సొంతిల్లు ‘కలే’!

ABN , First Publish Date - 2022-05-04T05:23:54+05:30 IST

సొంతింటి కల.. ఇక కలగానే మారే అవకాశం ఉంది.

సొంతిల్లు ‘కలే’!

  • నిర్మాణ సామగ్రి ధరలు పైపైకి...
  • చదరపు అడుగుకు రూ.600 పైగా అదనపు భారం
  • ఆకాశన్నంటుతున్న ఇనుము, ఇసుక, కంకర, సిమెంట్‌ ధరలు
  • కంకర టన్నుకు రూ.250 పెరుగుదల
  • చమురు ధరల పెంపుతో తడిసి మోపెడవుతున్న రవాణా చార్జీలు


సొంతింటి కల.. ఇక కలగానే మారే అవకాశం ఉంది.  నిర్మాణరంగ సామగ్రి సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుకల ధర అమాంతం పెరిగిపోతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరల కారణంగా నిర్మాణాల జోలికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ప్రధానంగా స్టీలు, సిమెంట్‌ ధర ఆకాశాన్నంటుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడంతో వీటి ప్రభావం నిర్మాణ సామగ్రిపై పడింది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : భవన నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్య, మఽధ్యతరగతి వర్గాల సొంతిల్లు నిర్మాణం ‘కలగానే’ మిగిలిపోతోంది. గడిచిన నాలుగైదు నెలలుగా ఆకాశమే హద్దుగా చమురు ధరలు పెరగడంతో వీటి ప్రభావం అన్నింటిపైనా పడింది. ఇనుము, సిమెంట్‌, ఇతర సామగ్రి ధరలు సామాన్యునికి అందనంతగా పెరిగిపోతున్నాయి.  దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మైనింగ్‌ విధానంతో ఇసుక, కంకర ధరలు కూడా భారీగా పెరిగాయి. అలాగే చమురు ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి.  రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు ధరలు మరింత పెరుగుతున్నాయి.  ఇప్పటికే పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.119.50, డీజిల్‌ లీటర్‌ ధర రూ.105.50 వరకు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సరుకు రవాణా చేసుకోవాలంటే సామాన్యులు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన మైనింగ్‌ విధానం కారణంగా కంకర క్వారీలపై 112శాతం ఫీజు పెరిగింది. దీంతో స్టోన్‌, క్రషర్స్‌ యజమానులు, లీజుదారులు ధరలు పెంచేశారు. అలాగే కూలీల ధరలు కూడా గతంలో కంటే పెరిగాయి. దీంతో భవన నిర్మాణాలకు సంబంధించి గత జనవరితో పోలిస్తే నిర్మాణ వ్యయం సుమారు రూ. 600 వరకు అదనంగా పెరిగింది. రోజురోజుకూ నిర్మాణపు సామగ్రి ధరలు పెరుగుతుండడంతో కొందరు గృహ నిర్మాణాలను అర్ధారంతరంగా నిలిపివేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో 100కిపైగా స్టోన్‌ క్రషర్స్‌ ఉన్నాయి. వీటిద్వారా నెలకు రూ. 35లక్షల టన్నులకుపైగా కంకర, స్టోన్‌శాండ్‌, స్టోన్‌ డస్ట్‌ విక్రయాలు జరుగుతుంటాయి. నగర, నగర శివారు ప్రాంతాలకు ఇక్కడ నుంచే కంకర సరఫరా అవుతోంది. అయితే నూతన మైనింగ్‌ పాలసీని నిరసిస్తూ స్టోన్‌ క్రషర్స్‌ యజమానులు ఇటీవల కొద్ది రోజులపాటు సమ్మె నిర్వహించారు. విద్యుత్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో తమను ట్యాక్స్‌ పరిధిలోని నుంచి తొలగించాలని, రాయల్టీ, రెన్యూవల్‌ ఫీజు తగ్గించాలని, జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే  ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో   మూడురోజుల కిందట సమ్మె విరమించి కంకర, శాండ్‌, డస్ట్‌ ధరలు పెంచి విక్రయిస్తున్నారు. గతంలో కంకరను యూనిట్ల కొలమానంలో లెక్కించి విక్రయించే వారు. ఒక యూనిట్‌ అంటే నాలుగు మెట్రిక్‌ టన్నులు ఉంటుంది. ఒక ట్రాక్టర్‌లో ఒక యూనిట్‌ సరుకు పడుతుంది. అయితే ఇటీవలకాలంలో టన్నుల లెక్కనే కంకర, స్టోన్‌శాండ్‌, స్టోన్‌ డస్ట్‌ విక్రయిస్తున్నారు. మూడు నెలల కిందట టన్ను కంకర నగర శివార్లలో రూ. 475 నుంచి రూ.500ల వరకు ధర ఉండేది. ఇపుడు ఇది కాస్తా రూ. 725కు పెరిగింది. దూరం పెరిగితే రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. అంటే టన్నుకు సుమారు రూ.250 వరకు కంకర, స్టోన్‌శాండ్‌, స్టోన్‌ డస్ట్‌ ధరలు పెరిగాయి.  ఇక ఇసుక గత జనవరిలో టన్ను ధర రూ.1100 నుంచి రూ.1200 ఉంటే.. ఇపుడు రూ. 1500కుపైగానే విక్రయిస్తున్నారు. షాద్‌నగర్‌లో అయితే కాళేశ్వరం ఇసుక పేరుతో టన్ను ధర రూ.1600 వరకు విక్రయిస్తున్నారు. అలాగే ఇటుక ధరలు కూడా దాదాపు రూపాయిన్నర వరకు పెరిగాయి. జనవరిలో ఇటుక రూ.6.50 ఉండగా ఇపుడు రూ.  8.00కు విక్రయిస్తున్నారు. అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే షాద్‌నగర్‌లో ఇటుక ధర ఒక రూపాయి తక్కువగా ఉంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో కూలీలు, మేస్త్రీ ధరలు కూడా భారీగా పెరిగాయి. 


స్టీల్‌, సిమెంట్‌ ధరలు పైపైకి..

నిర్మాణ రంగంలో కీలమైన స్టీల్‌, సిమెంట్‌ ధరలు ఇటీవల కాలంలో దాదాపు 25 నుంచి 30శాతం వరకు పెరిగాయి. సిమెంట్‌ ప్రీమియం బ్రాండ్లు ధరలు గత జనవరి మొదటి వారంలో బస్తా రూ. 300 నుంచి రూ.320 వరకు ఉండగా ఇపుడు రూ.360 వరకు పెరిగింది. వాస్తవానికి దేశంలో ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్‌ పెరగడంతో పాటు ప్రభుత్వాలు మౌలిక వసతులకు ప్రాధాన్యమివ్వడంతో సిమెంట్‌ వినియోగం పెరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సిమెంట్‌ తయారీలో కీలకమైన బొగ్గు, పెట్‌కోక్‌ ముడిపదార్ధాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 30 నుంచి 50శాతం పెరిగాయి. ఇండోనేషియాలో బొగ్గు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ఇక్కడ నుంచి బొగ్గు సరఫరా నిలిచిపోయింది. అలాగే ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇక్కడ నుంచి బొగ్గుసరఫరా ఆశించినస్థాయిలో జరగడం లేదు. దీంతో సిమెంట్‌ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణభారత దేశంలో సిమెంట్‌ ధరలు అధికంగా పెరగడం గమనార్హం. దేశీయ సిమెంట్‌ను 60శాతం ఇళ్ల నిర్మాణాలకు వినియోగిస్తారు. సిమెంట్‌ ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు శరాఘాతంగా మారింది. భవిష్యత్తులో సిమెంట్‌ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు స్టీల్‌ ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. గత జనవరి మొదటి వారంలో టన్ను రూ. 55వేలు ఉన్న ఇనుము ధర ఇపుడు రూ. 90వేలు దాటింది. 


నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుదల ఇలా..(రూ.లలో)

జనవరి     ప్రస్తుతం

ఇనుము (టన్ను) 55,000 90,000

ఇసుక (టన్ను) 1200 1500

కంకర (టన్ను) 550 800

సిమెంట్‌ (బస్తా) 320 360

ఇటుక (ఒకటి) 6.50 8.00

కూలీ (మహిళలు) 500 600

కూలీ (పురుషులు ) 700 900

మేస్త్రీ 900 1100 

Read more