మృత్యు దారులు

ABN , First Publish Date - 2022-05-06T06:22:44+05:30 IST

మృత్యు దారులు

మృత్యు దారులు
కొడాలి-పామర్రు రహదారి ఇలా..

రహదారుణాలు-1


రెండు జిల్లాల్లో అధ్వానంగా రోడ్లు

మూడేళ్లుగా మరమ్మతులు శూన్యం

ప్రమాదకరంగా మారిన ప్రయాణాలు

60 శాతం రోడ్లది ఇదే పరిస్థితి

ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారెందరో..

తీవ్ర గాయాలతో మంచాన పడుతున్న మరికొందరు బాధితులు

రూ.లక్షల్లో ఆసుపత్రి ఫీజుల చెల్లింపు

రోడ్డున పడుతున్న కుటుంబాలు


రోడ్డు.. రోడ్డు.. నువ్వేం చేశావంటే.. భారీ గోతులతో జనాల్ని మింగేశాను.  కంకర పైకి లేపి భారీ ప్రమాదాలకు కారణమయ్యాను. చేతికందొచ్చిన ఓ కొడుకును కబళించి ఆ కుటుంబాన్ని రోడ్డుకీడ్చాను.  ఉంగుటూరు ఎంపీపీ ప్రాణాలు తీసేశాను. చాలామంది కాళ్లు, చేతులు విరగ్గొట్టాను. కొంతమందిని మంచం మీద పడేశాను. ఇంకొంతమందిని ఆసుపత్రిలో చేర్పించాను. రూ.లక్షల్లో బిల్లు కట్టించాను.. అని వికటాట్టహాసం చేసిందట. అవును.. ఇదంతా నిజమే. అభివృద్ధికి దగ్గరి దారి కావాల్సిన జిల్లాలోని రహదారులు ఇలాంటి దారుణాలను సృష్టిస్తున్నాయి. రెండు జిల్లాల్లోనూ కలిపి ప్రధానమైన సిమెంట్‌, తారురోడ్లు సుమారు ఎనిమిది వేల కిలోమీటర్ల పొడవు ఉండగా, వీటిలో 60 శాతం రోడ్లు దాదాపు మృత్యుదారులే. అభివృద్ధికి నోచక, అక్కరకు రాక ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జిల్లాల్లో అస్తవ్యస్త రహదారులను ‘ఆంధ్రజ్యోతి’ గురువారం పరిశీలించింది. - ఆంధ్రజ్యోతి-విజయవాడ/న్యూస్‌ నెట్‌వర్క్‌


- ఉయ్యూరు మండలం శాయిపురం రోడ్డు గోతులమయంగా తయారైంది. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి నుంచి మర్రివాడ మీదుగా శాయిపురం వెళ్లే ఈ ఆర్‌అండ్‌బీ రోడ్డుపైన అడుగుపెట్టాలంటే హడలే. రోడ్డు పొడవునా గోతులతో రాళ్లు లేచి కనీసం నడిచేందుకు కూడా అనువుగా లేదు. సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ధ్వంసమైంది. మూడేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్థులు మొరపెట్టుకున్నా ఫలితం లేదని శాయిపురం సర్పంచ్‌ షేక్‌ జాన్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. 

- బాపులపాడు మండలంలోని రంగన్నగూడెం, రేమల్లె గ్రామాల్లో పోలవరం వంతెనలపై పూత ఊడిపోయి శ్లాబుకు వేసిన ఐరన్‌ ఊచలు పైకి లేచి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఏమరపాటున వెళ్తే ఎలాంటి టైర్లయిన పేలిపోవాల్సిందే. ద్విచక్రవాహనదారులైతే జారిపడి గాయాలపాలవుతున్నారని రేమల్లెకు చెందిన రంగారావు, సూర్యనారాయణ తెలిపారు. వంతెనలకు వేసిన అప్రోచ్‌ రహదారుల కంకర తేలిపోయి భారీ గోతులతో ప్రమాదకర పరిస్థితుల్లో దర్శనమిచ్చాయి. రేమల్లె ప్రధాన రహదారి భారీ గోతులతో కనిపించింది. వేలేరు గ్రామం వద్ద రేమల్లె, జవహర్‌ నవోదయ వెళ్లే రహదారి కూడలిలోనే భారీ గోతులతో కంకర లేచి ప్రమాదకరంగా మారాయి. 

- ఉంగుటూరు మండలంలోని పొట్టిపాడు నుంచి ఆనందపురం వెళ్లే సుమారు ఐదు కిలోమీటర్ల పంచాయతీరాజ్‌శాఖ బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. కల్వర్టుల వద్ద రెండువైపులా కుంగిపోయి, కొట్టుకుపోయిన రోడ్డు వల్ల ద్విచక్రవాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు రోడ్డు మధ్యలో సుమారు నాలుగు అడుగుల మేర ఏర్పడిన పెద్దగొయ్యి ద్విచక్రవాహనదారులకు శాపంగా మారింది. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోగా, గోతిలో చెత్త వేశారు. దీంతో వేగంగా వచ్చే ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి.

- ఉంగుటూరు ప్రధాన కూడలి నుంచి వయా ఎలుకపాడు, నాగవరప్పాడు, వెన్నూతల, దావాజీగూడెం మీదుగా గన్నవరం వెళ్లే సుమారు 13 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు గుంతలమయంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే వంశీ చొరవతో ఈ రోడ్డు మార్జిన్‌ను రెండువైపులా విస్తరించారు. అనంతరం మరమ్మతులు చేపట్టక   పోవడంతో పలుచోట్ల రోడ్డు కుంగిపోయి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో  ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 

- ఉంగుటూరు మండలంలోని మానికొండ నుంచి వయా తరిగొప్పల బూతిమిల్లిపాడు, బుద్ధవరం, దాసుళ్లపాక వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు గోతులమయంగా మారటంతో నిత్యం ఇటుగా గన్నవరం, గుడివాడకు రాకపోకలు సాగించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రివేళల్లో ప్రయాణాలు సాగించే ద్విచక్ర           వాహనదారులు రోడ్డుపై ఏర్పడిన గోతుల్ని అంచనా వేయలేక అదుపు         తప్పి గాయాలపాలవుతున్నారు. నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.

రైతుల గగ్గోలు

బాపులపాడు మండలంలోని  పలు గ్రామాల ప్రధాన రహదారులు అధ్వానంగా మారి వాహనాలపై ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. మండల కేంద్రానికి, జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండే ప్రధాన రహదారులు గుంతలతో దారుణంగా మారటంతో వాహనదారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిళ్లనపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా గుంతలతో ద్విచక్రవాహనాలపై ప్రయాణించడమే కష్టంగా ఉందని, పామాయిల్‌, చెరుకు వంటి వ్యవసాయ ఉత్పత్తులను వీరవల్లి, అంపాపురం దగ్గర ఉన్న పరిశ్రమలకు తరలించే క్రమంలో ట్రాక్టర్లు, ఇతర వాహనాల మరమ్మతులకే ఖర్చు తడిసిమోపెడవుతోందని రైతులు బాబూరావు, గోపీ తెలిపారు.

కాంట్రాక్టర్లు పరార్‌

తోట్లవల్లూరు-ఉయ్యూరు వరకు ఉన్న ఎనిమిది కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారి పూర్తిగా పాడైపోయింది. ఈ రోడ్డును 2014లో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.15 కోట్లతో అభివృద్ధి చేశారు. మళ్లీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవటంతో భారీ ఇసుక లారీలతో రోడ్డంతా గోతులు ఏర్పడ్డాయి. తాజాగా రూ.8 కోట్లతో రోడ్డు అభివృద్ధి చేయనున్నామని, రహదారికి రెండువైపులా వందేళ్ల నాటి భారీ వృక్షాలను నరికించేశారు. కానీ, రెండేళ్ల నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ విషయంపై మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఏఈని ప్రజాప్రతినిధులు నిలదీయగా, తప్పకుండా రోడ్డును అభివృద్ధి చేస్తామని చెప్పినా ఫలితం లేదు. రోడ్డు అభివృద్ధి అటకెక్కినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. బిల్లులు రావన్న భయంతో కాంట్రాక్టర్‌ వెనకడుగు  వేసినట్టు తెలుస్తోంది.

- బాపులపాడు మండలంలోని బండారిగూడెం మీదుగా నూజివీడు, గన్నవరం మండలాల్లోని గ్రామాలకు వెళ్లే రహదారిపై ఏర్పడిన భారీ గోతులను తలచుకుంటేనే హడలెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామస్థుల ఆగ్రహం తట్టుకోలేక అధికారులు ఇటీవల ఎర్రమట్టి, రబ్బీసుతో గోతులను పూడ్చారు.








తోట్లవల్లూరుకు చెందిన 18 ఏళ్ల లింగాబత్తిన రాజ్‌కుమార్‌ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుతున్నాడు. 2019, డిసెంబరు 25వ తేదీ రాత్రి బైకుపై ఉయ్యూరు బయల్దేరాడు. బైక్‌ అదుపుతప్పి తోట్లవల్లూరు-ఉయ్యూరు రోడ్డుపై ఉన్న గోతిలో పడి ఎదురుగా వెళ్తున్న ఎడ్లబండిని ఢీకొంది. బైకుపై ఉన్న రాజ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మంచి చదువు చదివి తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకును రోడ్డు పొట్టన పెట్టుకుందని రాజ్‌కుమార్‌ తండ్రి నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వీరులపాడు మండలం పెద్దాపురానికి చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత నవంబరులో పొలం నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో పడ్డాడు. బైక్‌ అతనిపై పడగా, కుడి కాలు మూడుచోట్ల విరిగింది. వైద్యం కోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. అయినా పూర్తిగా కోలుకోలేదు. భార్య కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. 

Read more