు తెచ్చి పెడతాయనుకున్న మామిడి కాయలు రైతులను నిండా ముంచేస్తున్నాయి. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా కష్టాల్లో బతుకుతున్న వారిని ఆదుకుంటాయనుకుంటే అవసరానికి అక్కరకు రాక వెక్కిరిస్తున్నాయి. ఓవైపు చీడపీడల కారణంగా కాపు సరిగ్గా రాక, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సేఠ్‌లు సిండికేట్‌ కావడం కారణంగా అమ్మకాలు సరిగ్గా లేక ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులను లోకల్‌ మండీలు మరింత కుంగదీశాయి. తాజాగా నున్న మ్యాంగ్‌ మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయి. దిగుబడులు తగ్గిన ఈ సమయంలో ధర పెరగాల్సింది పోయి ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకోవైపు మార్కెటింగ్‌ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.


విజయవాడ రూరల్‌, మే 7 : ఆసియాలోనే పెద్దదైన నున్న మ్యాంగో మార్కెట్‌లో మామిడి ధరలు పడిపోయాయి. సీజన్‌ ఆరంభంలో బంగినపల్లి రకం టన్ను ధర రూ.95 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.40 వేలకు పడిపోయింది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, ధరలు ఆశాజనకంగా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. తోటల నుంచి కాయలను ట్రాక్టర్లలో మార్కెట్‌కు తెచ్చేందుకు వేలాది రూపాయల ఖర్చవుతోందని, ధరలు పడిపోవడంతో, పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇరు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, తెలంగాణలోని ఖమ్మం, సత్తుపల్లి ప్రాంతాల నుంచి కూడా రైతులు మామిడిని ఇక్కడికే తీసుకొస్తారు. బంగినపల్లితో పాటు తోతాపురి (కలెక్టర్‌) మామిడికాయలు ఎక్కువగా వస్తాయి. ఇక్కడి నుంచి ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధరలు పెరగాల్సిందిపోయి దారుణంగా పడిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సేఠ్‌ల కారణంగానే..

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బయ్యర్లు (సేఠ్‌లు) సిండికేట్‌గా మారడంతో ధరలను తగ్గించేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాగా, గతంతో పోలిస్తే నున్న మార్కెట్‌కు వచ్చే మామిడికాయలు తగ్గిపోయాయి. గతంలో రోజూ వెయ్యి టన్నుల మామిడికాయలు వచ్చేవని, ప్రస్తుతం 200 టన్నులకు పడిపోయినట్లు వ్యాపారులే చెబుతున్నారు. ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో లోకల్‌ మండీలు ఎక్కువగా వెలిశాయి. స్థానిక రైతులే షాపులను ఏర్పాటుచేసి, చిన్న రైతుల నుంచి కాయలను కొంటున్నారు. నున్న మార్కెట్‌కు వచ్చే బయ్యర్లు నేరుగా లోకల్‌ మండీల వద్దకే వెళ్లి కాయలను కొంటున్నారు. దీంతో మార్కెట్‌లో లావాదేవీలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నున్న మార్కెట్‌ నుంచి ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలకు సుమారు ఐదువేల టన్నుల మామిడికాయలు ఎగుమతి అయినట్లు మ్యాంగో గ్రోయర్స్‌ అసోసియషన్‌ వర్గాలు తెలిపాయి. 

పట్టించుకోని మార్కెటింగ్‌ శాఖ

నున్న మ్యాంగో మార్కెట్‌లో మామిడి వ్యాపార లావాదేవీల గురించి మార్కెటింగ్‌ శాఖ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మామిడి ధరల గురించి కూడా అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం సీజన్‌లోనైనా ధరపై నిర్ణయం తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా మామిడి మార్కెట్‌పై మార్కెటింగ్‌ శాఖతో పాటు ఉద్యాన శాఖ దృష్టిసారించి రైతులకు మెరుగైన ధర లభించేలా చూడాల్సిన అవసరముంది. 




Read more