ఖరీ్‌ఫకు పక్కా ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-13T06:02:46+05:30 IST

ఖరీ్‌ఫకు పక్కా ప్రణాళిక

ఖరీ్‌ఫకు పక్కా ప్రణాళిక
ఉపాధి హామీ పనుల్లో భాగంగా పంట బోదెల తవ్వకాన్ని చేపట్టిన కూలీలు

రాయితీపై విత్తన పంపిణీకి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ

1.64 లక్షల హెక్టార్లలో వరిసాగుకు అంచనా

6,690 క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీ

6,300 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ 


గుడివాడ, మే 12 : మరో నెలలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాల పునర్విభజన అనంతరం తొలి ఖరీఫ్‌ కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. రైతులు ముందస్తుగా గట్లు పటిష్టం చేయటంతో పాటు బోదెలు తవ్వుకుంటున్నారు. వాతావరణంలో వచ్చిన అకాల మార్పులతో మెట్టదుక్కులకు సమాయత్తమవుతున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసుకున్నారు. 

పంటల విస్తీర్ణం ఖరారు

పంటల విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. కీలకమైన వరి 1.64 లక్షల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేస్తున్నారు. సకాలంలో కాల్వలకు నీరందిస్తే ఉమ్మడి జిల్లాలో మాదిరిగానే ఈసారి కూడా లక్ష్యాన్ని మించి వరిసాగుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాల్వల్లో నీటి లభ్యత, వర్షాలపై ఆధారపడి వరి సాగు విస్తీర్ణం ఉంటుంది. చెరుకు, మినుము, పెసర, వేరుశెనగ, పసుపు పంటలు సాగవుతాయని కూడా ప్రణా ళికలో పొందుపర్చారు. ఆయా పంటల సాగుకు విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు కార్యాచరణ రచిస్తున్నారు.

విత్తనాల పంపిణీకి చర్యలు

జిల్లావ్యాప్తంగా మూడు రకాలైన బీపీటీ-5204, ఎంటీయూ-1121, ఎంటీయూ-1061 విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 6,690 క్వింటాళ్ల వరి విత్తనాలు రాయితీపై సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కేజీ రూ.5 సబ్సిడీతో అందజేయనున్నారు. ఇప్పటికే ఏపీ సీడ్స్‌కు ఇండెంట్‌ పంపామని అధికారులు చెప్పారు. సాగులో రసాయన ఎరువులు తగ్గించి పచ్చిరొట్ట ఎరువుల వినియోగం పెంచాలని నిర్ణయించి రైతులకు అవగాహన కల్పించడానికి సమాయత్తమవుతున్నారు. అలాగే, జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి వాటికి 6,300 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం రాయితీతో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మినుము, పెసర విత్తనాలు 150 క్వింటాళ్లు 30 శాతం రాయితీపై సరఫరా చేయనున్నారు. 


20 నుంచి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

ఈనెల 20 నుంచి పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై అందజేస్తాం. రైతు భరోసా నిధులు ఈ నెల 16న రైతుల ఖాతాలో వేస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలు ఆర్బీకేల్లో ప్రదర్శించాం. కృషి యాప్‌ ద్వారా పారదర్శకంగా వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తాం. విత్తనాలు కావాల్సిన రైతులు ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. సకాలంలో కాల్వలకు నీరు విడుదలైతే లక్ష్యానికి మించి సాగు విస్తీర్ణం ఉంటుంది.

- కె.మనోహరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి



Read more