గజ..గజ...

ABN , First Publish Date - 2022-05-09T05:20:16+05:30 IST

పండ్ల తోటలపై గజరాజులు ప్రతి ఏటా దాడులు చేస్తున్నాయి. మామిడి, అరటి, బొప్పాయి తదితర తోటలు ఏనుగుల దాడులతో ధ్వంసం అవుతున్నాయి.

గజ..గజ...
ఏనుగుల దాడికి విరిగిన మామిడి చెట్టు

పండ్ల తోటలపై గజరాజుల దాడి

ప్రతి ఏటా దాడులు

ధ్వంసమవుతున్న పండ్ల తోటలు

భయాందోళనలో రైతులు


రైల్వేకోడూరు, మే 8: పండ్ల తోటలపై గజరాజులు ప్రతి ఏటా దాడులు చేస్తున్నాయి. మామిడి, అరటి, బొప్పాయి తదితర తోటలు ఏనుగుల దాడులతో ధ్వంసం అవుతున్నాయి. దీంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట ప్రాంతంలో రాత్రి వేళల్లోనే ఎక్కువగా ఏనుగులు పండ్ల తోటలపై దాడులు చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటల్లోకి రాత్రి వేళల్లో వెళ్లి నీరు పారగట్టాలంటే ఏనుగులు ఎక్కడ వచ్చి మీద పడతాయని వెళ్లడం లేదని రైతులు అంటున్నారు. మండలంలోని శెట్టిగుంట, ఎస్‌.కొత్తపల్లె, శ్రీనివాసపురం, వాగేటికోన తదితర ప్రాంతాల్లో సాగవుతున్న పండ్ల తోటలపై ఏనుగులు పడి ధ్వంసం చేస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శెట్టిగుంటకు చెందిన రైతులు నాగినేని వెంకటరమణ తదితర రైతులకు చెందిన మామిడి తోటలపై పడి నాశనం చేశాయి. ఒక్కసారి ఏనుగులు దాడి చేస్తే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నష్టం చేస్తున్నాయి. రైతులు పలు రకాల చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ఇదే కాకుండా గతంలో అటవీశాఖాధికారులు ట్రెంచ్‌లు తీశారు. భారీ వర్షాలకు అవి పూడిపోయాయి. వేసవిలో అడవిలో ఆహారం దొరక్కనే ఏనుగులు పండ్ల తోటల వైపు వస్తున్నాయి. ఏనుగుల దాడిలో గతంలో ఒక రైతు గాయపడ్డాడు. మామిడి కాయల వాసన చూస్తే ఏనుగులు చెట్టు మొత్తాన్ని నాశనం చేసి కాయలు తినేస్తాయి. ఒకటి, రెండు ఏనుగులు రావు. మొత్తంగా 10 నుంచి 15 ఏనుగుల మంద వస్తుంది. దీంతో రైతులు తోటల వైపు రాత్రివేళల్లో వెళ్లరు. పగలు మాత్రమే వెళుతున్నారు. ఏనుగుల మంద తోటల్లో ఉన్న కొబ్బరి, సపోటా తదితర చెట్లను నాశనం చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరు, కంచెలు తదితర వాటిని ధ్వంసం చేస్తున్నాయి. గతంలో ఏనుగులు రాకుండా ఉండడానికి సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడానికి నివేదికలు తయారు చేశారు. అయితే కర్ణాటకలో సోలార్‌ ఫెన్సింగ్‌ ఎత్తిపోవడంతో ఇక్కడ ఆ ప్రతిపాదన పక్కన పెట్టేశారు. గతంలో రైతులు ఏనుగుల నుంచి పంటలను రక్షించాలని కోరుతూ రాస్తారోకోలు చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఏనుగులు రాకుండా చేయడానికి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు వెళ్లి డప్పులు వాయించడం, బాణాసంచా కాల్చడం వంటి చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖాధికారులు తెలిపారు. అదే కాకుండా ప్రతి ఏటా పరిహారం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు.


ప్రతి ఏటా పంటలను ధ్వంసం చేస్తున్నాయి

- నాగినేని వెంకటరమణ, శెట్టిగుంట, రైల్వేకోడూరు మండలం

ప్రతి ఏటా ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఏనుగులతో చాలా ఇబ్బందిగా ఉంది. నష్టం ఎక్కువగా జరిగినా పరిహారం తక్కువగా ఇస్తున్నారు. ఏనుగులు మామిడి పంటను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. దిగుబడులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఏనుగుల దాడులు చేస్తున్నాయి. దీంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు.


ఏనుగులు రాకుండా శాశ్వతమైన పరిష్కారం చేయాలి

- అంబటి వెంకటసుబ్రహ్మణ్యం, శెట్టిగుంట, రైల్వేకోడూరు మండలం

పండ్ల తోటల వైపు ఏనుగులు రాకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేయాలి. ప్రతి ఏటా మామిడి పంట సాగు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాము. ఏనుగుల దాడులతో చాలా ఇబ్బందిగా మారింది. రాత్రి వేళల్లో నీరు పారగట్టాలన్నా భయంగా ఉంది. ఎక్కడ ఏనుగులు దాడులు చేస్తాయని రైతులు అందరూ భయపడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.



Read more