ఎన్నాళ్ళీ.. నిరీక్షణ..!

ABN , First Publish Date - 2022-05-11T05:29:10+05:30 IST

రైతులందరూ మూకుమ్మడిగా ఏకతాటిపైకి వచ్చి సోలార్‌కు భూములు అప్పగించారు. అయితే భూములు తీసుకున్నారే కానీ.. ఆ రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు.

ఎన్నాళ్ళీ.. నిరీక్షణ..!
తూముకుంట వద్ద ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంటు

భూమి.. పంటలు పాయే.. డబ్బు రాకపోయే..

తూముకుంట సోలార్‌ భూనిర్వాసితుల ఆక్రందన


వాళ్లంతా భూమి తల్లిని నమ్ముకుని బతికేటోళ్లు.. సేద్యం తప్ప మరెలా బతకాలో తెలియదు.. కండలు కరిగించి.. చెమట చిందించి..భూములు సాగు చేసి.. పురుగుపుట్ర కు ప్రాణాలు ఎదురొడ్డి.. పంటలు కాపాడుకునే వాళ్లు.. ఏటా రెండు కారులు పండే భూములను సైతం.. ప్రభుత్వం మాటను గౌరవించి.. తమ భూములను వదులుకున్న త్యాగమూర్తులు.. అయితే ప్రభుత్వాలు వాళ్ల త్యాగాన్ని అపహాస్యం చేశాయి.. ఆ త్యాగమూర్తులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఏడేళ్లుగా ఇవ్వకుండా.. అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీంతో బాగా సాగుకు అనువైన భూములను కోల్పోయి.. పైసా ఆదాయం లేక.. కుటుంబ పోషణ బరువై.. పిల్లలను కూడా చదివించుకోలోని స్థితిలో ఉన్న ఆ రైతు కుటుంబాలు.. నష్టపరిహారం కోసం.. ఇంకా ఎన్నేళ్లు ఇలా నిరీక్షించాలని ప్రభుత్నాన్ని ప్రశ్నిస్తున్నాయి. 


రాయచోటి/ గాలివీడు, మే 10 (ఆంధ్రజ్యోతి) : గాలివీడు మండలం తూముకుంట పంచాయతీకి చెందిన రైతులు ఎటువంటి చీకూచింత లేకుండా.. ఏటా రెండు పంటలు పండించుకునే వాళ్లు. అయితే 2015లో తూముకుంట పంచాయతీలో సోలార్‌ప్లాంటును ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో.. ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిర్ణయం ఇక్కడి రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. భూములు లేకపోతే ఎలా బతకాలని ఆవేదన చెందారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. తాము భూములు కోల్పోయి నష్టపోయినా.. ప్రజలకు మేలు కలుగుతుందని తమ భూములను త్యాగం చేశారు. రైతులందరూ మూకుమ్మడిగా ఏకతాటిపైకి వచ్చి సోలార్‌కు భూములు అప్పగించారు. అయితే భూములు తీసుకున్నారే కానీ.. ఆ రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. అదిగో..ఇదిగో అంటూ.. ఏడు సంవత్సరాలుగా ఆ రైతులను కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారు. నష్టపరిహారం చెల్లించకపోయినా.. భూసేకరణ పూర్తి చేసేశారు. 


ఎకరాకు రూ.3 లక్షలు నష్టపరిహారం

2016లో నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఒక అవగాహన కుదిరింది. దీని ప్రకారం ఆర్‌ఎ్‌సఆర్‌ పట్టా భూమికి ఎకరాకు రూ.3 లక్షలు, డీకెటీ భూమికి ఎకరాకు రూ.2.65 లక్షలు, ఎటువంటి రికార్డులు లేకుండా.. అనుభవంలో ఉన్న భూమి ఎకరాకు రూ.లక్ష రైతులకు చెల్లించేటట్లుగా ధర ఖరారైంది. 2015, 2016 సంవత్సరాలో భూసేకరణ చేశారు. ఇందులో 350 ఎకరాలు పాత పట్టా, 970 ఎకరాలు డీకేటీ, 1734 ఎకరాలు ప్రభుత్వ భూమిగా సేకరించి సోలార్‌ ప్లాంట్‌ నిర్వాహకులకు అప్పగించారు. ఇందులో డీకేటీ భూములు కలిగిన 970 ఎకరాల వారికి 2.65 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు. అయితే ఆర్‌ఎ్‌సఆర్‌ పాత పట్టా ఉన్న 350 ఎకరాలలో 150 ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి.. ఇందులో 40 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన 110 ఎకరాలకు ఇంతవరకు నష్టపరిహారం రాలేదు. చుక్కల పట్టాల భూముల సమస్యలను పరిష్కరించాలని, నిర్వాసితులు ఇప్పటికే పలుమార్లు కలెక్టర్‌కు వినతిపత్రం పెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్లు మారుతున్నారే.. కానీ రైతులకు నష్టపరిహారం మాత్రం అందలేదు. 


ఎకరాకు రూ.50 వేలు ఆదాయం

సోలార్‌ ప్లాంటు ఏర్పడక ముందు.. ఈ భూముల్లో వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఇతర కూరగాయలను రైతులు పండించే వాళ్లు.  ఎంత తక్కువ అనుకున్నా.. ఎకరాకు రూ.50 వేల వరకు ఆదాయం తీసేవాళ్లు. అయితే ఏడేళ్లుగా.. అటు నష్టపరిహారం అందకపోవడంతో..ఇటు పంటలు పండించుకోలేక.. వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్కువ ధరకు భూములు సోలార్‌కు ఇచ్చాము.. ఇప్పటికి ఎకరాకు రూ.లక్ష మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు.. మిగిలిన రెండు లక్షలు ఇవ్వలేదని వాపోతున్నారు. భూములు లేకపోయే.. డబ్బులు రాకపోయే.. ఎట్లా బతకాలని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎకరం రూ.10 లక్షల వరకు ధర పలుకుతోందని రైతులు వాపోయారు. గత 5 సంవత్సరాలుగా తాము లక్షలు నష్టపోయామని, ఈ నష్టపరిహారం ఎవరు కట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పైసా నష్టపరిహారం అందలేదు

- భవానీ ప్రసాద్‌, వరికుంటపల్లె

తమ కుటుంబ సభ్యులకు చెందిన సర్వే నెంబరు 672లో 13 ఎకరాలు, సర్వే నెంబరు 673లో 6 ఎకరాలు కలిపి 19 ఎకరాలు సోలార్‌ ప్రాజెక్టు కోసం తీసుకున్నారు. ఇప్పటికీ పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అప్పటి వరకు పాతపట్టాగా ఉన్న మా భూమి.  భూసేకరణ చేసిన తరువాత చుక్కల పట్టాగా మారిపోయింది. మొదట చుక్కల పట్టాభూమి అయినా, పాత పట్టా భూమి అయినా ఒకే ధరను నిర్ణయించారు. మాకు నష్టపరిహారం ఇవ్వకుండా.. మా భూములను స్వాధీనం చేసుకుని సోలార్‌కు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొంటున్నారు. మాకు నష్టపరిహారాన్ని అందజేయాలని కడప కలెక్టరేట్‌కు ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. ఈ 19 ఎకరాల్లో రెండు బోర్లు వేసుకుని సంవత్సరానికి రెండు పంటలను సాగు చేస్తే 10 లక్షలు ఆదాయం పొందేవాడిని. ప్రస్తుతం భూమి పోయింది. జీవనాధారం పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలి.


తక్కువ డబ్బుకే భూములు అప్పగించాం

- కె.వెంకట్రామిరెడ్డి, వరికుంటపల్లె, తూముకుంట

నాకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. అందులో సర్వే నెంబరు 675లో 2 ఎకరాల 12 సెంట్లు భూమిని సోలార్‌కు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపరిహారం అందివ్వాలి. 


మా బతుకులు బజారున పడ్డాయి 

- రామక్రిష్ణారెడ్డి, తూముకుంట

సర్వే నెంబరు 711లో 3 ఎకరాల మాగాణి భూమిని రెవెన్యూ అధికారులు భూసేకరణలో భాగంగా స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో సంవత్సరానికి రెండుసార్లు వరిని సాగు చేసేవాడిని. కేవలం ఈ భూమిపైన ఆధారపడి నేను నా కుటుంబాన్ని పోషించేవాడిని. కానీ భూములను స్వాధీనం చేసుకొన్నారు. నష్టపరిహారం మాత్రం ఇవ్వలేదు. దీనిలో ఆదాయం లేకపోవడంతో మా బతుకులు బజారున  పడ్డాయి. 


ఫైళ్లు కడప కలెక్టరేట్‌లో ఉన్నాయి

- శ్రావణి, తాహసీల్దార్‌, గాలివీడు

తూముకుంటలో చుక్కల పట్టా భూములకు సంబంధించి 110 ఎకరాలకు నష్టపరిహారం అందించాల్సి ఉంది. కానీ ఆ భూములకు సంబంధించిన ఫైళ్లు కడప కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని త్వరలోనే అన్నమయ్య జిల్లాకు వచ్చేటట్లు చేసి ఆ భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌  కూడా చొరవ చూపుతున్నారు. ఈ విషయంపై నేను కలెక్టర్‌, సోలార్‌ అధికారులతో చర్చించాను. త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందించడానికి కృషి చేస్తాము.

Read more