కేదార్‌నాథ్ దేవాలయంలో భక్తుల పూజలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-06T16:30:03+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయాన్ని హర హర మహాదేవ

కేదార్‌నాథ్ దేవాలయంలో భక్తుల పూజలు ప్రారంభం

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయాన్ని హర హర మహాదేవ నినాదాల మధ్య శుక్రవారం ఉదయం ఆరు గంటలకు భక్తుల కోసం తెరిచారు. వేలాది మంది భక్తులు భం భం భోలేనాథ్, హర హర మహాదేవ అంటూ భక్తిపారవశ్యంతో బాబా భోలేనాథ్‌ను దర్శించుకుని, పూజలు చేస్తున్నారు. కోవిడ్-19 ఆంక్షలు లేకుండా పూజలు చేసే అవకాశం దాదాపు రెండేళ్ల తర్వాత భక్తులకు లభించింది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 


దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద ఎత్తున హర హర మహాదేవ, భం భం భోలేనాథ్ అంటూ భక్తిపారవశ్యంతో నినాదాలు చేశారు. కొందరు భక్తులు వేద మంత్రాలను పఠించారు. ఈ దేవాలయాన్ని భక్తుల కోసం తెరిచిన సందర్భంగా 15 క్వింటాళ్ళ పూలతో అలంకరించారు. 


కేదార్‌నాథ్ దేవాలయాన్ని తెరిచిన సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కోవిడ్ సంబంధిత ఆంక్షలు చాలా వరకు తొలగిపోవడంతో భక్తులు హర్షాతిరేకాలతో తరలివస్తున్నారు. రోజుకు 12,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 


చార్‌ధామ్ యాత్ర మే 3న ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రిలను భక్తుల కోసం తెరవడంతో ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు వెళ్ళాలనుకునే భక్తులు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు కానీ, కోవిడ్-19 టీకాకరణ ధ్రువపత్రం కానీ సమర్పించవలసిన అవసరం లేదు. 


చార్‌ధామ్‌ యాత్రికుల కోసం ఓ ప్రైవేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందజేస్తున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తుల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ వైద్య సేవలను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.


బదరీనాథ్ దేవాలయాన్ని భక్తుల కోసం మే 8న తెరుస్తారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్ దేవాలయాలను సందర్శించి, పూజలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గంగోత్రికి రోజుకు 7,000 మందిని, బదరీనాథ్‌కు రోజుకు 15,000 మందిని, కేదార్‌నాథ్‌కు రోజుకు 12,000 మందిని, యమునోత్రికి రోజుకు 4,000 మందిని అనుమతిస్తారు. 


Read more