‘చుక్కల’ చిక్కు వీడేనా?

ABN , First Publish Date - 2022-05-09T05:30:00+05:30 IST

ఏళ్ల తరబడి నలుగుతున్న చుక్కల భూముల సమస్యను కలెక్టర్‌ స్థాయిలోనే పరిష్కరించాలన్న సీసీఎల్‌ఏ ఆదేశాలతో బాధిత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

‘చుక్కల’ చిక్కు వీడేనా?

నిషేధిత జాబితాలో 2.20 లక్షల ఎకరాలు

సీసీఎల్‌ఏ ఆదేశాలతో చిగురిస్తున్న ఆశలు


మదనపల్లె, మే 9: ఏళ్ల తరబడి నలుగుతున్న చుక్కల భూముల సమస్యను కలెక్టర్‌ స్థాయిలోనే పరిష్కరించాలన్న సీసీఎల్‌ఏ ఆదేశాలతో బాధిత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. చుక్కల భూముల సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం 2017లోనే చట్టం తీసుకొచ్చింది. దీని అమలుకు స్పష్టమైన విధి విధానాలను కూడా ప్రకటించింది. తర్వాత 2019, 2021లో ప్రభుత్వం 215, 575 జీవోలు జారీ చేసింది. అప్పటికీ అటు కలెక్టర్‌, ఇటు సీసీఎల్‌ఏలు ఒకరిపై మరొకరు వేసుకుంటున్నారే కానీ, క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపడం లేదు. ఈ క్రమంలో చివరకు బాధిత రైతుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ, ఆర్డర్‌ తెచ్చుకుంటున్నారు. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా స్థానికంగా అమాత్యుల అనుమతి లేనిదే పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో  రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌, ఇటీవల నిర్ణయాధికారాన్ని కలెక్టర్లకే కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధిత రైతులు చుక్కల చిక్కుల చెర వీడనుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.

       జిల్లాలో చుక్కల భూముల సమస్య పరిష్కరించాలని రైతుల నుంచి ప్రభుత్వానికి భారీగా వినతులు వెళ్లాయి. ఈ క్రమంలో మండలాల వారీగా ఆయా తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో జాబితా తయారు చేసి కలెక్టర్‌కు నివేదించారు. వీటిని 22(ఏ) నుంచి తొలగించాలని రెండేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌ గుప్తా, రిజిస్ర్టేషన్‌ శాఖ జిల్లా అధికారి (డీఆర్‌)కు ఆదేశాలు జారీ చేశారు. తమకు డైరెక్ట్‌గా కాకుండా సీసీఎల్‌ఏకు అక్కడి నుంచి స్టాంపులు, రిజిస్ర్టేషన్‌ శాఖ ఐజీ ద్వారా తమకు రావాలని డీఆర్‌ సూచించడంతో నిషేధిత భూముల (అనెగ్జర్‌-5) జాబితా పక్కన పడింది. ఇలా ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో సుమారు 20 వేల మంది రైతులకు సంబంధించిన 2.20 లక్షల ఎకరాల చుక్కల భూమి రిజిస్ర్టేషన్లకు నోచుకోలేదు. రెవెన్యూ రికార్డుల్లో 22 (ఏ) నుంచి తమ భూములకున్న చుక్కలు చెరిపేయాలని చేస్తున్న ప్రయత్నంలో పగలే చుక్కలు కనపడుతున్నా..అవి మాత్రం చెరగడం లేదు. వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కొందరు రైతులు చివరకు న్యాయస్థానం తలుపు తడుతున్నా న్యాయం జరగడం లేదు. భూముల రికార్డులు పరిశీలించి పరిష్కరించాలన్న కోర్టు ఆదేశాలతో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ అధికారులు తిరిగీ తిప్పి పంపుతున్నారు. స్పష్టమైన ఆర్డర్‌తో కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ ఉండాలన్నది అందులోని సారాంశం. ఈ రెండు జిల్లాల్లో బాధితుల్లో దాదాపు 2,600 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించినట్లు అంచనా. వీరిలో వందమందికిపైగా న్యాయస్థానం ఉత్తర్వులతో రిజిస్ర్టేషన్లు జరిగినట్లు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. రాజకీయ పలుకుడి ఉంటేనే అమలు అవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇలా ఎంతమంది రైతులు వ్యయ, ప్రయాసాలకోర్చి సమస్యను పరిష్కరించుకుంటున్నారన్నది వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

  భూముల రీసర్వే, సెటిల్‌మెంట్‌ జరిగిన 1916లో క్లయిమ్‌ చేయని భూముల జాబితా ఫార్మాట్‌ 16వ కాలంలో మూడు చుక్కలు పెట్టారు. తర్వాత అవి వాడుక భాషలో చుక్కల భూములుగా పిలుస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ భూములేనని భావిస్తున్న రెవెన్యూశాఖ..వాటిని 22(ఏ)లో చేర్చి రిజిస్ర్టేషన్లు నిలిపేయాలని స్టాంపులు, రిజిస్ర్టేషన్‌ శాఖను ఆదేశించింది. దీంతో అవి ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉంటున్నాయి. చుక్కల భూములన్నీ ప్రభుత్వ భూములు కావని 2013లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం 2017లో చుక్కల భూముల చట్టం తీసుకొచ్చి విధి విధానాలను రూపొందించింది. ఇందులో ఏడు అంశాలలో ఏ ఆధారమైనా చూపించి క్లయిమ్‌ చేసుకుంటే కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించింది. తగిన ఆధారాలతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కాకపోవడంతో ఏళ్ల తరబడి రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చుక్కల భూములే కాదు..మాజీ సైనికులు భూముల సమస్యలు పరిష్కారంలోనూ, అలాగే కో-ఆపరేటివ్‌ బ్యాంకుల వేలంలో కొనగోలు చేసిన చుక్కలు, డీకేటీల భూముల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. వేలంలో  కొన్న భూములను మొదట్లో రిజిస్ర్టేషన్లు చేయగా, ప్రస్తుతం వాటినీ నిషేధిత జాబితాలో చేర్చారు.

Read more