అవే వెతలు

ABN , First Publish Date - 2022-05-10T05:52:51+05:30 IST

కొత్త జిల్లాలో కొత్త కష్టాలు.. ఇంకా పాతపడలేదు. అవే చిక్కులు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కొత్త జిల్లాలో పని చేయాలని కొందరు కోరి పోస్టింగ్‌ వేయించుకున్నారు.

అవే వెతలు

కొత్త జిల్లాలో ఉద్యోగుల చిక్కులు 

నిధులు లేకుండానే పనులు చేయాలని ఆదేశం 

సమీక్షలంటేనే హడల్‌ 

ఒత్తిడి భరించలేక సెలవుపై వెళ్లే యోచన


నంద్యాల, (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలో కొత్త కష్టాలు.. ఇంకా పాతపడలేదు. అవే చిక్కులు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కొత్త జిల్లాలో పని చేయాలని కొందరు కోరి పోస్టింగ్‌ వేయించుకున్నారు. ఇప్పుడు వాళ్లే... ఎందుకీ కష్టాలను తెచ్చుకున్నామా? అనుకుంటున్నారు. జిల్లా విడిపోయింది కాబట్టి పని ఒత్తిడి తగ్గుతుందని ఆశిస్తే ఇలా అయిందేమిటని అంటున్నారు. ఇప్పుడు అందరిదీ ఒకే ఆవేదన. ఇంత ఒత్తిడితో ఎవరైనా ఎలా పనిచేస్తారు? అంటున్నారు. వీరిలో జిల్లా స్థాయి అధికారుల మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు ఉన్నారు. కొత్త జిల్లాలో ఏర్పాటు కార్యాలయాల ఏర్పాటు, వసతుల కల్పన ఏవీ సక్రమంగా లేకపోవడం సమస్యగా మారింది. వసతుల ఏర్పాట్లకు నిధులు ఇవ్వకుండా నివేదికలు కావాలని పై అధికారుల నుంచి ఆదేశాలు మాత్రం వస్తున్నాయని సిబ్బంది అంటున్నారు. దీనికి తోడు రోజువారీ సమీక్షలు జరుపుతున్నారు. వాటికి ఉద్యోగులు అసమగ్ర సమాచారంతోనే  హాజరవుతున్నారు. పై నుంచి కావాల్సిన వివరాలు అడిగే వారే తప్ప క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. వాస్తవ పరిస్థితులు చెబితే పైఅధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఉద్యోగులు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. దీంతో సమీక్షలంటేనే ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. కొంతమంది జిల్లా అధికారులు వచ్చేటప్పుడే తమతో పాటు రెండు సిస్టమ్స్‌ తెచ్చుకున్నారు. లేకుంటే ఈ మాత్రం పని కూడా జరిగేది కాదని ఓ జిల్లా స్థాయి ఉద్యోగి చెప్పుకొచ్చారు. ఈ ఒత్తిడిని భరించలేక కొంతమంది జిల్లా, మండల స్థాయి అధికారులు సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీఈవో, డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో మరుగుదొడ్లు తగినన్ని లేవు. ఉన్న వాటిని కూడా స్ర్తీలకు, పురుషులకని విభజించలేదు. అవి కూడా శుభ్రంగా లేవు. అయినా వాటిని మహిళా ఉద్యోగులు వాడుకుంటున్నారు. దీంతో పురుష సిబ్బంది బైటికి వెళ్లక తప్పడం లేదు. అలాగే సెరికల్చర్‌ భవనంలో ఏపీ మోడల్‌ స్కూలు నడుస్తోంది. దీని వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉండటంతో మధ్యలో గోడ కట్టించాలని అనుకున్నారు. ఇక్కడ కూడా టాయిలెట్స్‌ సమస్య ఉంది. సాంస్కృతిక శాఖకు అసలు భవనమే కేటాయించలేదు. ఇటీవల మంత్రి బుగ్గన సమక్షంలో ఇలాంటి సమస్యల ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన ఏఏ శాఖల్లో ఏ సమస్యలు ఉన్నదీ తనకు రాస్తే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. కొత్త జిల్లా ఏర్పడి నెల దాటినా ఇంకా ప్రభుత్వ పెద్దల దగ్గర ఏ ఏ విభాగంలో ఏ సమస్యలు ఉన్నదీ తెలియదు. ఇంకా పరిష్కరిస్తామనే హామీ ఇచ్చే దశలోనే ప్రభుత్వం ఉన్నది. ఇంతకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి తమ ఇక్కట్లను పరిష్కరిస్తుందా అని ఉద్యోగులు సందేహంలో ఉన్నారు. 


అంతా గందరగోళమే..


ప్రతి సోమవారం స్పందనలో వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టర్‌కు అర్జీలు ఇవ్వడానికి వస్తుంటారు. వాటిని సంబంధిత విభాగాలకు పంపించి నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలి. కొత్త జిల్లా కావడంతో స్పందన గందరగోళంగా తయారయిందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. అర్జీలు తీసుకునే ఉద్యోగులు కనీస అవగాహన లేకుండా వాటిని సంబంధం లేని శాఖలకు పంపిస్తున్నారని చెబుతున్నారు. ఈ అర్జీలను చూసి అధికారులు అవాక్కవుతున్నారు. దీనివల్ల అటు అర్జీదారుల సమస్యలు తీరకపోగా, సంబంధంలేని అధికారులకు తలనొప్పిగా ఉందనే అభిప్రాయం వెలువడుతోంది. 


చేయాల్సిందే..


కొత్త జిల్లాకు ప్రభుత్వం అరకొర నిధులను కేటాయించింది. అధికారుల నుంచి కింది  వివిధ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు మాత్రం వస్తున్నాయని ఆయా శాఖల ఉద్యోగులు చెబుతున్నారు. అధికారులు చెప్పారు కదా అని నిధులు ఖర్చు చేద్దామంటే, ఆయా శాఖల ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. జిల్లా అధికారులకు ఈ పరిస్థితిలో మరింత ఇబ్బందిగా ఉంది. కొత్త జిల్లా ఏర్పడి నెల దాటినా వసతులు లేక ఉద్యోగులు ఆరుబయట విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిలో నిర్వేదం వ్యక్తమవుతోంది. ఈ ఇబ్బందులు తొందరలో చక్కబడే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో హాయిగా విధులు నిర్వహించే తమను ఇట్లా అస్తవ్యస్తంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసి ఇబ్బందులపాలు చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 


నిస్సహాయంగా ..


గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఏ అసౌకర్యం కలిగినా బాహాటంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కేవారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. తమ డిమాండ్లను వినిపించిన ఉద్యోగ సంఘాల నాయకులను ప్రతిపక్ష పార్టీలకు తొత్తులుగా  ప్రభుత్వం చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో తమపై కూడా అలాంటి ముద్ర పడితే ఉద్యోగ పరంగా ఇబ్బందిపడాల్సి వస్తుందని తమ సమస్యల గురించి మాట్లాడటానికి ఉద్యోగులు జంకుతున్నారు. దీనికితోడు కొంతమంది సీనియర్‌ ఉద్యోగులు కింది ఉద్యోగులతో విపరీతంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సౌకర్యాలు లేకపోయినా ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ని సమస్యల మధ్య ఎలా పని చేయాలని ఉద్యోగులు అంటున్నారు.

Read more