15 నెలల కాలం.. 52 వేల ఇళ్ల లక్ష్యం... పూర్తయ్యింది 0

ABN , First Publish Date - 2022-05-04T06:43:30+05:30 IST

విభజిత నెల్లూరు జిల్లాలో తొలి విడతగా 52,597 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

15 నెలల కాలం..  52 వేల ఇళ్ల లక్ష్యం...  పూర్తయ్యింది 0
ఉలవపాడు : రామాయపట్నంలోని జగనన్న కాలనీలో ఇళ్ల దుస్థితి

ఇదీ జిల్లాలో జగనన్న లే అవుట్ల ప్రగతి


జగనన్న నవరత్నాలలో మెజారిటీ పథకాలన్నీ తాత్కాలిక తృప్తినిచ్చేవే. ఒక పూట తిని అరిగించుకునేవే. దీర్ఘకాలిక లబ్ధినిచ్చే ఒకేఒక్క పథకం పక్కా గృహాలు. ఇంటిల్లిపాది తలదాచుకోవడం కోసం చిన్న గూడు కట్టుకోవాలన్నదే సామాన్యుడి కల.  వైసీపీ అధినేత జగన్‌ అధికారంలోకి వస్తే అది నెరవేరుతుందని జనం విశ్వసించారు. అయితే ఆ నమ్మకం ఒమ్మయ్యింది. నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు కేటాయించడం, కాళ్లు ముడుచుకొని పడుకోవడానికి కూడా సరిపడనంత స్థలాన్ని ఇవ్వడం, ప్రభుత్వమే కట్టి ఇస్తుందని ఇచ్చిన మాట తప్పడం.. సొంతంగా కట్టుకుందామంటే సామాన్యులు కొనలేని స్థాయికి ఇసుక, ఇటుక, సిమెంటు, ఇనుము ధరలు పెరిగిపోవడం.. వీటన్నిటితో విసిగిపోయిన లబ్ధిదారులు జగనన్న ఇళ్లు అంటేనే మొహం మొత్తిపోయారు. దీనికితోడు ప్రభుత్వం ఇచ్చే  రూ.1.8లక్షలు ఏ మూలకు సరిపోక వేసిన పునాదులను ప్రభుత్వానికే వదిలేసి ‘‘మీ ఇళ్లు వద్దు మహాప్రభో..’’ అనే స్థాయికి చేరుకున్నారు. ఇంటి మీద ఆశతో పునాదుల కోసం చేసిన అప్పుల బాధ ఒకవైపు భయపెడుతుంటే, ఇల్లు కట్టుకోకపోతే మీ కథ చూస్తాం అని అధికారుల  వేధింపులు తట్టుకోలేక ఊరొదిలి వెళ్లిపోదామనుకునే స్థాయికి చేరుకున్నారు. జగనన్న ఇళ్ల పథకం ప్రారంభించి  15 నెలలు గడుస్తున్నా, వందలసార్లు అధికారులు సమీక్షలు జరిపినా ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదంటే ఈ పథకం ఏ రీతిగా కొండెక్కిపోయిందో స్పష్టమవుతోంది. 


నెల్లూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): విభజిత నెల్లూరు జిల్లాలో తొలి విడతగా 52,597 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతలు అట్టహాసంగా భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఇది గడిచి 15 నెలలు దాటిపోయింది. జగనన్న లే అవుట్లలో రూ.కోట్లు వెచ్చించి మట్టి రోడ్లు ఛిద్రమైపోగా, ముళ్ల పొదలు బలిసిపోయాయి కానీ ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. లక్ష్యంలో రూఫ్‌ లెవల్‌కు వచ్చిన నిర్మాణాలు కేవలం 756 మాత్రమే. ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కానివి, పునాదుల కోసం గోతులు తీసి వదిలేసిన నిర్మాణాలు 81 శాతం ఉన్నాయి. ఇంటి నిర్మాణాలపై ఉన్నతాధికారులు వెంటపడుతున్నా అధికారులు, వలంటీర్లు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నా ఇప్పటి వరకు 42 వేల పైచిలుకు ఇళ్ల పనులు ఆరంభమే కాలేదు. 


 వెంటాడిన కష్టాలు

తొలుత  ఇల్లు కట్టుకోవడానికి, ఇంటి ఎదురుగా గొర్రె, బర్రె కట్టుకోవడానికి వీలుగా మూడు సెంట్ల స్థలమైనా ఇస్తారని ప్రజలు ఆశపడ్డారు. అది పోయింది. మూరెడు జాగా మిగిలింది. అదైనా ఉన్న ఊరికి ఆనుకొని ఇస్తారనుకున్నారు. ఆ దూరం కాస్త కిలోమీటర్లకు జరిగింది. సరేలే ఎక్కడో ఒకచోట ప్రభుత్వమే కట్టిస్తుంది కదా అనుకున్నారు. కాదు మేము రూ.1.8లక్షలు ఇస్తాం మీరే కట్టుకోండి అన్నారు. ఇది సర్దుకునేలోపు ధరల పిడుగు పడింది. తొలుత ఇసుక కొరత, ఆ తరువాత ఇటుకల ధర పెరిగింది. ఆ వెంటనే సిమెంటు, స్టీలు ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. వీటికి ఏమాత్రం తగ్గకుండా తాపీ మేస్ర్తీల కూలి పెరిగింది. దీంతో లబ్ధిదారులు తమ వల్ల కాదు, ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలని ప్రాధేయపడ్డారు. కుదరదంటే కుదరదు ఇల్లు కట్టుకుంటారా.. పట్టా రద్దు చేయమంటారా అని అధికారులు బెదిరింపులకు దిగారు. 


పథకం కొనసాగేనా!?

మొదటి విడత లబ్ధిదారుల అనుభవాలను చూసి రెండో విడత లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలకు పూనుకుంటారా!? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఒక్కటే పరిష్కారం. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తే తప్ప ఈ పథకం సక్సెస్‌ కాదు. ఇలా చేయడానికి ప్రభుత్వం ఖజానాలో నిధులు లేవు. ఇక ఎన్నికలకు మిగిలింది కేవలం రెండేళ్ల కాలమే. అందులో ఒక సంవత్సరం ఎన్నికల ప్రచారానికే ప్రాధాన్యం. నిఖరంగా మిగిలేది కొన్ని నెలల కాలం మాత్రమే. 15 నెలల్లో ఒక ఇల్లు కూడా పూర్తి చేయాలేని వారు, మిగిలిన 12, 18 నెలల కాలంలో అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వగలరా!? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


నియోజకవర్గం మొ.ఇళ్లు స్లాబ్‌     రూప్‌ బేస్‌మెంట్‌     మొదలుకానివి

ఆత్మకూరు 1800         72     51     329         1338

ఉదయగిరి 206         19     08     64         115

కందుకూరు 4329         465     102     485         3305

కావలి         9824         299     138     1307         8130

కోవూరు 8070         530     155     1107         6655

నెల్లూరుసిటీ         8994         136      43     1385         7430

రూరల్‌ 9898         139     32     828         8899

సర్వేపలి 11176 825     227     995         9129 

మొత్తం 52597 2485     756     6500         42856                    


===============



Read more