వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలి

ABN , First Publish Date - 2022-05-12T06:31:51+05:30 IST

సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ అభివృద్ధిశాఖ కమిషనర్‌ యోగితారాణా సూచించారు.

వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలి

విద్యార్థుల నమోదులో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి

హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున నిధులు

సాంఘిక సంక్షేమ అభివృద్ధిశాఖ కమిషనర్‌ యోగితారాణా

 నిజామాబాద్‌ అర్బన్‌, మే 11: సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ అభివృద్ధిశాఖ కమిషనర్‌ యోగితారాణా సూచించారు. కొవిడ్‌ సంక్షోభం కారణంగా రెండేళ్ల నుంచి హాస్టళ్లలో ఆశించినస్థాయిలో విద్యార్థులు చేరలేకపోయారని.. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఉన్న దృష్ట్యా విద్యార్థుల నమోదుపై దృష్టిపెట్టాలని ఆమె ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల అధికారులతో మాట్లాడారు. హాస్టల్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని ఇప్పటికే దాదాపు అన్ని వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థుల నమోదును పెంచాలన్నారు.  విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనం దక్కేలా చూడాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం అందిస్తున్నందున.. దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శశికళ పాల్గొన్నారు. 

పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి..

పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని యోగితారాణా సూచించారు. గ్రూప్‌ పరీక్షలు రాస్తున్న షెడ్యుల్డ్‌ కులాల అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న ముందస్తు శిక్షణ కేంద్రాలను బుధవారం ఆమె సందర్శించారు. నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభ్యర్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 15చోట్ల ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముందస్తు శిక్షణ అందిస్తున్నామని.. ఒక్కో అభ్యర్థికి స్టడీ మెటిరియల్‌ కోసం రూ.1500 ఖర్చు చేస్తున్నామన్నారు. తాను కలెక్టర్‌గా పనిచేసిన ఈ జిల్లా నుంచి అభ్యర్థులందరు ఉద్యోగాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామకాల జాబితాలో జిల్లాకు చెందిన అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఎంపికయ్యేలా అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం నగరంలోని 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద గల ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని కమిషనర్‌ సందర్శించారు. హాస్టల్‌లో చేపట్టిన మరమ్మతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ, అధికారులు పాల్గొన్నారు. 

చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు..

:మానవతా సదన్‌ విద్యార్థులతో యోగితా రాణా

డిచ్‌పల్లి: మానవతా సదన్‌లో విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సాంఘిక సంక్షేమ అభివృద్ధిశాఖ కమిషనర్‌ యోగితారాణా అన్నారు. బుఽధవారం హైదరాబాద్‌ నుంచి మానవతా సదన్‌కు వచ్చిన ఆమె విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. రాష్ట్రంలో మానవతా సదన్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కేర్‌ టేకర్‌ రమేష్‌కు సూచించారు.

Read more