ఇల్లు కట్టి చూడు!

ABN , First Publish Date - 2022-05-03T05:44:28+05:30 IST

సిద్దిపేట పట్టణానికి చెందిన భాస్కర్‌ నాలుగు నెలల క్రితం ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. రూ.20 లక్షలతో పూర్తిచేయాలని అంచనా వేసుకున్నాడు. కానీ ఇసుక, ఐరన్‌, సిమెంటు, కంకర, ఇటుక.. ఇలా ధరలు పెరుగుతూ పోవడంతో అంచనా తప్పింది. అనుకున్న దానికంటే రూ.5 లక్షల అదనపు భారం పడింది. ఎలక్ర్టికల్‌, ప్లంబర్‌, పుట్టి, సీలింగ్‌ తదితర పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇల్లు పూర్తిచేయాలంటే అప్పు కోసం చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇల్లు కట్టి చూడు!

ధరల పెరుగదలతో రెట్టింపు భారం

చుక్కల్లో కంకర ధర

భారీగా పెరిగిన మైనింగ్‌ చార్జీలు

ట్రాక్టర్‌ ట్రిప్‌కు రూ. వెయ్యి అదనపు భారం

టన్నుకు రూ.12 సీనరేజీ, పర్మిట్ల ఫీజు పెంపు

పెరిగిన ఇసుక, స్టీలు, సిమెంట్‌ ధరలు

నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 2: సిద్దిపేట పట్టణానికి చెందిన భాస్కర్‌ నాలుగు నెలల క్రితం ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. రూ.20 లక్షలతో పూర్తిచేయాలని అంచనా వేసుకున్నాడు. కానీ ఇసుక, ఐరన్‌, సిమెంటు, కంకర, ఇటుక.. ఇలా ధరలు పెరుగుతూ పోవడంతో అంచనా తప్పింది. అనుకున్న దానికంటే రూ.5 లక్షల అదనపు భారం పడింది. ఎలక్ర్టికల్‌, ప్లంబర్‌, పుట్టి, సీలింగ్‌ తదితర పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇల్లు పూర్తిచేయాలంటే అప్పు కోసం చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇటీవల నిర్మాణ పనులు చేపట్టిన ప్రతీ ఒక్కరిదీ ఇదే పరిస్థితి. నిర్మాణానికి అవసరమైన అన్నింటి ధరలు పెరగడంతో ఖర్చు అంచనాలను దాటిపోయింది. సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం కూడబెట్టుకున్న డబ్బు చాలడం లేదని బోరుమంటున్నారు. ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపలేక... ఆర్థిక భారంతో పూర్తిచేయలేక సతమతమవుతున్నారు.


కంకరపై అదనపు సీనరేజీ

ఇంటి పునాది నుంచి శ్లాబు నిర్మాణం వరకు ప్రతీ దశలో కాంక్రీట్‌ వినియోగిస్తారు. కాంక్రీట్‌ తయారీలో కంకరకే ప్రాధాన్యం ఉంటుంది. నెల క్రితం కంకర ట్రాక్టర్‌ లోడ్‌ రూ.3,100 ధర పలికింది. ప్రస్తుతం రూ.4వేలకు పెరిగింది. టన్ను కంకర ధర రూ. 900 పలుకుతున్నది. ప్రభుత్వం మైనింగ్‌ చార్జీలు పెంచడమే ఇందుకు కారణం. గతంలో టన్నుకు రూ.55 చొప్పున సీనరేజీ వసూలు చేసేవారు. ప్రస్తుతం టన్నుకు రూ.67గా నిర్ణయించారు. దీనికి తోడు కొత్తగా పర్మిట్‌-సి పేరిట టన్నుకు రూ.50వరకు అమలు చేస్తున్నారు. ఇవికాకుండా రకరకాల ట్యాక్సుల వసూళ్లకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కంకర, గ్రానైట్‌ ధరలు భారీగా పెరిగాయి. టన్ను కంకరపై చార్జీలు రూ. 100 పెరిగితే దళారీలు మాత్రం రూ. 1,000 వరకు వసూలు చేస్తున్నారు. 


సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ ధరల మంట

ఐదు నెలల క్రితంతో పోల్చితే ఇంటి నిర్మాణం భారంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు పెంచడంతో మార్కెట్‌లో సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ ధరలు పెరిగాయి. ఐదు నెలల కిందట 12ఎం.ఎం, 16ఎం.ఎం స్టీల్‌ టన్నుకు రూ.58,500 ఉండగా.. ప్రస్తుతం రూ.79వేలు పలుకుతున్నది. 10 ఎం.ఎం, 8 ఎం.ఎం స్టీల్‌ ధర టన్ను రూ.59,300 ఉండగా.. ప్రస్తుతం రూ.80,300కు పెరిగింది. ఐదు నెలల వ్యవధిలోనే టన్ను స్టీల్‌ ధర రూ.20వేలు పెరగడం గమనార్హం. సిమెంటు బస్తా ఐదు నెలల క్రితం రూ.330 ఉండగా ప్రస్తుతం రూ.405కు పెరిగింది. మూడు నెలల క్రితం ట్రాక్టర్‌ ఇసుక రూ. 2,500 వరకు ఉండగా ప్రస్తుతం రూ. 3,500 నుంచి రూ. 5,000 వరకు ఇస్తున్నారు.


భారీగా పెరిగిన కూలీ రేట్లు

ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల ధరలు పెరగడంతోపాటు కూలీ రేట్లు కూడా చుక్కలనంటుతున్నాయి. సిద్దిపేటలో అడ్డా కూలీలు రోజుకు రూ.700 నుంచి రూ.వెయ్యి అడుగుతున్నారు. తక్కువలో తక్కువ రూ.500 ఇవ్వకపోతే కూలీ దొరకడం లేదు. ఎలక్ర్టికల్‌, ప్లంబర్‌, భవన నిర్మాణ నిపుణులు, పేయింటర్‌లు సైతం తమ చార్జీలను పెంచేశారు. సంఘాలుగా ఏర్పడి కట్టడిగా నిలుస్తున్నారు. ఇతర ప్రాంతాలవారు జోక్యం చేసుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో ఈ విధానం అమలువుతున్నది. తమకు చెల్లిస్తున్న చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల పేయింటర్లు సమ్మె చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది.


అన్ని ధరలు పెరిగాయి : పరస యాదమ్మ, దుబ్బాక

ఇల్లు కట్టాలంటే ఇబ్బందిగా మారింది. అనుమతి ఉంటేనే  ఇసుక వస్తున్నది. స్టీల్‌, సిమెంటు, కంకర ధరలు పెరిగిపోయాయి. డీజిల్‌ ధర పెరిగిందని, క్రషర్ల చార్జీలు పెరిగాయని ధరలు పెంచేస్తున్నారు. మా ఇల్లు నిర్మాణం మొదలుపెట్టినప్పటితో పోల్చితే ఇసుక, కంకర ట్రిప్పునకు రూ. వెయ్యి ఎక్కువ తీసుకుంటున్నారు.

Read more