చేపా.. చేపా.. ఎవరికి చిక్కుతావ్‌?

ABN , First Publish Date - 2022-05-13T05:51:14+05:30 IST

జిల్లాలు వేరు.. రెవెన్యూ డివిజన్లు వేరు.. మండలాలు కూడా వేరు.. ఆ రెండు గ్రామాల మధ్య విస్తరించి ఉన్నది ఓ చెరువు.. చేపలు పట్టే హక్కు మాత్రం ఒకే ఊరి మత్స్యకారులకు సొంతం! కళ్ల ఎదుట కళకళలాడుతున్న చెరువు.. చెంగున దుంకుతున్న చేపలు కనిపిస్తున్నా ఆదాయం దక్కకపోవడంతో ఒక ఊరి బెస్తలు ఉసూరు మంటున్నారు. చెరువు రెండు పంచాయతీల పరిధిలో విస్తరించినా చేపలు పట్టే హక్కు ఒకే గ్రామం వారికి ఉండడం వివాదానికి దారితీస్తున్నది. మత్సశాఖ నిర్లక్ష్యంతో ముప్పయ్యేళ్లుగా పంచాయితీ తెగడం లేదు.

చేపా.. చేపా.. ఎవరికి చిక్కుతావ్‌?
కన్‌సాన్‌పల్లి, గడిపెద్దాపూర్‌ గ్రామాల మధ్య వివాదానికి కారణమైన పెద్ద చెరువు

చెరువులో చేపలపై హక్కు కోసం ముప్పయ్యేళ్లుగా రెండు ఊళ్ల నడుమ వివాదం

రెండు పంచాయతీల పరిధిలో చెరువు

ఒకే ఊరిలో మత్స్య సహకార సంఘం

మరో ఊరి మత్స్యకారులకు మొండిచేయి

వాటా కోసం కన్‌సాన్‌పల్లి బెస్తల పోరాటం


జోగిపేట, మే 12: జిల్లాలు వేరు.. రెవెన్యూ డివిజన్లు వేరు.. మండలాలు కూడా వేరు.. ఆ రెండు గ్రామాల మధ్య విస్తరించి ఉన్నది ఓ చెరువు.. చేపలు పట్టే హక్కు మాత్రం ఒకే ఊరి మత్స్యకారులకు సొంతం!  కళ్ల ఎదుట కళకళలాడుతున్న చెరువు.. చెంగున దుంకుతున్న చేపలు కనిపిస్తున్నా ఆదాయం దక్కకపోవడంతో ఒక ఊరి బెస్తలు ఉసూరు మంటున్నారు. చెరువు రెండు పంచాయతీల పరిధిలో విస్తరించినా చేపలు పట్టే హక్కు ఒకే  గ్రామం వారికి ఉండడం వివాదానికి దారితీస్తున్నది. మత్సశాఖ నిర్లక్ష్యంతో ముప్పయ్యేళ్లుగా పంచాయితీ తెగడం లేదు. 


రెండు పంచాయతీలు.. ఒకే సొసైటీ

సంగారెడ్డి జిల్లా పరిధిలోని అందోలు మండలం కన్‌సాన్‌పల్లి పంచాయతీలో ఆ ఊరితో పాటు శేరి మల్లారెడిపల్లి మధిర గ్రామం ఉన్నాయి. పక్కనే మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామం ఉన్నది. రెండు గ్రామాల శివారులో ఓ చెరువు ఉన్నది. చెరువు శిఖంలో 147.19 ఎకరాలు కన్‌సాన్‌పల్లికి, 49.11 ఎకరాలు గడిపెద్దాపూర్‌ పరిధిలో ఉన్నది. సంగారెడ్డి జిల్ల్లా రికార్డుల్లో కన్‌సాన్‌పల్లి పెద్ద చెరువుగా, మెదక్‌ జిల్లా రికార్డుల్లో గడిపెద్దాపూర్‌ పెద్ద చెరువుగా నమోదు చేయబడింది. ఉన్నది ఒకే చెరువు అయినా రికార్డుల్లో రెండు వేర్వేరు పేర్లతో కొనసాగుతున్నది. కానీ నీటి వినియోగదారుల సంఘం ఒక్కటే ఉన్నది. శిఖం భూమి ఎక్కువగా ఉండటంతో ఆయకట్టు సంఘంలో కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన సభ్యులదే మెజార్టీ. రెండున్నర దశాబ్దాల క్రితం ఈ చెరువులో చేపలు పెంచేందుకు మత్స్యసహకార సంఘం ఏర్పాటైంది. అప్పట్లో కన్‌సాన్‌పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి గ్రామాల మత్స్యకారులు సభ్యత్వ రుసుము చెల్లించలేక సభ్యత్వం తీసుకోలేదు. సంఘంలో కేవలం గడిపెద్దాపూర్‌ మత్స్యకారులే సభ్యులుగా చేరారు. దీంతో గడిపెద్దాపూర్‌ మత్స్యసహకార సంఘంగా నమోదైంది. 


చేపల కోసం సమరం

చెరువులో ప్రతీ సంవత్సరం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుస్తున్నారు. కానీ చేపలు పట్టుకునే సమయంలో గొడవులు జరుగుతున్నాయి. చెరువు శిఖంలో మూడొంతులు మా గ్రామానికే చెందడంతో తమకూ వాటా ఉంటుందని కన్‌సాన్‌పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి గ్రామాల మత్స్యకారులు విధించడం వివాదాలకు దారితీస్తున్నది. మత్స్యకారుల సొసైటీలో సభ్యత్వం లేకపోవడంతో ఆ గ్రామాలవారికి చేపలు పట్టే అధికారం ఉండదని గడిపెద్దాపూర్‌ మత్స్యకారుల వాదన. ఇరవయ్యేళ్లుగా ప్రతీయేటా చేపల పంచాయితీ జరుగుతున్నది. కన్‌సాన్‌పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి మత్స్యకారులు చేపలు పట్టడం కోసం వేళ్తే వారిని గడిపెద్దాపూర్‌ వాసులు చితకబాదడం.. గడిపెద్దాపూర్‌ మత్స్యకారులు ఇటువైపు వచ్చి చేపలు పడుతుంటే కన్‌సాన్‌పల్లి వాసులు దాడులు చేయడం తరచుగా జరుగుతున్నది. కన్‌సాన్‌పల్లి గ్రామ మత్స్యకారులు చెరువులో తమ గ్రామ పరిధి వరకు స్తంభాలు పాతి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయగా గడిపెద్దాపూర్‌ మత్స్యకారులు విరగకొట్టారు. ఇలా దీంతో రెండు గ్రామాల మధ్య కక్ష్యలు పెరుగుతున్నాయి. ఓసారి చెరువులో టన్నుల కొద్దీ చేపలు చచ్చి పైకి తేలాయి. దీనిపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.


అధికారుల తాత్సారం

చేపల్లో వాటా కోసం కన్‌సాన్‌పల్లి మత్స్యకారులు పలుమార్లు గ్రామ పెద్దలతో కలిసి ఎమ్మెల్యేలు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. 1990 నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న దామోదర్‌ రాజనర్సింహ, మల్యాల రాజయ్య, బాబూమోహన్‌, క్రాంతికిరణ్‌కు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాగా ఉండడంతో వారు కలెక్టర్‌కు, మత్స్యశాఖ అధికారులకు సమస్య పరిష్కరించమని ఎన్నోసార్లు ఆదేశాలు జారీ చేశారు. అయినా మూడు దశాబ్దాలుగా మత్స్యశాఖ అధికారులు మాత్రం ఛోద్యం చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలు వేరు కావడంతో పీఠముడి పడింది. ఇటీవల ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ద్వారా సమస్యను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన రెండు జిల్లాల మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించమని ఆదేశించారు. అయినా తమ పరిధి కాదని రెండు జిల్లాల అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ చెరువులోకి త్వరలో సింగూరు జలాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో గొడవలు పెరిగే అవకాశం ఉన్నది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకముందే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.


ముప్పయ్యేళ్లుగా ఎదురుచూపులు : రామన్నగారి అంతయ్య, కన్‌సాన్‌పల్లి

నాకు ప్రస్తుతం 60 సంవత్సరాలు. నేను యువకుడిగా ఉన్నప్పటి నుంచీ చెరువులో చేపలు పట్టుకోవడంపై పంచాయితీ జరుగుతున్నది. ముప్పయ్యేళ్లుగా అధికారులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. ఎప్పటికైనా చెరువు చేపల్లో వాటా చూస్తానో లేదో? మా గ్రామ శిఖం ఎక్కువగా ఉన్నప్పటికీ మాకు చేపలు పట్టే అధికారం ఇవ్వకపోవడం విడ్డూరం.


వాటా కల్పించాల్సిందే : తెనుగు ఈశ్వర్‌, కన్‌సాన్‌పల్లి

రెండు గ్రామాల మధ్య చెరువు ఉండటంతో రెండూళ్లకు చేపలు పట్టుకునే హక్కు ఉండాలి. కానీ మత్స్యశాఖ అధికారుల వైఖరితో మాకు హక్కు లేకుండా పోయింది. లంచాలకు ఆశపడి అధికారులు సమస్యను నానుస్తూనే ఉన్నారు. న్యాయంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వకపోతే ఆందోళనలు చేయడానికి సిద్ధం.

Read more