Abn logo
Feb 21 2021 @ 00:34AM

అంతరిక్షంలో స్వాతి కిరణం..

భారతీయ ప్రతిష్ఠను అంతరిక్షానికి ఎగిసేట్టు చేసిన  ఇండో-అమెరికన్‌ యువతేజం డాక్టర్‌ స్వాతీ మోహన్‌..! నాసా ‘పర్సీవరెన్స్‌ రోవర్‌’ అంగారక గ్రహం(మార్స్‌)పై విజయవంతంగా అడుగుపెట్టడంలో ఆమె కీలక పాత్రధారి.... సూత్రధారి! పిల్లల వైద్యురాలు అవుదామనుకున్న స్వాతిపై అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సిరీస్‌ ‘స్టార్‌ ట్రెక్‌’ ఎంతో ప్రభావం చూపింది. అది ఆమె కెరీర్‌ని అంతరిక్షం వైపు మళ్లేలా మలుపుతిప్పింది. ఆమె ‘నాసా’లో సైంటిస్టుగా ‘ల్యాండ్‌’ అయ్యారు! కీలకమైన ‘పర్సీవరెన్స్‌ రోవర్‌ మిషన్‌’ను విజయవంతంగా పూర్తిచేసి.... అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ‘స్వాతి’ కిరణమై మెరిశారు.


స్వాతికి ఏడాది వయసున్నప్పుడు ఆమె కుటుంబం భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఆమె బాల్యం అంతా వాషింగ్టన్‌ డీసీలోని ఉత్తర వర్జీనియాలో గడిచింది. నిజానికి స్వాతికి చిన్నతనంలో అంతరిక్షంపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే తొమ్మిదేళ్ళ ప్రాయంలో... టీవీలో చూసిన మొదటి అమెరికన్‌ ఫిక్షన్‌ సిరీస్‌ ‘స్టార్‌ ట్రెక్‌’ స్వాతిపై ఎంతో ప్రభావం చూపింది. అయినప్పటికీ దాన్ని కెరీర్‌గా తీసుకోవాలనే ఆలోచన ఆమెకు వెంటనే కలగలేదు. ‘‘అంతరిక్షం మీద ఆసక్తి ఉన్నా పదహారేళ్లు వచ్చేవరకూ పిల్లల వైద్యురాలు అవుదామనే అనుకున్నా. ఎందుకంటే అంతరిక్షం, ఖగోళశాస్త్ర రంగాలను  కెరీర్‌గా ఎంచుకుంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో నాకు తెలియకపోవడమే. ‘కానీ ‘‘స్టార్‌ ట్రెక్‌’  ప్రభావం నాలో పెరుగుతూ వచ్చింది. అంతరిక్షంలో వాళ్లు శోధిస్తున్న అందమైన ప్రదేశాలు నాకు అద్భుతంగా అనిపించాయి. అంతరిక్షంలో అలాంటి  అధ్యయనాలు చేయాలనిపించింది. విశ్వంలో దాగిన విజ్ఞానం అంతటినీ తెలుసుకోవాలన్న కోరిక నాలో బాగా నాటుకుపోయింది. ఆ ఇష్టమే నన్ను మెల్లగా ఇంజనీరింగ్‌ వైపు మళ్లేట్టు చేసింది. మా టీచర్‌ చెప్పే ఫిజిక్స్‌ క్లాసు కూడా నన్ను అంతరిక్షం వైపు ఆకర్షితురాలిని చేసిందని చెప్పాలి’’ అంటారు స్వాతి. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి మెకానికల్‌, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లలో బిఎస్‌ చదివాక, ఏరోనాటిక్స్‌లో ఎంఎస్‌, పిహెచ్‌డి చేసి ‘మిట్‌’ (మసాచూసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎంఐటి) నుంచి పట్టాలు తీసుకున్నారు. ఏరో స్పేస్‌ ఇంజనీర్‌ అయ్యారు. 


ఎక్కువ సమయం దీన్లోనే...

‘నాసా- పర్సీవరెన్స్‌ రోవర్‌’ ఎంట్రీ, డీసెంట్‌, ల్యాండింగ్‌ (ఇడిఎల్‌) అనే మూడు ముఖ్యమైన దశల్లో స్వాతీ మోహన్‌ ఎంతో కీలకంగా వ్యహరించారు. ఈ రోవర్‌ అంగారక గ్రహం ఉపరితలంపై ల్యాండ్‌ అయిన చరిత్రాత్మక దృశ్యాన్ని ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో తిలకించింది. మార్స్‌-2020 మిషన్‌ దిశా నిర్దేశం, నావిగేషన్‌, కంట్రోల్‌ ఆపరేషన్స్‌ అన్నీ స్వాతి నాయకత్వంలోనే సాగాయి. రోవర్‌ సరైన మార్గంలో వెళ్లడం నుంచి మార్స్‌ ఉపరితలంపై దిగడం దాకా రోవర్‌ ల్యాండింగ్‌ను విజయవంతం చేసిన ఘనత ఆమెదే! ఈ క్షణాలను కళ్లారా చూడాలని స్వాతి ఎంతగానో తపించారు. అందుకోసం ఎనిమిది సంవత్సరాల నుంచి అలుపెరగని కృషిచేస్తూ వచ్చారు. ‘‘ఏ స్కూలులోనూ గడపనంత కాలం ‘పర్సీవరెన్స్‌ రోవర్‌’ అధ్యయనాలు, పరిశోధనల్లో మునిగిపోయా. నా జీవితకాలంలో అత్యధిక సమయం ఈ మిషన్‌లోనే గడిచింది’’ అని చెబుతారామె. రానున్న కాలంలో అంగారక గ్రహం నుంచి నమూనాల సేకరణ, వాటిని భూమికి చేరవేయడం వంటి కీలక కార్యక్రమాలకు ఇది తొలి మెట్టు. అంతేకాదు, ఈ రోవర్‌ ల్యాండింగ్‌ అమెరికా అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయంగా కీలకమైన మలుపు కూడా. 


ఏడు నిమిషాల్లోనే...

 ‘నాసా’లో స్వాతిది ఉజ్వలమైన కెరీర్‌. ‘మిషన్‌ టు శాటన్‌’లో ఆమె పనిచేశారు. చంద్రుడిపైకి ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి కూడా సేవలు అందించారు. ఆ తర్వాత 2013 సంవత్సరం నుంచి ప్రారంభమైన ‘మార్స్‌ మిషన్‌’లో భాగస్వామి అయ్యారు. ‘‘గైడెన్స్‌, నావిగేషన్‌, కంట్రోల్స్‌ ఆపరేషన్‌  (జిఎన్‌ అండ్‌ సి)... ఇవి అంతరిక్ష నౌకకు కళ్లు, చెవుల లాంటివి’’ అంటారు స్వాతి. ‘‘ఏడు నిమిషాల్లో (సెవెన్‌ మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌) అంగారక గ్రహం మీదకు ప్రవేశం నుంచి దిగడం వరకూ జరిగిపోయాయి. ఆ సమయంలో అంతరిక్షనౌక దిశను నిర్దేశించాల్సి ఉంటుంది. అది సురక్షితంగా అంగారక గ్రహంపై ల్యాండ్‌ అయ్యేలా కచ్చితమైన సందేశాలు వెంట వెంటనే అందించాను. ఒకవైపు మా టీమ్‌ ఈ ఆపరేషన్స్‌ని కొనసాగిస్తుంటే మరోవైపు నేను జిఎన్‌ అండ్‌ సి సబ్‌సిస్టమ్‌కూ, మిగతా ప్రాజెక్టు మొత్తానికీ ప్రధానమైన సమాచారాన్ని అందించాను. జిఎన్‌ అండ్‌ సి కి సంబంధించిన శిక్షణ నేనే ఇచ్చాను. మిషన్‌ కంట్రోల్‌ సిబ్బందికి షెడ్యూల్‌ కేటాయింపులూ, మిషన్‌ కంట్రోల్‌ రూములో జిఎన్‌ అండ్‌ సి అనుసరించే విధానాల బాఽధ్యతలు కూడా నేనే నిర్వహించాను’’ అని వివరించారు స్వాతి.


విజయవంతంగా రోవర్‌ ల్యాండ్‌ అయ్యాక... నుదుట ఎర్రటి బొట్టుతో కంట్రోల్‌ రూమ్‌ నుంచి స్వాతి బయటకు వచ్చి, అంగారక గ్రహంపై రోవర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయిన వార్తను స్థిర చిత్తంతో ప్రకటించారు. ‘టచ్‌డౌన్‌ అయింది. అంగారక గ్రహం ఉపరితలంపై పర్సీవరెన్స్‌ రోవర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయింది’ అని  ప్రకటించిన గళం కూడా ఆమెదే. ప్రస్తుతం పసాడెనాలోని ‘నాసా’ జెట్‌ ప్రొపల్షన్‌ లేబరెటరీలో పనిచేస్తున్న స్వాతి అంతరిక్ష రంగంలో ఎందరో యువతులకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారన్నది నిస్సందేహం! ఫ  1. ఫిబ్రవరి 19వ తేదీన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.25 గంటలకు ‘నాసా’ పర్సీవరెన్స్‌ రోవర్‌ మార్స్‌ జెజెరో క్రేటర్‌ మీద విజయవంతంగా దిగింది. 
  2. అంగారక గ్రహంపై పర్సీవరెన్స్‌ రోవర్‌ సురక్షితంగా దిగడంలో స్వాతి ముఖ్య పాత్ర పోషించారు. ఈ ఎంట్రీ డీసెంట్‌ ల్యాండింగ్‌ టీమ్‌కు అలెన్‌ చెన్‌ సారథ్యం వహించారు.

ప్రత్యేకం మరిన్ని...