HYD : గ్రేటర్‌లో విద్యుత్‌ అంతరాయాలకు ఇక చెక్.. ‘తొడుగు’లు వచ్చేశాయ్..!

ABN , First Publish Date - 2022-05-06T16:50:54+05:30 IST

గ్రేటర్‌లో విద్యుత్‌ అంతరాయాలు తగ్గించేందుకు చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ..

HYD : గ్రేటర్‌లో విద్యుత్‌ అంతరాయాలకు ఇక చెక్.. ‘తొడుగు’లు వచ్చేశాయ్..!

  • చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో కవర్‌ కండక్టర్‌ తీగలతో చెక్‌
  • వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో అధికారులు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో విద్యుత్‌ అంతరాయాలు తగ్గించేందుకు చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 11 కేవీ కవర్‌ కండక్టర్‌ (తొడుగు)తీగలు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) చర్యలు తీసుకుంటోంది. వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తొమ్మిది సర్కిళ్లలో చెట్ల మధ్యలో విద్యుత్‌ తీగలు ఉన్న ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అక్కడ కవర్‌ కండక్టర్‌ తీగలు అందుబాటులోకి తీసుకురావాలని డిస్కం భావిస్తోంది. బుధవారం ఉదయం కురిసిన గాలివానతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌స్తంభాలు, తీగలపై చెట్లు విరిగిపడటంతో గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు కురిస్తే విద్యుత్‌ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.


ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్‌శాఖ వర్షాకాలం ప్రారంభానికి ముందే చెట్ల కింద విద్యుత్‌ స్తంభాలు, తీగలు ఉన్న ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌, సైబర్‌సిటీ, హబ్సిగూడ, హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌, మేడ్చల్‌, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, సికింద్రాబాద్‌ సర్కిళ్లలోని ప్రతి డివిజన్‌లో సెక్షన్ల వారీగా విద్యుత్‌స్తంభాల సంఖ్య, లైన్ల పరిస్థితిని పరిశీలించి నివేదిక అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.


స్కాడా కార్యాలయంలో కంట్రోల్‌ రూం..

గ్రేటర్‌లో మరో రెండు మూడురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో వెంగళరావునగర్‌ జీటీఎస్‌ కాలనీలోని స్కాడా కార్యాలయంలో విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూంకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు డిస్కం ఆపరేషన్‌ అధికారులు తెలిపారు. గ్రేటర్‌జోన్‌ పరిధిలో మొత్తం 450 వరకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉండగా.. వాటిలో 230 సబ్‌స్టేషన్ల పనితీరును కూడా అధికారులు స్కాడా కార్యాలయం నుంచే పరిశీలిస్తున్నారు. త్వరలో మిగిలిన సబ్‌స్టేషన్లను కూడా స్కాడా పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read more