పాట వినాలంటే ... పన్ను కట్టాల్సిందే!

ABN , First Publish Date - 2022-05-08T05:39:37+05:30 IST

ఈ సంస్థ 1969 నుంచి పనిచేస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన లాభాపేక్ష లేని సంస్థ ఇది.

పాట వినాలంటే ...  పన్ను కట్టాల్సిందే!

సంగీత దర్శకులు, గేయ రచయితలు, నిర్మాతల క్రియేటివ్‌ కాపీరైట్‌ హక్కుల పరిరక్షణ కోసం కృషిచేస్తున్న సంస్థ ఐపీఆర్‌ఎస్‌ (ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్‌ సొసైటీ లిమిటెడ్‌). క్రియేటర్ల హక్కులపై అవగాహన కల్పించడం కోసం ఐపీఆర్‌ఎస్‌ ఏడాదిపాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వర్క్‌ షాపులు నిర్వహిస్తోంది. ఇటీవలె హైదరాబాద్‌లో ‘లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ పేరుతో  తెలుగు రాష్ట్రాల కంటెంట్‌ క్రియేటర్లకు కాపీరైట్‌, లైసెన్సింగ్‌ జారీ, రాయల్టీ పొందడం లాంటి  పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపీఆర్‌ఎస్‌ సీఈవో రాకేశ్‌ నిగమ్‌, తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, గేయ రచయితలు చంద్రబోస్‌, సుద్దాల అశోక్‌తేజ, సంగీత దర్శకుడు ఆర్‌.పి పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఐపీఆర్‌ఎస్‌ ప్రస్థానం గురించి తెలపండి

సంస్థ 1969 నుంచి పనిచేస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన లాభాపేక్ష లేని సంస్థ ఇది.  ప్రస్తుతం దీనికి బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గేయ రచయితలు,  సంగీత దర్శకులు, నిర్మాతల కాపీరైట్‌ హక్కులను పరిరక్షిస్తోంది. ప్రతిభావంతులైన క్రియేటర్లు తమ హక్కులు, అవకాశాల గురించి సరైన అవగాహన లేక నష్టపోతున్నారు. అలాంటివారికి కాపీరైట్‌ హక్కుల ద్వారా రాయల్టీ రూపంలో తమ ఆదాయాన్ని పెంచుకోవడం ఎలాగో అవగాహన కల్పిస్తున్నాం. కొవిడ్‌ సమయంలో సంస్థ తరపున 4 వేల మంది సభ్యులకు రూ. 6 కోట్ల ఆర్థిక సాయం అందించాం. 


సంస్థ తరపున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?

ఇదొక కాపీరైట్‌ సొసైటీ. రాయల్టీపై అవగాహన లేక పోవడం వల్ల ఎలా నష్టపోతున్నారో క్రియేటర్లను కలిసి వారికి వివరిస్తాం. తమ ఉత్పత్తికి కాపీరైట్‌ పొందడం, దాన్ని వాడుకోవాలనుకున్న ప్లాట్‌ఫామ్‌లకు లైసెన్స్‌ ఇవ్వడం నేర్పుతాం. వర్ధమాన క్రియేటర్లలో చైతన్యం తెచ్చేందుకు దేశవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో  పలువురు సినీరంగ ప్రముఖులను భాగస్వాముల్ని  చేస్తున్నాం. 


కంటెంట్‌ క్రియేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి?

క్రియేటర్లకు తమ  హక్కుల గురించి తెలియదు. మ్యూజిక్‌ అంటే ఫ్రీ గా దొరుకుతుంది అనే భావన మనదేశ పౌరుల్లో చాలా బలంగా ఉంది. కానీ అది కొందరి కష్టం ఫలితం. క్రియేటర్లకు కనీసం ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వకుండా కంటెంట్‌ను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో  విచ్చలవిడిగా వాడుతున్నారు. ముందు దీన్ని నిరోధించాలి. క్రియేటర్లకు మరిన్ని అవకాశాలను, ఆదాయాన్ని సృష్టించాలనేది మా ప్రయత్నం. అందుకే కాపీరైట్‌, లైసెన్సింగ్‌ జారీపై శిక్షణ ఇస్తున్నాం. 


 పాన్‌ ఇండియా చిత్రాలతో టాలీవుడ్‌ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా ఇక్కడేమైనా దృష్టిపెట్టారా?

తెలుగు సంగీత పరిశ్రమ ఖండాతరాలకు పాకింది. ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. త్వరలో హైదరాబాద్‌లో ఐపీఆర్‌ఎస్‌ శాఖను ప్రారంభిస్తాం. దీనిద్వారా క్రియేటర్లకు మరింత సులభంగా,  త్వరితంగా సేవలు అందించడం వీలవుతుంది. వేలాది మంది కంటెంట్‌ క్రియేటర్లు లబ్ది పొందుతారు. ఇక్కడి గేయ రచయితలు,  సంగీత దర్శకులు మా ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 


ఐపీఆర్‌ ఎస్‌కు క్రియేటర్ల నుంచి వస్తున్న ఆదరణ ఎలా ఉంది?

భారత సంగీత పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కాపీరైట్‌ ద్వారా ఐపీఆర్‌ఎస్‌ ఆర్జించిన రాయల్టీ సుమారు రూ. 169 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 310 కోట్లకు చేరింది. దాదాపు 85 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాయల్టీ  రూపంలో పొందిన మొత్తం రూ. 200 కోట్లు దాటడం ఇదే తొలిసారి. ఈ వృద్ధికి ఓటీటీ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌  కారణం. ఇది మా ప్రయత్నానికి గొప్ప ఊపునిచ్చింది. 


క్రియేటర్లకు ఆదాయం ఎలా సమకూర్చుతారు?

ముఖ్యంగా మ్యూజిక్‌ ఇండస్ట్రీ వరకూ చూస్తే పాటలు వాడని ప్రదేశం లేదు. ఎఫ్‌ఎం రేడియో, టీవీలు, సోషల్‌ మీడియా, య్యూట్యూబ్‌, ఓటీటీ, రైళ్లు, హోటళ్లు, పబ్స్‌, మాల్స్‌ లాంటి వాణిజ్య ప్రదేశాల్లో కంటెంట్‌ను ఎలాంటి లైసెన్స్‌ తీసుకోకుండానే వాడుతున్నారు. 70 ఏళ్లుగా వారు క్రియేటర్లకు ఏమీ చెల్లించకుండానే వాడుతున్నారు. ఇప్పుడు మేం అడుగుతున్నాం. చెల్లించకపోతే చట్టపరంగా వెళ్తాం. ఐపీఆర్‌ఎస్‌ వచ్చాక అలాంటి వారి నుంచి రాయల్టీ వసూలు చేస్తుంది. గరిష్టంగా 15 శాతం సంస్థ నిర్వహణ కోసం ఛార్జి చేస్తుంది. మిగిలినది రిజిస్టరయిన క్రియేటర్లకు పంచుతుంది. నిర్మాతకు 50 శాతం, గేయరచయిత, సంగీత దర్శకుడికి 25 శాతం చొప్పున చెల్లిస్తారు. ప్రతి ఒక్కరూ మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ చిన్నమొత్తంలో ఫీజుగా ఎందుకని కట్టరు? ఆదాయపు  పన్ను, గ్యాస్‌, కరెంట్‌ బిల్లు కట్టినట్లే మ్యూజిక్‌కు కూడా పన్ను కట్టాల్సిందే.  అయితే దేవాలయాలు, జాతర్ల లాంటి చోట్ల మాత్రం రాయల్టీ వసూలు చేయం.  


సంస్థలో సభ్యులుగా చేరాలంటే ఏం చేయాలి?

ఒక్కసారి రూ. 1200 కట్టి సభ్యత్వం తీసుకుంటే సరిపోతుంది. సంస్థ వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా చేరవచ్చు. అలాగే సంస్థలు కూడా తాము ఉపయోగించాలనుకునే కంటెంట్‌కు లైసెన్స్‌  తీసుకోవచ్చు.  


మీ కృషికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి?

విదేశాల్లో సోషల్‌ మీడియా సంస్థలు కాపీ కంటెంట్‌ను ప్రోత్సహించవు. కానీ ఇక్కడ మాత్రం కాపీ కంటెంట్‌ను అడ్డుకోవడంపై పట్టించుకోలేదు. మేము గట్టిగా పోరాటం చేయడంతో ఇప్పుడిప్పుడే ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి. అలాగే యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో చిన్న చిన్న కంటెంట్‌ క్రియేటర్లు మంచి రాయల్టీని అందుకుంటున్నారు. దీనిపై క్రియేటర్లతో పాటు ప్రజల్లోనూ మరింత చైతన్యం రావాలి. 


ఐపీఆర్‌ఎస్‌ గురించి జనంలో విస్తృత చర్చ జరగడానికి  ప్రచారంలో కొత్త పోకడలకు తెరతీశారు సంస్థ సీఈవోగా రాకేశ్‌ నిగమ్‌. వర్ధమాన కళాకారులను పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేర్చడం, కాపీరైట్‌, రాయల్టీ, లైసెన్సింగ్‌ లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు వర్క్‌షాపులు నిర్వహించడం ద్వారా క్రియేటర్లకు సంస్థను మరింత చేరువ చేయడంలో ఆయనది కీలకపాత్ర. వర్క్‌షాపులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా రాకేష్‌ నిగమ్‌ చిత్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి...


మరణానంతరమూ రాయల్టీ

నేను తొలుత సినిమాల్లోకి పాటల రచయితగానే అడుగుపెట్టాను. తొలినాళ్లలో 11 పాటలు రాశాను. మూడేళ్ల క్రితం ఐపీఆర్‌ఎస్‌ గురించి తెలిసి అందులో సభ్యుడిగా చేరాను. ఈ కొద్దికాలంలోనే ఆ పాటలకు నేను అందుకున్న పారితోషికానికి పదిరెట్లు డబ్బును రాయల్టీ రూపంలో అందుకున్నాను. త్వరలో తెలుగు సినీ రచయితల సంఘం ఆఫీసులోనే ఐపీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభమవుతోంది. ఈ అవకాశాన్ని తెలుగు క్రియేటర్లు ఉపయోగించుకోవాలి. క్రియేటర్ల మరణానంతరం 63 ఏళ్ల పాటు వారి కుటుంబ సభ్యులకు ఈ రాయల్టీ అందుతుంది. ఈ మొత్తం వృద్ధాప్యంలో కుటుంబాన్ని అదుకుంటుంది. 

పరుచూరి గోపాలకృష్ణ, 

సినీ రచయితల సంఘం అధ్యక్షుడు


ఐపీఆర్‌ఎస్‌ ఆదుకుంటుంది

మా మామగారు 40 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా అరడజను చిత్రాలకు పనిచేశారు.  ఇటీవలె ఆయన ఐపీఆర్‌ఎస్‌లో మెంబర్‌గా చేరిన కొద్దికాలంలోనే రూ. 15 వేలు రాయల్టీ రూపంలో వచ్చాయి. రాయల్టీ వ్యవస్థ  గొప్పది. సమాంతర ఆదాయం ఇస్తూ చితికిపోయిన కళాకారులను ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది. చేతిలో పనిలేకపోయినా ఆదాయం కోల్పోకుండా ఐపీఆర్‌ఎస్‌ ఆదుకుంటుంది. దయచేసి ఎవరైనా మా కష్టార్జితాన్ని ఉచితంగా ఆస్వాదించవద్దు. రాయల్టీ చెల్లించి వాడుకోండి. 

చంద్రబోస్‌, గేయ రచయిత


నెల నెలా ఆదాయం

నేను పాతికేళ్లుగా పాటలు రాస్తున్నా. పదేళ్ల క్రితం ఐపీఆర్‌ఎస్‌లో సభ్యుడిగా చేరాను. రిటైరైన ప్రభుత్వోద్యోగికి కూడా ఇప్పుడు పెన్షన్‌ రావడం లేదు. మాకు మాత్రం నెల నెలా రాయల్టీ రూపంలో చెప్పుకోతగ్గ మొత్తం చేతికొస్తోంది. ఇటీవల నాకు లివర్‌ మార్పిడి చికిత్స జరిగింది. ఆ సమయంలో సంస్థ తరపున నాకు ఆర్థిక సాయం అందించారు. అవసానదశలో కష్టం వద్దనుకునే క్రియేటర్లు ఐపీఆర్‌ఎస్‌లో సభ్యులుగా చేరడం మంచిది. 

సుద్దాల అశోక్‌తేజ  గేయ రచయిత


పనిలేకపోయినా ఇబ్బంది ఉండదు

ఐపీఆర్‌ఎస్‌లో రిజిస్టరయితే కమర్షియల్‌గా ఎక్కడ వాడినా కంటెంట్‌కు రాయల్టీ వస్తుంది. కొన్నాళ్ల పాటు పనిలేకపోయినా కళాకారులు జరుగుబాటుకు ఇబ్బంది ఉండదు. కథ, మాటలు, పాటలు, సంగీతం, సింగింగ్‌ విభాగంలో క్రియేటర్లకు రాయల్టీ వస్తుంది.

ఆర్‌.పి పట్నాయక్‌, సంగీత దర్శకుడు

Read more