సీఐ వేధింపులు.. ఎస్‌ఐ ఆత్మహత్య!

ABN , First Publish Date - 2022-05-14T08:47:02+05:30 IST

సీఐ వేధింపులు.. ఎస్‌ఐ ఆత్మహత్య!

సీఐ వేధింపులు.. ఎస్‌ఐ ఆత్మహత్య!

రివాల్వర్‌తో కాల్చుకుని సర్పవరం ఎస్‌ఐ బలవన్మరణం 

‘నచ్చని వర్గం వాడని  మంచి పోస్టింగ్‌కు దూరం!

సర్వీసులో ఆయనే సీనియర్‌ అయినా.. అందరి ముందు నిలబెట్టి అవమానాలు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ ముత్తవరపు గోపాలకృష్ణ(32) సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం బందోబస్తు కోసం ఇచ్చిన గన్‌ను పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో పెట్టుకుని తన నివాసంలో కాల్చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య, పిల్లలు బెడ్రూమ్‌లో నిద్రిస్తున్నారు. పిస్టల్‌ శబ్దం విని కంగారుగా వచ్చి చూసిన భార్య రక్తపుమడుగులో ఉన్న భర్తను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుశాఖలో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగింది. నచ్చని సామాజికవర్గమనే కారణంగా తనను డిపార్టుమెంటులో దూరం పెడుతున్నారని, మంచి పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తున్నారని.. మిత్రుల వద్ద గోపాలకృష్ణ వాపోయేవాడని తెలుస్తోంది. అయితే.. పోలీసు ఉద్యోగం చేయడం ఇష్టం లేకనే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. గోపాలకృష్ణది కృష్ణాజిల్లా జగ్గయ్యపేట. 2014లో ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ట్రైనీ ఎస్‌ఐగా పనిచేశారు. ఆ తర్వాత డొంకరాయి, రాజోలు స్టేషన్‌ల్లో ఎస్‌ఐగా పనిచేశారు. కాకినాడ ట్రాఫిక్‌ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా.. గతేడాది ఆగస్టులో సర్పవరం స్టేషన్‌ సర్కిల్‌లో ఎస్‌ఐగా పోస్టింగ్‌ ఇచ్చారు. స్వతహాగా సౌమ్యుడైన గోపాలకృష్ణ ఎవరితోనూ దురుసుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. డిపార్టుమెంట్‌లోనూ మృదుస్వభావిగా పేరుంది. అయితే.. ఇక్కడ ఓ సీఐ... ఆయనను బాగా వేధించాడని చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సీఎం జగన్‌ కోనసీమ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గోపాలకృష్ణకు సర్వీసు రివాల్వర్‌ ఇచ్చి బందోబస్తు డ్యూటీ అప్పగించారు. బందోబస్తు కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిమిత్తం గురువారం ముమ్మడివరం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. శుక్రవారం ఉదయం బందోబస్తుకు ఆయన వెళ్లాల్సి ఉంది. అయితే..తెల్లవారుజామునే లేచి అదే సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. కుడి కణితిపై పాయింట్‌బ్లాంక్‌పై గురిపెట్టి కాల్చుకోవడంతో లోపల మెదడు ఛిద్రమైందని వైద్యులు ’ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 


సీనియర్‌గా అవమానాలు.. 

సర్పవరం స్టేషన్‌లో ఉన్న నలుగురు ఎస్‌ఐలు, సీఐల్లో గోపాల్‌కృష్ణ బాగా సీనియర్‌. మాజీమంత్రి కన్నబాబుకు చెందిన కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోకి ఈ స్టేషన్‌ వస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఇక్కడకు సీఐగా వచ్చిన అధికారి.. గోపాలకృష్ణను వేధించేవారని చెబుతు న్నారు. నచ్చనివర్గం వాడనే కారణంగా అందరి ముందు అవమానించేవారని, ఏ కేసు కూడా అప్పగించకుండా మానసిక వేదనకు గురిచేసేవారని చెబుతున్నారు. ఇటీవల ఆ అధికారి బదిలీ కాగా, కొత్త సీఐ వచ్చారు. సీఐ మారినా గోపాలకృష్ణపై వేధింపులు మాత్రం ఆగలేదు. గతంలో ఆయన పలు స్టేషన్లలో పూర్తిస్థాయి ఎస్‌ఐగా పనిచేశారు. దీంతో తనకు సర్పవరం కాకుం డా ఎక్కడో ఒకచోట స్టేషన్‌ బాధ్యతలు అప్పగించాలని తన పై అధికారులకు ఎన్నోసార్లు అభ్యర్థిం చారని చెబుతున్నారు. ఇక చివరకు విసిగి పోయి ఆత్మహత్యకు సిద్ధమయినట్టు భావిస్తున్నారు. కాగా, గోపాలకృష్ణ ఆత్మహత్య నేపథ్యంలో పోలీసుల హడావుడి అనుమానాలను రేపుతోంది. రోజంతా ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఎవరూ లోపలకు వెళ్లకుండా ఇంటి బయట గడియ పెట్టారు. గోపాలకృష్ణ భార్య పావనితో మీడియా మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులు అంగీకరించలేదు. మరోపక్క జీజీహెచ్‌ మార్చురీవద్ద ఉన్న మృతదేహం వద్దకు కూడా ఎవరినీ పోలీసులు వెళ్లనివ్వలేదు. 


డ్యూటీ నచ్చకే.. కాదు చాలా ఇష్టం... 

గోపాలకృష్ణ ఆత్మహత్య వెనుక కారణాలపై కాకినాడ జిల్లా స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీతో దర్యాప్తు చేయిస్తునట్లు కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. ‘‘ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు గోపాలకృష్ణ తన డైరీలో రాసుకున్న అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఆయన ఎంసీఏ పూర్తిచేసిన తర్వాత కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఎస్‌ఐగా ఎంపికయ్యారు. సాఫ్ట్‌వేర్‌ను వదిలి అనవసరంగా ఎస్‌ఐ ఉద్యోగానికి వచ్చానని మొదటి నుంచీ తోటి ఎస్‌ఐలతో చెప్పుకొని బాధపడేవారు. ఏదొక వ్యాపారం చేసి ప్రశాంతంగా జీవించాలని ఆయన కోరుకున్నారు. ఈ కారణంగానే పోలీసుశాఖలో ఇమడలేక ఆత్మహత్య చేసుకున్నారు’’ అని ఎస్పీ వివరించారు. చనిపోవడానికి ముందు గోపాలకృష్ణ ఆత్మహత్య లేఖ రాశారని అదనపు ఎస్పీ పీ శ్రీనివాస్‌ మీడియాకు తెలిపారు. తనకు ఉద్యోగంపై ఆసక్తి లేదని, ఎంసీఏ చదివినందున అటువైపు వెళ్లాలనే ఆసక్తి ఉందని అందులో రాసినట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ వాదనలను గోపాలకృష్ణ తండ్రి ముత్తవరపు శ్రీనివాసరరావు అంగీకరించడం లేదు. తన కుమారుడు ఏరికోరి పోలీ్‌సఉద్యోగంలో చేరారని ఆయన తెలిపారు. ‘‘కృష్ణా జిల్లాలో ఫస్ట్‌ ర్యాంకు సాధించి వీఆర్వో ఉద్యోగంలో చేరారు. అయినా.. పోలీసు కావాలనే కోరికతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్‌ఐ అయ్యాడు’’ అని తెలిపారు. తన సోదరుడు పిరికివాడిలా ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని వెంకటేశ్వరరావు తెలిపారు. 





Read more