ఆరని కాష్ఠం!

ABN , First Publish Date - 2022-05-11T08:00:49+05:30 IST

శ్రీలంకలో రావణకాష్ఠం చల్లారలేదు సరికదా.. మంగళవారం మరింత ప్రజ్వరిల్లింది.

ఆరని కాష్ఠం!

నిరసనలతో శ్రీలంక భగభగ

మహీంద రాజపక్సపై జనాగ్రహం అధికార నివాసాన్ని చుట్టుముట్టి

పది పెట్రోలు బాంబుల ప్రయోగం నౌకాస్థావరంలో తలదాచుకున్న 

మాజీ ప్రధాని.. ముట్టడించిన  జనం 

అరెస్టుకు పట్టు.. ఆగని హింసాకాండ

మంత్రులు, ఎంపీల నివాసాల దహనం

కొలంబో ఎయిర్‌పోర్టుపై జనం నిఘా

మహీంద అనుయాయులు దేశం దాటకుండా చెక్‌పోస్టులు

ప్రపంచ దేశాల ఆందోళన


కొలంబో, మే 10: శ్రీలంకలో రావణకాష్ఠం చల్లారలేదు సరికదా.. మంగళవారం మరింత ప్రజ్వరిల్లింది. దేశం అసాధారణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబమే కారణమని ఆందోళనకారులు మండిపడుతున్నారు. మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసినా వారు శాంతించలేదు. మహీందను టార్గెట్‌ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై దాడులకు తన మద్దతుదారులను ఆయనే పురిగొల్పారని, హింసను ప్రేరేపించినందుకు తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికార నివాసం ‘టెంపుల్‌ ట్రీస్‌’ను చుట్టుముట్టారు. ప్రధాన గేటు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. అక్కడున్న ఓ వాహనాన్ని తగులబెట్టారు.

వారిని భద్రతాదళాలు అడ్డుకున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినా నిరసనకారులు 10 పెట్రోలు బాంబులు విసిరారు. సోమవారం రాత్రంతా వారు లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి నిలువరించారు. పరిస్థితి చేయిదాటడంతో వేకువఝామున మహీందను, భార్యాబిడ్డలను, ఇతర కుటుంబ సభ్యులను భద్రతాసిబ్బంది ట్రింకోమలీ నౌకాస్థావరానికి తరలించారు. ఇది తెలిసి ఆందోళనకారులు దాన్ని కూడా ముట్టడించారు. రాజపక్స కుటుంబానికి చెందిన పాత ఇంటిని ఇప్పటికే వారు తగులబెట్టారు. ఇంకోవైపు.. సోమవారం నాటి హింసాకాండలో మృతుల సంఖ్య మంగళవారానికి 8కి చేరింది. 250 మంది గాయపడ్డారు. వీరంతా కొలంబోలోని జాతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామంతో రాజపక్సకు మద్దతుదారులైన నేతలను, ఎంపీలను, మంత్రులను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. పలువురి ఇళ్లకు, కార్యాలయాలకు నిప్పుబెట్టారు. 14 మంది మాజీ మంత్రులు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ సహా 18 మంది ఎంపీలు వారి బారినపడ్డారు. రాజపక్స కుటుంబం, వారి మద్దతుదారులు దేశం విడిచి పారిపోకుండా కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రజలు నిఘా పెట్టారు.


ఎయిర్‌పోర్టుకు దారితీసే రోడ్డుపై చెక్‌పోస్టును ఏర్పా టు చేశారు. కార్మిక సంఘాలు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. హంబంటోటా నగరంలో రాజపక్సల నివా సం బుగ్గిపాలైంది. కురునెగలలో మహీంద ఇంటిని నిరసనకారులు తగులబెట్టారు. పుట్టాలం ఎంపీ శాంత నిషాంత ఇంటిని ధ్వంసం చేశారు. తాజా హింస నేపథ్యంలో వారంట్లు లేకుండానే అరెస్టు చేసే అధికారాన్ని ఆర్మీ, పోలీసులకు ప్రభుత్వం కల్పించింది. రాజధాని కొలంబో ప్రస్తుతం ఆర్మీ అధీనంలో ఉంది. హింసను వీడాలని.. శాంతియుతంగా ఉండాలని గొటబయ పిలుపిచ్చారు. శ్రీలంక పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి.


ప్రభుత్వ అణచివేతపై క్రికెటర్ల ఆగ్రహం

ఆందోళనకారులను అణచివేస్తున్న రాజపక్స ప్రభుత్వంపై శ్రీలంక మాజీ, ప్రస్తు త క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు అధికారుల ఎదుటే ఓ మహిళను తీవ్రంగా కొడుతున్న వీడియోను మహేల జయవర్ధనే ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది ప్రభుత్వ ప్రేరిత హింస.. ప్రణాళిక ప్రకారం చేసిందే’ అని కుమార సంగక్కర దుయ్యబట్టారు. ‘మా దేశంలో ఇలాంటి నాయకత్వం ఉండడం నిరాశకు గురిచేసింది. లంక సంక్షోభంపై ఐక్యపోరాటం సాగించేవారికి నా సంఘీభావం’ అని ఐపీఎల్‌ బెంగళూరు జట్టు లెగ్‌స్పిన్నర్‌ వనీందు హసరంగ ట్వీట్‌ చేశారు. మహీందను తక్షణం అరెస్టు చేయాలని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ నేత రంజిత్‌ మద్దుమ బండారా డిమాండ్‌ చేశారు. 


శ్రీలంక సుస్థిరతకు పూర్తి మద్దతు: భారత్‌ 

సంక్షుభిత శ్రీలంకలో ప్రజాస్వామ్యం, సుస్థిరతకు, ఆర్థిక పునరుజ్జీవానికి పూర్తి మద్దతిస్తామని భారత్‌ ప్రకటించింది. ఆ దేశ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తామని విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. పొరుగుదేశమైన లంకతో చారిత్రక సంబంధాలు ఉన్నాయని.. ఈ ఏడాది ఇప్పటికే 350 కోట్ల డాలర్ల సాయం చేశామని గుర్తుచేశారు. ఇవి కాకుండా ఆహారం, ఔషధాలను మానవతాదృక్పథంతో సరఫరా చేస్తున్నామన్నారు.

Read more