కేసీఆర్‌ పాలనలో జిల్లాకు అన్యాయం

ABN , First Publish Date - 2022-05-11T05:11:19+05:30 IST

బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 27వ రోజు

కేసీఆర్‌ పాలనలో జిల్లాకు అన్యాయం
తొమ్మిది రేకుల గ్రామంలో ప్రసంగిస్తున్న బండి సంజయ్‌

  • పేదల రక్తం తాగుతున్న సీఎం కేసీఆర్‌ 
  • ఆరాచక, కుటుంబపాలనను అంతమొందించడానికే పాదయాత్ర
  • లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో సీఎం ఇచ్చిన హామీ ఏమైంది? 
  • బీజేపీకి అసలైన బాసులు రంగారెడ్డి జిల్లా వాసులే
  • ప్రజా సంగ్రామయాత్రతో జిల్లాలో జోష్‌ పెరిగింది 
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 27వ రోజు మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికారు. కొందరు అభిమానులు గజమాలతో ఆయనను సత్కరించారు. అనంతరం గ్రామంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. బండి సంజయ్‌ ప్రసంగ సమయంలో జనం పూల వర్షం కురిపించారు.


రంగారెడ్డి అర్బన్‌/షాద్‌నగర్‌/కేశంపేట/నందిగామ, మే 10 :సీఎం కేసీఆర్‌ పేదల రక్తాన్ని తాగుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేసిన ద్రోహి కేసీఆర్‌ అని మండి పడ్డారు. పాదయాత్రలో ప్రజల మద్దతు చూస్తుంటే టీఆర్‌ఎస్‌ నేతలకు కళ్లు కనిపించడం లేదన్నారు. తెలగాణకు లక్షా 40 వేల ఇండ్లను మోదీ మంజూరు చేస్తే తొమ్మిదిరేకుల గ్రామంలో ఎంతమందికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చారని ప్రశ్నించారు. పేదల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఆరాచక, కుటుంబ పాలనను అంతమొందించడానికే పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారని తెలిపారు. షాద్‌నగర్‌ నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులను గెలిపించిన జిల్లా రంగారెడ్డి జిల్లా అని తెలిపారు. బీజేపీ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్‌ బాక్స్‌లు బద్దలవుతున్నాయని తెలిపారు. బీజేపీకి అసలైన బాసులు రంగారెడ్డి జిల్లా వాసులేనని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రతో జిల్లాలో జోష్‌ పెరిగిందని తెలిపారు. 


బీజేపీకి అసలైన బాసులు మీరే..

బీజేపీకి అసలు సిసలైన బాస్‌లు మీరే.. రాష్ట్రంలో అవినీతి, నియంత, కుటుంబ పాలనతో వ్యతిరేకంగా మీరు సాగిస్తున్న పోరాటాల వల్లే టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదిగిందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మధ్యాహ్న విరామ సమయంలో పదివేల మంది బూత్‌ కమిటీ అధ్యక్షులతో బండి సంజయ్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ మూర్ఖపు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురి చేస్తున్నా.. అక్రమ కేసులు పెట్టి జైల్లకు పంపుతున్నా.. భయపడకుండా ఎదురొడ్డి పోరాడుతున్నామన్నారు. దేశంలోని 18 రాష్టాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి పోలింగ్‌ బూత్‌ కమిటీ అధ్యక్షులు చేసిన కృషి కారణమని, ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు విషయాన్ని ప్రస్తావించి ప్రశంసించారని గుర్తు చేశారు. ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో జరిగే ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ తెలంగాణలో సంచలనం సృష్టించబోతుందన్నారు. అమిత్‌షా పాల్గొనబోయే ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నామని తెలిపారు. 5 లక్షల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు తరలివచ్చే అవకాశముందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.  


షాద్‌నగర్‌లో కాషాయ జెండా ఎగరేస్తాం : బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని బొక్క నర్సింహారెడ్డి అన్నారు. ప్రజా సంగ్రామ యా త్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అవినీతి, అరాచకపాలనపై ప్రజలు విసుగుచెందారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, రానున్నది బీజేపీ రాజ్యమేనని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఫార్మాసిటీ, ఎలక్ర్టిసిటీ వంటి కంపెనీల పేరుతో పేదల విలువైన భూములను లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్‌గౌడ్‌, పార్టీ సీనియర్‌ నేతలు శ్రీవర్థఽన్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, విథున్‌రెడ్డి, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, పాపయ్య గౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, అందెబాబయ్య, పల్లె ఆనంద్‌ గౌడ్‌, ఎంకనోళ్ల వెంకటేశ్‌ గౌడ్‌, కేశంపేట బీజేపీ మండల అధ్యక్షులు పసుల నర్సింహులు పాల్గొన్నారు.  


రంగారెడ్డి జిల్లాలో కూడా కుటుంబ పాలన 

రాష్ట్రం మొత్తం కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతుంటే.. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబాల పాలన సాగుతుందని బండి సంజయ్‌ విమర్శించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని పోషిస్తున్నది వారేనని ఎద్దేవా చేశారు. వారి ఆస్తులను పెంచుకోవడం కోసమే తపన పడుతున్నారని చెప్పారు. మంగళవారం రాత్రి కేశంపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్‌ ప్రసంగించారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. మాకు ఏమి ఇచ్చారని టీఆర్‌ఎస్‌ పాలకులను నిలదీయాలని కేశంపేట మండల ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే అది టీఆర్‌ఎస్‌ పార్టీకి వేసినట్టేనని, రెండు పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీని కైవసం చేసుకుని కొత్త బస్తీగా మారుస్తామన్నారు. ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరి స్తుందన్నారు. పేదల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే బీజేపీ ముందుకు వచ్చిందన్నారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని నడుపుతామన్నారు.  


అడ్డగోలుగా దోపిడీ : డీకే అరుణ

కేసీఆర్‌కు మించిన అవినీతిపరుడు మరొకరు లేడని, రాష్ర్టాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.4వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, కొత్త రేషన్‌ కార్డులు, మహిళాసంఘాలకు రూ.10లక్షల రుణాలు ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. నరేంద్రమోడీ. జేపీ నడ్డా, అమిత్‌షా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకే బండి సంజయ్‌ను పాదయాత్రకు పురమాయించారని చెప్పారు. 


సాగు నీరు ఏమైంది? : మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి 

పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న గొర్లు, బర్ల పథకాలు మొదలుకుని అన్ని సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మద్యం షాపులను పెంచుడు తప్ప కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులేవీ లేవని ఎద్దేవా చేశారు. 


ఆట మొదలైంది.. ఇక సమరమే : శాంతికుమార్‌ 

తెలంగాణలో బీజేపీ ఆట మొదలైందని, ఇక సమరం.. సంగ్రామమే అని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఒక వైపు ఉంటే బీజేపీ, ప్రజలు ఒకవైపు ఉన్నారని చెప్పారు. బండి సంజయ్‌కు అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.   


ధరలు తగ్గించాలని నిరసన

బండి సంజయ్‌ పాదయాత్రలో ఓ వ్యక్తి పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలంటూ ఫ్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అతన్ని చూసి పార్టీ నేతలు, పోలీసులు అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. తన బాధను వ్యక్తం చేయడానికి వచ్చానని చెప్పినా పోలీసులు జోక్యం చేసుకొని అతన్ని అక్కడి నుంచి పంపించారు. 


 ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వినతి

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్‌పీఎస్‌ నేతలు బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చట్టబద్దత కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. 



Read more