దైవ సన్నిధిలో దొంగలెవరు?

ABN , First Publish Date - 2022-05-11T06:07:14+05:30 IST

దైవ సన్నిధిలో దొంగలెవరు?

దైవ సన్నిధిలో దొంగలెవరు?

దుర్గమ్మ కానుకల చోరీ యత్నంపై అనుమానాలెన్నో

పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయని అధికారులు

సీసీ ఫుటేజీ ఉన్నా నిందితుల గుర్తింపులో జాప్యం

ఈవో భ్రమరాంబ డొంకతిరుగుడు వివరణ

‘ఆంధ్రజ్యోతి’కి సమాచారం ఎలా వచ్చిందో చెప్పాలని అర్థంలేని వాదన

తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు


సీన్‌ 1 : దుర్గమ్మ ఆలయ మహామండపం ఆరో అంతస్థు.. కట్టుదిట్టమైన భద్రత నడుమ అమ్మవారి హుండీల లెక్కింపు.. చుట్టూ సీసీ కెమెరాలు.. 

సీన్‌ 2 : ఆలయ ఆవరణలో ఓ బాత్‌రూమ్‌.. అందులో దాచి ఉంచిన రెండు చిన్న ప్లాస్టిక్‌ కవర్లు.. వాటిలో దేవస్థానం అధికారులు చెబుతున్నట్టుగా 5.600 గ్రాముల బంగారం..

సీన్‌ 3 : చుట్టూ సీసీ కెమెరాలు.. భద్రతా సిబ్బంది.. దొంగను తేలిగ్గా పట్టుకునే సాంకేతిక పరిజ్ఞానం.. 

అయినా.. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సీసీ కెమెరాల్లో చూస్తే తెలిసిపోయే దొంగ విషయంలో ఎందుకు తర్జనభర్జనలు పడుతున్నారు? ఇంటిదొంగలకు దేవదాయ శాఖలో ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉన్నాయా..? అసలు బాత్‌రూమ్‌లో దొరికిన బంగారం 5.600 గ్రాములేనా.. ఇంకా ఎక్కువ ఉందా..? దొంగను పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయని ఆలయ అధికారులు ఆంధ్రజ్యోతిలో విషయం బయటకు రావడంతో మంగళవారం తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 


విజయవాడ, మే 10 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపు ప్రక్రియ సోమవారం జరిగింది. ఆ సమయంలో సమీపంలోని బాత్‌రూమ్‌లో అమ్మవారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించిన బంగారు వస్తువులను ఎస్‌పీఎఫ్‌ పోలీసులు గుర్తించారు. ఆ నగలను వారు ఈవోకు అప్పగించారు. ఈ ఘటనను ఆలయ అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటన అమ్మవారి భక్తుల్లో చర్చనీయాంశమైంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడం, రాష్ట్రవ్యాప్తంగా అమ్మవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఎట్టకేలకు ఆలయ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ యత్నంపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

దొరికింది 5.600 గ్రాములేనా..?

బాత్‌రూమ్‌లో దాచిన కవర్లలో ఒక సన్నని నల్లపూసల గొలుసు, దానికి బంగారంతో వేలాడదీసిన ముత్యం, మరొక బంగారు సూత్రం (లక్క వేసి ఉంది), మరొక ఇత్తడి లక్ష్మీదేవి ఉంగరం, బెన్‌టెక్స్‌ ఎరుపు రాయి చెవిదిద్దులు ఉన్నాయని, ఇందులో బంగారం బరువు మొత్తం 5.600 గ్రాములేనని ఈవో భ్రమరాంబ మంగళవారం వెల్లడించారు. ఆ బంగారు వస్తువుల విలువ రూ.20 వేల నుంచి 25 వేలే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బాత్‌రూమ్‌లో దొరికిన ఆ బంగారు వస్తువులను హుండీల్లో వచ్చిన బంగారంతో కలిపేసినట్లు స్పష్టం చేశారు. అయితే, దొరికిన బంగారం ఎంత అనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తి ఇత్తడి ఉంగరం, బెన్‌టెక్స్‌ చెవిదుద్దులు ఎందుకు చోరీ చేస్తాడన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. జరిగిన ఘటనపై అధికారులు వెంటనే స్పందించినా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్నది మరో ప్రశ్న. హుండీల లెక్కింపు సమయంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫుటేజీని పరిశీలిస్తే చోరీ చేసిన వ్యక్తులను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంలో గోప్యత పాటించడం.. నిందితులను గుర్తించకపోవడం అనుమా నాలకు తావిస్తోంది. ఇంటిదొంగలకు కొందరు ఉన్నతాధి కారుల ఆశీస్సులు ఉండటం వల్లే ఘటనను వెలుగులోకి రానివ్వలేదని తెలుస్తోంది. ఘటనపై దృష్టి సారించ కుండా ఈవో భ్రమరాంబ ‘ఆంధ్రజ్యోతి’కి సమాచారం ఎలా వచ్చిందో తెలపాలంటూ లేఖ పంపడం విశేషం.

ఘటన విచారకరం.. మంత్రి కొట్టు సత్యనారాయణ

కనకదుర్గమ్మ సొమ్మునే కాజేయాలనుకోవడం విచారకరమని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హుండీల లెక్కింపు సందర్భంగా అమ్మవారి సొమ్మును కాజేయాలని ప్రయత్నించిన వారిని సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని దేవదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తానన్నారు. ఇటీవల సినీహీరో రామ్‌చరణ్‌ అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించ డమే కాకుండా, పవిత్రమైన అమ్మవారి హుండీలపైకి ఎక్కి దుర్గమ్మ మూలవిరాట్‌ ఫొటోలు, వీడియోలను చిత్రీకరించిన ఘటనపై కూడా చింతిస్తున్నానని మంత్రి చెప్పారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Read more