ఇషా సింగ్‌ బృందానికి స్వర్ణం

ABN , First Publish Date - 2022-05-14T09:56:51+05:30 IST

ఐఎస్ఎస్ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌కప్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలుగు షూటర్లు ఇషా సింగ్‌, మద్దినేని ఉమా మహేష్‌ స్వర్ణ పతకాలతో మెరిశారు.

ఇషా సింగ్‌ బృందానికి స్వర్ణం

ఉమా మహేష్‌కూ పసిడి 

షూటింగ్‌ జూనియర్‌ వరల్డ్‌కప్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐఎస్ఎస్ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌కప్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలుగు షూటర్లు ఇషా సింగ్‌, మద్దినేని ఉమా మహేష్‌ స్వర్ణ పతకాలతో మెరిశారు. ఇషాకు ఈ వరల్డ్‌క్‌పలో ఇది రెండో మెడల్‌ కావడం విశేషం. శుక్రవారం వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో భారత్‌ నాలుగు పసిడి పతకాలు సాధించడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లో హైదరాబాదీ ఇషా సింగ్‌, మనుభాకర్‌, పాలక్‌ త్రయం 16 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాలతో మెరిశారు.


జార్జియా షూటర్లు సలోమి, అబ్రామిష్విలి, మరియామి బృందం 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలతో సరిపెట్టుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్‌లో విజయవాడ షూటర్‌, ఉమామహేష్‌, రుద్రాంక్ష్‌, పారత్‌ మఖిజా త్రయం 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలను కొల్లగొట్టారు. స్పెయిన్‌ షూటర్లు జీసస్‌ ఒవిడో, అడ్రియన్‌, జార్జ్‌ బృందం 8 పాయింట్లతో రజత పతకం అందుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్‌లో ఆర్య బోర్సి, జీనా ఖిట్టా, రమిత బృందం 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణంతో మెరిసింది. అలానే పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లో సౌరభ్‌ చౌధురి, శివ నర్వాల్‌, సరబ్‌జ్యోత్‌ సింగ్‌ బృందం 17 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణ పతకాలను నెగ్గింది. ప్రస్తుతం భారత్‌ 8 స్వర్ణాలతో సహా మొత్తం 14 మెడల్స్‌ను ఖాతాలో వేసుకొని పతకాల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, పోలెండ్‌, బల్గేరియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈనెల 20తో వరల్డ్‌కప్‌ ముగియనుంది. 

Read more