సంజయ్‌కి కేటీఆర్‌ ‘పరువు నష్టం’ నోటీసులు

ABN , First Publish Date - 2022-05-14T08:33:34+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేసేందుకు ఉపక్రమించారు.

సంజయ్‌కి కేటీఆర్‌ ‘పరువు నష్టం’ నోటీసులు

  • ప్రచారం పొందాలనే ఆరోపణలు.. 
  • 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌


హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేసేందుకు ఉపక్రమించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా శుక్రవారం ఆయనకు నోటీసులు పంపించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు మంత్రి కేటీఆరే కారణమంటూ ఈనెల 11న ట్విటర్‌ వేదికగా బండి సంజయ్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఆధారాలుంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సంజయ్‌ నుంచి స్పందన లేకపోవడంతో నోటీసులు పంపించారు. కేటీఆర్‌ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, నిరాధార ఆరోపణలతో ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే సంజయ్‌ అబద్థాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. జాతీయ పార్టీకి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్‌.. ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లయింట్‌కు ఆపాదించే యత్నం చేశారని తెలిపారు. కేటీఆర్‌ పరువుకు భంగం కలిగిస్తూ అసత్య వ్యాఖ్యలు చేసినందుకు పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు సంజయ్‌ అర్హులవుతారని పేర్కొన్నారు. అసత్య వ్యాఖ్యలు చేసినందుకు 48 గంటల్లోగా కేటీఆర్‌కు సంజయ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సూచించారు.

Read more