భార్యతో బలవంతపు శృంగారం.. అత్యాచారమా? కాదా?

ABN , First Publish Date - 2022-05-12T09:08:39+05:30 IST

భార్యతో భర్త బలవంతపు శృంగారాన్ని రేప్‌గా పరిగణించాలా లేదా అనే విషయంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నిట్టనిలువునా చీలిపోయింది.

భార్యతో బలవంతపు శృంగారం.. అత్యాచారమా? కాదా?

ఇద్దరు ఢిల్లీ హైకోర్టు జడ్జిల భిన్న తీర్పులు

తేల్చాల్సింది ఇక సుప్రీంకోర్టే!


న్యూఢిల్లీ, మే 11: భార్యతో భర్త బలవంతపు శృంగారాన్ని రేప్‌గా పరిగణించాలా లేదా అనే విషయంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నిట్టనిలువునా చీలిపోయింది. ఈ అంశంపై ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ పరస్పరం భిన్నమైన తీర్పులు ఇచ్చారు. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్‌ 375 ప్రకారం మహిళలపై బలవంతపు శృంగారం అత్యాచారం (రేప్‌) కిందికి వస్తుంది. అయితే భార్యల విషయంలో భర్తలకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. 18 ఏళ్లు నిండిన భార్యతో భర్త బలవంతపు సెక్స్‌ రేప్‌ కిందికి రాదని చట్టం పేర్కొంది. దీన్ని సవాలు చేస్తూ 2015లో ఢిల్లీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ధర్మాసనంలోని జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌ తీర్పు చెబుతూ... ‘‘బలవంతపు సెక్స్‌ను రేప్‌గా పరిగణించే విషయంలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు రాజ్యాంగంలోని 14, 19, 21 ఆర్టికల్స్‌కు వ్యతిరేకం. మహిళల సమానత్వ హక్కు, భావ ప్రకటన, వ్యక్తిగత స్వేచ్ఛలకు విరుద్ధం’’ అని పేర్కొన్నారు.

ఈ మినహాయింపుల కారణంగా... భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతంగా సెక్స్‌ చేసిన సందర్భాల్లో, భర్తకు వ్యతిరేంగా దర్యాప్తును కోరే హక్కును భార్య కోల్పోతుందన్నారు. ఈ సెక్షన్‌ను ఐపీసీలో కొనసాగించడం తీవ్రమైన తప్పిదమని జస్టిస్‌ షక్డర్‌ వ్యాఖ్యానించారు. సెక్స్‌ విషయంలో మహిళల ఇష్టాయిష్టాలను, స్వయంప్రతిపత్తిని హరిస్తుందన్నారు. ‘‘భార్య ఏయే సందర్భాల్లో భర్తతో సెక్స్‌కు నిరాకరించే అవకా శం ఉందో ఈ చట్టం పరిగణనలోకి తీసుకోలేదు. ఉదాహరణ కు తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు లేదా రుతుస్రావం సమయంలో సెక్స్‌కు ఒప్పుకోకపోవచ్చు.

లేదా పిల్లలు అనారోగ్యం పాలైన సందర్భాల్లో అంగీకరించకపోవచ్చు. భర్తకు హెచ్‌ఐవీ, ఇతర లైంగిక వ్యాధులున్నా భార్య సెక్స్‌కు నో చెప్పొచ్చు. రేప్‌కు పాల్పడిన వ్యక్తి భర్త అయినంత మాత్రాన అది మానవీయ చర్య అయిపోదు. బలవంతపు సెక్స్‌ మహిళకు శారీరక గాయాన్నే కాదు.. తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తుంది’’ అని జస్టిస్‌ షక్దర్‌ అన్నారు. ఈ నేపథ్యంలో భార్యపై భర్త లైంగిక దాడిని రేప్‌గానే భావించాలని స్పష్టం చేశారు. ‘‘ఇష్టాయిష్టాలను పరస్పరం గౌరవించుకోవడమే ఆధునిక కాలంలో వివాహాలకు ఆధారం. భార్యకు సెక్స్‌ ఇష్టం లేకపోయినా భర్త బలవంతం చేయడం నేటి వివాహ బంధానికి వ్యతిరేకం’’ అని జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌ స్పష్టం చేశారు.

నేను అంగీకరించలేను: జస్టిస్‌ హరిశంకర్‌

ఇదే ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ హరిశంకర్‌ తీర్పు చెబుతూ.. ‘‘ఈ విషయంలో తోటి న్యాయమూర్తితో అంగీకరించలేను. ప్రజాస్వామ్య పద్ధతిలో చేసిన చట్టాలను వ్యక్తిగత అభిప్రాయాలతో కూడిన తీర్పులు మార్చలేవు. బలవంతపు సెక్స్‌ విషయంలో భర్తలకు ఇచ్చిన మినహాయింపుల ను వివాహ వ్యవస్థ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి’’ అన్నారు.

‘‘ఎవరితో, ఎప్పుడు సెక్స్‌లో పాల్గొనాలనే(సెక్సువల్‌ చాయిస్‌) విషయంలో పురుషులతో సమానంగా మహిళలకు హక్కు లుంటాయి. అలాగే మహిళల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిన సందర్భాల్లో రాజీపడాల్సిన అవసరం లేదు. తనపై నేరానికి పాల్పడినవారిపై దర్యాప్తును కోరే హక్కు మహిళలకు ఉంది. కానీ.. ఐపీసీ సెక్షన్‌ 375లో భర్తలకు ఇచ్చిన మినహాయింపులేవీ మహిళల హక్కులకు వ్యతిరేకంగా లేవు’’ అని జస్టిస్‌ హరిశంకర్‌ అన్నారు. అయితే పిటిషనర్లు కావాలనుకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని బెంచ్‌ పేర్కొంది. 


మహిళా సంఘాల అసంతృప్తి

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై మహిళా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రస్తుత చట్టాలు పెళ్లయిన స్త్రీల విషయంలో వివక్ష చూపిస్తున్నాయని, సుప్రీం మెరుగైన తీర్పు ఇస్తుందని భావిస్తున్నామని ఆలిండియా ప్రోగ్రెసివ్‌ విమెన్స్‌ అసోసియేషన్‌ సభ్యురాలు కవితాకృష్ణన్‌ అన్నారు. గృహహింస నేరం అయినప్పుడు, భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతపు శృంగా రం నేరం ఎందుకు కాదని వాణీ సుబ్రమణియన్‌ ప్రశ్నించారు. 

Read more