కచ్చితమైన దిశగా సాగేదే వికాసం.. TET ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-05-12T20:32:25+05:30 IST

మనిషి జీవితం ఒక సూక్ష్మ ఏకకణంగా ప్రారంభమై దినదిన మార్పులతో అభివృద్ధి చెంది శిశువుగా జన్మించి తన ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది..

కచ్చితమైన దిశగా సాగేదే వికాసం.. TET ప్రత్యేకం!

మనిషి జీవితం ఒక సూక్ష్మ ఏకకణంగా ప్రారంభమై దినదిన మార్పులతో అభివృద్ధి చెంది శిశువుగా జన్మించి తన ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది


వికాస నియమాలు

వికాసం విస్తృతమెంది, జీవితాంత ప్రక్రియ. వికాసం కొన్ని నియమాలు లేదా సూత్రాలను అనుసరించి జరుగుతుంది. ఇవి మానవులందరికీ వర్తించే సాధారణ సూత్రాలు. ఈ సూత్రాలు వ్యక్తి వికాస స్వభావాన్ని వివరిస్తాయి. 


 1. వికాసం క్రమానుగమైనది

  • మానవ వికాసం ఒక క్రమపద్ధతిలో అనేక దశల గుండా సాగుతుంది.
  • వికాసం ఒక కచ్చితమైన వరుసక్రమాన్ని అనుసరిస్తుంది.
  • ప్రకృతిలో ప్రతి జీవి కూడా ఒక వికాస నమూనాను అనుసరిస్తుంది.
  • వికాస వేగంలో వైయుక్తిక భేదాలు ఉన్నప్పటికీ కొంచెం ముందు వెనుక అందరిలోనూ ఒకే క్రమపద్ధతిలో జరుగుతుంది. 

ఉదాహరణ: పిల్లలు నిలబడే ముందు ఏ ఆధారం లేకుండా కూర్చోవడం నేర్చుకుంటారు. (చలన వికాసాల క్రమం).

శిశువులో ముందు పాల దంతాలు ఏర్పడి అవి ఊడిన తరవాత శాశ్వత దంతాలు ఏర్పడతాయి.


విద్య ప్రాముఖ్యత

  • భాషా బోధనలో ఎల్‌ఎస్‌ఆర్‌(శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం)
  • వాక్యాలను పలికించడానికి ముందు అక్షరాలను నేర్పుట.
  • విద్యార్థులు చతురస్రం గీయబోయే ముందు వర్తులము(సర్కిల్‌) గీయడం నేర్చుకుంటారు.
  • చతుర్విద ప్రక్రియను నేర్చుకోవడానికంటే ముందుగానే అంకెలు, సంఖ్యలు నేర్చుకొనుట.


 2. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ

  • శారీరక, మానసిక మార్పులు ఒక్కసారిగా జరగవు. గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు, చేర్పులతో వికాసం జరుగుతుంది.       
  • మనలో జరిగే ప్రతి మార్పు పెరుగుదల, అనుభవాల ఫలితమే.
  • మనిషి జీవితం ఒక సూక్ష్మ ఏకకణంగా ప్రారంభమై దినదిన మార్పులతో అభివృద్ధి చెంది శిశువుగా జన్మించి తన ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది.

ఉదాహరణ: దంతాలు రావడం, అలాగే యవ్వనారంభ దశకు చేరుకోవడం అనే మార్పులు ఒక్కసారిగా జరిగేవి కావు. ఇవన్నీ పుట్టుకతో వచ్చిన సామర్థ్యాల ఆధారంగా క్రమేణ కలిగే మార్పులు.

ఉదాహరణ: అంకెలు, సంఖ్యలు నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా చతుర్విద ప్రక్రియలు నేర్చుకోవడం.

వర్ణమాల నేర్చుకొన్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, పదాలు, వాక్యాలు రాయగలగడం. 

సైకిల్‌ నేర్చుకొన్న విద్యార్థి దాని సహాయంతో సులభంగా బైక్‌ను నడపగలగడం.


 3. వికాసం సర్వశక్తుల సమ్మేళనం/ వికాసం ఏకీకృతంగా జరుగుతుంది

  • వికాసానికి సంబంధించిన వివిధ అంశాలు పరస్పర సన్నిహితాలు/ పరస్పర ఆధారాలు.
  • వ్యక్తిలో ప్రతి మార్పు అనేక అంశాలతో కూడి ఉంటుంది.

ఉదాహరణ: శిశువు శారీరక వికాసంపై చలన వికాసం, అలాగే చలన వికాసంపై వాగ్వి(భాష) వికాసం ఆధారపడి ఉంటుంది.

మానసిక లోపంతో బాధపడే విద్యార్థి మానసిక సామర్థ్యాల్లోనే కాక శారీరక, సామాజిక, ఉద్వేగాత్మక వికాసంలో కూడా వెనుకబడే ఉంటాడు.

ఒక పిల్లవాని మానసిక వికాసం నెమ్మదిగా ఉండటం వలన అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుట.


విద్య ప్రాముఖ్యత

  • ఒక విద్యార్థి మూర్తిమత్వం అంచనా వేసేటప్పుడు విద్యతోపాటు కళలు, సంగీతం, చిత్రలేఖనం, వ్యాయామం అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
  • ఇది గెస్టాల్ట్‌ వాదాన్ని సమర్థిస్తుంది.


 4. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి

వికాసం క్రమపద్ధతిలో జరిగినప్పటికీ అనువంశికత, పరిసరాల వలన వ్యక్తిగత భేదాలు ఉంటాయి.

ఉదాహరణ: పిల్లల రంగు, ఆకారం, ఎత్తు మొదలైన అంశాల్లో ఏ ఇద్దరు ఒకేరకంగా ఉండరు.

  • చలన కౌశలాలలో, గ్రహణశక్తిలోనూ, విద్యాసాధనలో ఉండే తేడాలు.
  • ప్రతి శిశువు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు.


విద్య ప్రాముఖ్యత

  • గ్రేడెడ్‌ అసైన్‌మెంట్స్‌ ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించాలి.
  • ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులందరికీ ఒకేరకంగా బోధన చేసినప్పటికీ వారిలో అభ్యసనం ఒకేరకంగా జరగదు.


 5. వికాస దిశా సూత్రము

వికాసం ఒక కచ్చితమైన దిశగా కొనసాగుతుంది.

వికాసం రెండు దిశల్లో జరుగుతుంది. 

1) శిరఃపాదాభిముఖ వికాసం 

2) సమీప దూరస్థ వికాసం.

వికాసం తలలో ప్రారంభమై మిగిలిన కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. 

దీనినే శిరఃపాదాభిముఖ వికాసం (ననన) అంటారు.

ఉదాహరణ: గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తరవాతే మిగతా భాగాలు ఏర్పడతాయి.

- తల్లి గర్భాశయం నుంచి బయటకు రావడం తలతో ప్రారంభమవుతుంది.

వికాసము దేహ మధ్యస్థ(వెన్నెముక) భాగాన ప్రారంభమై, వెలుపల వైపునకు దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడం. దీనినే సమీప దూరస్థ వికాసం అంటారు.

ఉదాహరణ: శైశవ దశలో శిశువు ఒక వస్తువును అందుకొనేందుకు మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తరవాత మణికట్టును, చేతివేళ్లను ఉపయోగించడం.


 6. సామాన్య అంశాల నుంచి నిర్దిష్ఠ అంశాలకు కొనసాగటం

  • నిలబడటం, నడవడం లాంటి తేలిక పనుల నుంచి మెట్లు ఎక్కడం, సైకిల్‌ తొక్కడం వంటి కఠిన పనులు చేయడం.
  • శిశువు భాష నేర్చుకొనే క్రమంలో అత్త, తాత అని గాని పలికితే అది అందరికి వర్తిస్తుంది. కాలక్రమేణా దానిని తనకు సంబంధించిన వారికి మాత్రమే పరిమితం చేసుకొంటాడు.
  • శిశువును పిన్నుతో గుచ్చినప్పుడు మొదట శరీరమంతా కదిలిస్తుంది. కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలిస్తుంది.
  • శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన పిదప చేతివేళ్లతో వస్తువులను పట్టుకోగలుగుతుంది.
  • శిశువు మొదట మగవాళ్లందరిని ‘నాన్న’ అని సంబోధించిన పిదప ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగిస్తాడు
  • వికాసం అనేది ప్రారంభంలో(చిన్నతనంలో) మొత్తంగా ఉండి తరవాత(పెద్దవారిలో) భాగాల వైపు కొనసాగుతుంది.


విద్య ప్రాముఖ్యత - బోధన నియమాలు/ బోధన సూత్రాలు

బోధన అంశాలను సామాన్యం నుంచి సంక్లిష్టత, తెలిసిన దాని నుంచి తెలియని దానికి, మూర్తం అమూర్త అంశాలకు అనే సూత్రాల ఆధారంగా ప్రవేశపెట్టాలి.


 7. వికాసం ఒక పరస్పర చర్య

వికాసం అనేది అనువంశికత, పరిసరాల పరస్పర చర్యా ఫలితం.

ఉదాహరణ: శిశువుకు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు.


 8. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు

  • ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే దశలోని వికాస లక్షణాలను ముందుగానే ఊహించడం.
  • శిశువు ప్రస్తుత స్థితి ఆధారంగా భవిష్యత్తులో ఎంత అభివృద్ధి చెందుతాడో ముందుగానే చెప్పగలగడం.

ఉదాహరణ: శిశువు మణికట్టు ఎక్స్‌రే ద్వారా అతని శారీరక పరిమాణం ఎంత వరకు పెరుగుతుందో చెప్పవచ్చు.

విద్యార్థుల సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్తు వృత్తులను ఎంపిక చేయడం.

ప్రజ్ఞాలబ్ది ద్వారా వ్యక్తి ప్రతిభను ఊహించడం.

లాంగ్‌జంప్‌, హైజం్‌పలపై ఆసక్తి చూపుతున్న విద్యార్థికి తగిన శిక్షణ ఇస్తే అథ్లెటిక్స్‌లో రాణించగలడు అని చెప్పడం.


 9. వికాసం అన్ని దశల్లో ఒకేవిధంగా ఉండదు

  • శారీరక వికాసం శైశవదశలో ఎక్కువగాను, బాల్యదశలో తక్కువగాను ఉంటుంది.
  • సాంఘిక వికాసం శైశవ దశలో తక్కువగాను, బాల్యదశలో ఎక్కువగాను ఉంటుంది.
  • ఒక్కొక్క వికాసం ఒక్కొక్క దశలో ఒక్కోరకంగా జరుగును.


10. వికాసం జీవితాంత ప్రక్రియ

  • వికాసం అనేది నిరంతర ప్రక్రియ
  • పుట్టినప్పటి నుంచి ప్రారంభమైన వికాసం మరణం వరకు నిరంతరం కొనసాగుతుంది.
  • వ్యక్తి మూర్తిమత్వ వికాసం నిరంతరం కొనసాగుతుంది.
  • వికాసంలో పురుగోమనమే కానీ తిరోగమనం ఉండదు. అంటే వికాసం అనేది విపర్యయ ప్రక్రియ కాదు.

-పి. మల్యాద్రిరెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ



Read more