గంజాయి గబ్బు!

ABN , First Publish Date - 2022-05-07T05:18:46+05:30 IST

గంజాయి స్మగ్లింగ్‌ ముఠా కందుకూరు ప్రాంతంలో వేళ్లూనుకుంది. ఇక్కడ రిటైల్‌ విక్రయాలతోపాటు అనేక ప్రాంతాలకు గంజాయిని పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు.

గంజాయి గబ్బు!
గంజాయ్‌

ఏజెన్సీ నుంచి పట్టణం మీదుగా ఇతర ప్రాంతాలకు

తీగలాగితే స్మగ్లర్ల డొంక కదులుతోంది!

ఇప్పటికే ఇద్దరు అరెస్ట్‌

ఇంకా పది మందికిపైగా గుర్తించిన పోలీసులు

పోకూరు కేంద్రంగానూ నిర్వహణ

విచ్చలవిడిగా అక్రమ రవాణా, రిటైల్‌ వ్యాపారం


కందుకూరు, మే 6 : గంజాయి స్మగ్లింగ్‌ ముఠా కందుకూరు ప్రాంతంలో వేళ్లూనుకుంది. ఇక్కడ రిటైల్‌ విక్రయాలతోపాటు అనేక ప్రాంతాలకు గంజాయిని పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతుండగా ఇందులో కందుకూరే కేంద్రంగా మారుతోంది. స్థానికంగా కొంతమంది గంజాయిని నిల్వ, విక్రయం, రవాణాను ఉపాధిగా ఎంచుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పది మందికిపైగా స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వీరిద్వారా నెలకు పది నుంచి పదిహేను క్వింటాళ్ల వరకు గంజాయి రవాణా, విక్రయాలు సాగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. 


తనిఖీలో వెల్లడైన నిజాలు


గత నెల 26న గంజాయిని రవాణా చేస్తున్న స్మగ్లర్లు పలుకూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులను చూసి కారును వదిలి పరారయ్యారు. ఆ కారుని స్వాధీనం చేసుకుని తనిఖీ చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. కారులో వెనుక సీటు కింద ఎవరికీ అనుమానం రాకుండా, తనిఖీ చేసినా అర్థం కాకుండా ఉండేలా రహస్య సీటు మాలిగ (సీటు కింద ఇనుప పెట్టె) ఏర్పాటు చేసుకున్నారు. ఆ మాలిగలో 85 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. అలాగే కారులో మూడు నెంబరు ప్లేట్లు కూడా ఉన్నాయి. గంజాయిని గుర్తించాక స్మగ్లర్లను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించిన పోలీసులు ఎట్టకేలకు పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ఇక్కుర్తికి చెందిన పాములపాటి శ్రీనివాస్‌, కృష్ణా జిల్లా ఉంగుటూరు సమీపంలోని ఆతుకూరుకి చెందిన పాల రవితేజలను అరెస్టు చేశారు.  వారి నుంచి మరో 20 కిలోల గంజాయిని, కొన్ని మద్యం  సీసాలను, మరో రెండు కార్లను స్వాధీనం  చేసుకున్నారు. 


రిటైల్‌ వ్యాపారులూ ఇక్కడే..


కందుకూరులోని శివారు కాలనీలు,  మురికివాడలలో  స్మగ్లర్లు వేళ్లూనుకుని ఉండగా, వీరిని ఆధారం చేసుకుని రిటైల్‌గా విక్రయించేవారు మరో పదిమందికిపైగా ఉన్నట్లు సమాచారం. కందుకూరు నుంచి పామూరు, బద్వేలు, పోరుమామిళ్ల, సీఎ్‌సపురం ప్రాంతాలతోపాటు కడప, రాయచోటి జిల్లాలకు అడపాదడపా బెంగళూరుకు కూడా గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక శ్రీనగర్‌ కాలనీ, శ్రీరామ్‌నగర్‌, ఉప్పు చెరువు కాలనీ, జనార్దన్‌కాలనీలతోపాటు పట్టణంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ గంజాయి స్మగ్లర్లు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. స్మగ్లింగ్‌లో యువకులేగాక పలువురు యువతులు, మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. కందుకూరుతోపాటు వలేటివారిపాలెం మండలం పోకూరు, జనాభా అధికంగా ఉన్న మరికొన్ని గ్రామాలలో కూడా గంజాయి స్మగ్లర్ల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. పోకూరులో ఇటీవల రెండుసార్లు గంజాయి పట్టుబడటంతో అక్కడి నుంచి పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా, నిల్వ జరుగుతున్నట్లు పోలీసులు అంచనా వేశారు.  ఇప్పటికే  స్థానిక స్మగ్లర్ల వివరాలు వారికి లభ్యం కాగా, వారి ద్వారా మరికొందరి సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వీరందరినీ అరెస్టు చేయగలిగితే పెద్దమొత్తంలోనే గంజాయి పట్టుబడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 


స్మగ్లర్లపై కఠినచర్యలు


గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా,  నిల్వలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇటీవల గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడిన వెంటనే స్మగ్లర్ల మూలాలపై దృష్టి పెట్టి విచారణ ప్రారంభించాం. ఈ విచారణలో ఆశ్చర్యం కలిగించే అంశాలను గుర్తించాం. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలతో సంబంధం ఉన్న స్థానికుల ఆటకట్టిస్తాం. గంజాయి అక్రమ రవాణా లేదా మీ ప్రాంతంలో విక్రయాలకు సంబంధించి ఎవరికైనా ఎలాంటి సమాచారం తెలిసినా 91211 01101 నెంబరుకి ఫోన్‌ చేసి తెలపండి.

- కండే శ్రీనివాసరావు, డీఎస్పీ, కందుకూరు



 కావలిలోనూ గుప్పు.. గుప్పు


కావలి, మే 5 : సులభంగా డబ్బు సంపాదలనకు అలవాటు పడిన కొంతమంది విద్యార్థులను, యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యాపారులు గంజాయి వ్యాపారం సాగిస్తున్నారు. గతంలో పట్టుబడిన కొంతమంది పోలీసుల విచారణలో ఈ  విషయాలను వెల్లడించారు.  గంజాయి వ్యాపారం చేసే వారు ఇటీవల పెద్దగా పట్టుబడక పోయినా, ఆ వ్యాపారం కావలిలో జోరుగా సాగుతందనే ప్రచారం ఉంది.  పట్టణంలో ఎక్కువగా టూటౌన్‌ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతుండగా, వన్‌టౌన్‌ పరిధిలో కూడా వడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. ఉదయగిరి రోడ్డు ప్రాంతంలోని అనేక బంకులలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, వారు పోలీ్‌సలను మేనేజ్‌ చేసుకుని ఎక్కువగా విద్యార్థులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోనూ, వడ్డిపాలెం, వెంగళరావునగర్‌ తదితర ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు  సాగుతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.   అధికారులు స్పందించి కావలిలో గంజాయి విక్రయదారుల మూలాలను పట్టుకుని,  అదుపు చేయకపోతే విద్యార్థుల, యువత భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంది.


Read more