కాస్మటిక్స్‌ నిల్వ కాలమెంత?

ABN , First Publish Date - 2022-05-07T04:03:19+05:30 IST

కాస్మటిక్స్‌ నిల్వ కాలమెంత?

కాస్మటిక్స్‌ నిల్వ కాలమెంత?

కాస్మటిక్స్‌ ఖరీదైనది కాబట్టి, వాటిని అడుగంటే వరకూ వాడాలని అనుకుంటాం. అయితే వాటికీ కాలం చెల్లుతుందనే విషయం గ్రహించాలి. కాస్మటిక్స్‌ రకం, వాటిని నిల్వ చేసే ప్రదేశం, నిల్వ చేసే విధానాలను బట్టి అవి రెండేళ్ల నుంచీ, మూడు నెలలలోపే కాలం చెల్లిపోతాయి. కాబట్టి ఏ సౌందర్యసాధనాన్ని ఎంత కాలం వాడుకోవచ్చో తెలుసుకుందాం!

సౌందర్య సాధనాన్ని వాడడం మొదలుపెడితే, అది ఎప్పటివరకూ నిల్వ ఉంటుందో, ఆ తేదీని మాత్రమే కాస్మటిక్స్‌ మీద ముద్రిస్తారు. వాడకుండా ఉంచితే అదే కాస్మటిక్‌ ఎంత కాలం వరకూ పాడవకుండా ఉంటుందో, ఆ వివరాలు మాత్రం ఎక్కడా కనిపించవు. అయితే చల్లని, చీకటి ప్రదేశంలో, సీలు తీయకుండా భద్రపరిచిన మేకప్‌ కాస్మటిక్స్‌ రెండు నుంచి మూడేళ్ల పాటు నిల్వ ఉండాలి. అయితే నూనె, వెన్న లాంటివి కలిగి ఉండే క్రీమ్‌ కన్‌సీలర్లు లేదా ద్రవరూప బ్లష్‌లు వాటిలోని నూనెల కారణంగా త్వరగా పాడైపోతాయి. ఎటువంటి నిల్వ పదార్థాలూ జోడించకుండా, సహజసిద్ధ పదార్థాలతో తయారైన సౌందర్య సాధనాలు అంతకంటే వేగంగా పాడైపోతాయి. మేకప్‌ సౌందర్యసాధనాల్లో కలిపే ప్రిజర్వేటివ్స్‌ వల్ల, ఆ కాస్మటిక్స్‌ను వాడినా, వాడకపోయినా, అవి కాలంతో పాటు పాడైపోతాయి. కాబట్టి ఎంత ఖరీదైనా కాస్మటిక్‌ అయినా మూడేళ్లకు మించి వాడకూడదు. 

ఎక్స్‌పైరీ డేట్‌ అర్థం?

మేకప్‌ సామాగ్రి పైన ‘పిఎఒ’(పీరియడ్‌ ఆఫ్‌ ఓపెనింగ్‌)), కొన్ని నంబర్ల పక్కన ‘ఎమ్‌’(మంత్స్‌) అనే అక్షరాలు ముద్రించి ఉంటాయి. వీటిని బట్టి ఆ కాస్మటిక్‌ను తెరచిన రోజు నుంచి ఇంకా ఎన్ని నెలలు మిగిలి ఉన్నాయో లెక్కించి, వాడుకోవాలి. అదే వాటి షెల్ఫ్‌ లైఫ్‌. కాలం చెల్లిన కాస్మటిక్స్‌ వాటి నాణ్యతను కోల్పోతాయి. కాబట్టి ఉపయోగించినా ఫలితం ఉండదు. లిప్‌ లైనర్‌, ఐ లైనర్‌ లాంటి వాటిని చెక్కుకుని, వాడుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, వాటికి దీర్ఘకాల ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. 

ఇలా కనిపెట్టాలి

మస్కారా, ఐ మేకప్‌ల షెల్ఫ్‌ లైఫ్‌ తక్కువ. కన్‌సీలర్లకు 12 నెలలు, ఫ్రాగ్రెన్స్‌లకు ఐదేళ్ల షెల్ఫ్‌ లైఫ్‌ ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌పైరీ డేట్లు కాస్మటిక్స్‌ పైన కాకుండా, ప్యాకేజింగ్‌ల మీద ముద్రించి ఉంటాయి. కాబట్టి వాటిని పారేసే ముందు, ఈ డేట్లను గమనించాలి. ఒకవేళ కాస్మటిక్స్‌ ఎక్స్‌పైరీ డేట్‌ గురించిన అయోమయం ఉంటే, అవి పాడైపోయాయని నిర్థారించుకోవడం కోసం వాటిలో ఈ తేడాలను గమనించాలి. 

వాసన: వాటి నుంచి మంచి వాసన రావడం లేదంటే వెంటనే వాటిని పారేయాలి.

రంగు: చాలావరకూ కన్‌సీలర్లు గాల్లోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరిగి ఆక్సిడైజ్‌ అవుతాయి. దాంతో లేత నారింజ రంగులోకి మారతాయి. 

టెక్స్‌చర్‌: కాలంతో పాటు కాస్మటిక్స్‌ టెక్స్‌చర్‌ కూడా మారుతుంది. అప్లై చేసుకున్నప్పుడు తేడాను గ్రహిస్తే, వాటిని పారేయడమే మంచిది.

ఎప్పుడు పారేయాలి?

సీరం: డ్రాపర్‌ను కలిగి ఉండే ఇలాంటి కాస్మటిక్స్‌ తరచుగా గాలికి బహిర్గతమవుతూ ఉంటాయి కాబట్టి వీటిని 9 నెలలకు మించి వాడకూడదు. డ్రాపర్‌ బదులుగా పంప్‌ లాంటి ఏర్పాటు ఉన్నవి ఏడాది పాటు మన్నుతాయి.

ఐ మేకప్‌: ఈ కాస్మటిక్స్‌తో కళ్లు మండినా, దురదలు పెట్టినా, ఐ ఇన్‌ఫెక్షన్‌ మొదలైనా వాటిని వెంటనే పారేయాలి.

ఫౌండేషన్‌: దీనికి 6 నుంచి 12 నెలల్లోగా కాలం చెల్లుతుంది.

పౌడర్‌ కన్‌సీలర్‌: రెండేళ్ల షెల్ఫ్‌ లైఫ్‌ కలిగి ఉంటుంది.

లిక్విడ్‌ ఐలైనర్‌: దీని షెల్ఫ్‌ లైఫ్‌ ఆరు నెలలు

ఐబ్రో జెల్‌: ఏడాది, - ఐ షాడో: రెండేళ్లు

బ్లష్‌: రెండేళ్లు, - లిప్‌స్టిక్‌: రెండేళ్లు

లిప్‌ గ్లాస్‌: ఏడాది.

Read more