రైతు సంఘర్షణ సభ నేడే

ABN , First Publish Date - 2022-05-06T07:57:26+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’కు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా

రైతు సంఘర్షణ సభ నేడే

హాజరవనున్న రాహుల్‌ గాంధీ.. భారీ ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్‌ నాయకత్వం

హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాలలో సభ..

5 లక్షల మందిని సమీకరించే ఏర్పాట్లు

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రాహుల్‌ పరామర్శ

సభలోనే ప్రత్యేక వేదిక.. రైతులు, యువత కేంద్రంగా ‘వరంగల్‌ డిక్లరేషన్‌’


ఓరుగల్లు/హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’కు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ జరగనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన తర్వాత రాహుల్‌ గాంధీ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన రాక నేపథ్యంలో రేవంత్‌ సహా పార్టీ అగ్రనేతలంతా హనుమకొండకు చేరుకొని సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతుండగా.. ఇటీవలి కాలంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ-టీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కై వరి రైతులను అరిగోస పెట్టాయని ధ్వజమెత్తుతున్నారు. అకాల వర్షాలు, అంతుచిక్కని తెగుళ్లతో నష్టపోయిన మిర్చి రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని చెబుతున్నారు.


ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులతో రాహుల్‌ మాట్లాడేందుకు సభా వేదికను ఆనుకుని ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా నుంచి కూడా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఎంపిక చేశారు. రైతు కుటుంబాలు రాకుండా టీఆర్‌ఎస్‌ అడ్డుకునే అవకాశం ఉందన్న ఆలోచనతో వారి జాబితాను విడుదల చే యడం లేదు. ఇప్పటికే రైతు కుటుంబాలను తరలించి ప్రత్యేక ప్రాంతంలో ఉంచినట్లు సమాచారం. రాహుల్‌గాంధీ ఢిల్లీ నుంచి శుక్రవారం సాయంత్రం 4.50 గంటల కు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్క డి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి వరంగల్‌లోని గాబ్రియేల్‌ స్కూల్‌లో దిగుతారు. అక్కడి నుంచి ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలోని సభాస్థలికి చేరుకుంటారు. తొలుత ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కనీసం 5లక్షల మందితో ఈ సభను నిర్వహించాలని  టీపీసీసీ అందుకు తగిన జనసమీకరణ ఏర్పాట్లు చేసింది.


వాహనాలన్నీ వరంగల్‌ బాటలోనే..

రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని తరలించేందుకు కాంగ్రెస్‌ నేతలు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను ముందస్తుగా బుక్‌ చేశారు. లారీలు, ట్రాలీ ఆటోలు, కార్లు సైతం పెద్దఎత్తున బుక్‌ చేసుకున్నారు. సభాస్థలికి చేరువగా డ్రాపింగ్‌ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలను దింపివేసి తిరి గి దూరంగా నిర్దేశించిన పార్కింగ్‌ స్థలానికి వాహనాలు చేరుకునే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రాహుల్‌ పర్యటనకు ప్రత్యేక రక్షణ వలయం ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతున్న సెయింట్‌ గాబ్రియేల్‌ గ్రౌండ్‌ చుట్టూ సాయుధ పోలీసుల పహారా పెంచారు. వేదికపై రాహుల్‌ కోసం బుల్లెట్‌ప్రూఫ్‌ పోడియం సిద్ధం చే శారు. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. 


రైతు, యువత కేంద్రంగా..

రైతు సంఘర్షణ సభ ద్వారా తెలంగాణకేగాక దేశానికే కాంగ్రెస్‌ పార్టీ దిక్సూచిగా మారేలా ‘వరంగల్‌ డిక్లరేషన్‌’ను రూపొందించినట్లు నేతలు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ ప్రత్యేక రోడ్‌ మ్యాప్‌లాగా ఈ డిక్లరేషన్‌ ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వరంగ సంస్థలకు పునరుజ్జీవం కలిగించేలా విధానాలు రూపొందిస్తామని డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానించే అంశాన్నీ రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని సమాచారం. రైతులు, యువత కేంద్రంగా డిక్లరేషన్‌ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.


7న సంజీవయ్యకు నివాళి

వరంగల్‌ సభ అనంతరం శుక్రవారం రాత్రి 8 గంటలకు రాహుల్‌ గాంధీ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరతారు. ఓ స్టార్‌ హోటల్‌లో బస చేస్తారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. అక్కడ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య సమాధికి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా గాంధీభవన్‌కు చేరుకుని టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశంలో పాల్గొంటారు. సుమారు 300 మంది పార్టీ నేతలు, సీనియర్‌ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం గంట పాటు కొనసాగుతుంది. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి సంబంధించి వారికి రాహుల్‌ దిశానిర్దేశం చేస్తారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అసెంబ్లీ, పార్లమెంటు కో ఆర్డినేటర్లతో ఫొటోలు దిగనున్నారు. ఫొటో సెషన్‌ ముగిసిన తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని, సాయంత్రం 5.45 గంటలకు ఢిల్లీ విమానం ఎక్కుతారు. అయితే తొలుత ఉస్మానియా వర్సిటీ పర్యటన పెట్టుకున్నప్పటికీ అనుమతి లభించకపోవడంతో ఆ ప్రతిపాదన విరమించుకోవాల్సి వచ్చింది.


రాహుల్‌ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న 18 మంది విద్యార్థులను పరామర్శించే కార్యక్రమం ఉంది. జైళ్ల శాఖ డీజీ అనుమతిస్తే రాహుల్‌ చంచల్‌గూడలో విద్యార్థులను పరామర్శించనున్నారు. ఇక్కడి ఓ ఫంక్షన్‌ హాల్లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను రాహుల్‌ పరామర్శించే కార్యక్రమాన్నీ ప్లాన్‌ చేసినా సమయాభావం వల్ల దాన్ని రద్దు చేశారు. అయితే  గాంధీభవన్‌లో ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని నేతలు అంటున్నారు. 


సభకు రాజగోపాల్‌ దూరం!

రాహుల్‌ సభకు దూరంగా ఉండాలని నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2018 ఎన్నికల అనంతరం తనకు సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి అధిష్ఠానాన్ని కోరారు. కానీ, భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతను చేశారు. అనంతరం అధికార టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌లో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. తాను సీఎల్పీ నేతగా ఉంటే వారిని కాపాడుకుని ఉండేవాడినని రాజగోపాల్‌ ప్రకటించారు. 2019 జనవరిలో ‘కాంగ్రెస్‌ పని అయిపోయిందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది’ అని రాజగోపాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి పీసీసీ కార్యాలయానికి, కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేగా మునుగోడులో అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. తాజాగా వరంగల్‌ సభకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తన సోదరుడు, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాహుల్‌ సభకు జన సమీకరణలో బిజీగా ఉండగా.. రాజగోపాల్‌ ఇంటికే పరిమితమయ్యారు.

Read more