Uber Cup: క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన India మహిళల జట్టు

ABN , First Publish Date - 2022-05-10T23:37:25+05:30 IST

ఉబెర్ కప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. గ్రూప్ డిలో భాగంగా నేడు జరిగిన

Uber Cup: క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన India మహిళల జట్టు

బ్యాంకాక్: ఉబర్ కప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. గ్రూప్ డిలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏను 4-1తో ఓడించిన భారత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. తొలి టైలో 4-1తో కెనడాను చిత్తు చేసిన ఇండియా.. క్వార్టర్స్‌కు అర్హత సాధించేందుకు, గ్రూప్‌లోని తొలి రెండు స్థానాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. 


తెలుగుతేజం పీవీ సింధు మరోమారు సత్తా చాటింది. జెన్నీ గైతో జరిగిన మ్యాచ్‌లో 21-10, 21-11తో వరుస సెట్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. డబుల్స్‌లో తానీషా క్రాస్టో-ట్రీసా జాలీ ద్వయం ఫ్రాన్సెస్కా కార్బెట్-అలీసన్ లీపై 21-19, 21-10తో వరుస సెట్లలో విజయం అందుకుంది. అంతకుముందు ఆకర్షి కశ్యప్ 21-18, 21-11తో ఎస్తెర్ షిపై విజయం సాధించింది. ఫలితంగా భారత్ 3-0తో ఆధిక్యం సంపాదించింది. 


యువ డబుల్స్ జోడీ సిమ్రన్ సింఘి-రితిక థాకర్ అమెరికాకు చెందిన లారెన్ లామ్-కోడి టాంగ్ లీ చేతిలో 12-21, 21-17, 13-21తో ఓడింది. ఫైనల్ మ్యాచ్‌లో అశ్మిత చలీహా 21-18, 21-13తో నటాలీ చిపై గెలుపొంది మ్యాచ్‌ను ముగించింది. గతంలో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత మహిళల జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో బుధవారం కొరియాతో తలపడనుంది. కాగా, భారత పురుషుల జట్టు కూడా నాకౌట్ దశకు చేరుకుంది. 

Read more