స్వేచ్ఛకు ఆలంబనగా న్యాయం

ABN , First Publish Date - 2022-05-07T05:57:20+05:30 IST

ప్రజల స్వేచ్ఛను వృద్ధి చేయడంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు చాలా కీలకమైనవి. నోట్ల రద్దు, ఎన్నికల బాండ్లు, లాక్‌డౌన్, అధికరణ 370 రద్దు, దేశద్రోహం, ఎన్‌కౌంటర్లు, బుల్‌డోజర్లు ఇత్యాది కేసుల విషయంలో దేశ సర్వోన్నతన్యాయస్థానం తీర్పులు ఎలా ఉండనున్నాయి?..

స్వేచ్ఛకు ఆలంబనగా న్యాయం

ప్రజల స్వేచ్ఛను వృద్ధి చేయడంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు చాలా కీలకమైనవి. నోట్ల రద్దు, ఎన్నికల బాండ్లు, లాక్‌డౌన్, అధికరణ 370 రద్దు, దేశద్రోహం, ఎన్‌కౌంటర్లు, బుల్‌డోజర్లు ఇత్యాది కేసుల విషయంలో దేశ సర్వోన్నతన్యాయస్థానం తీర్పులు ఎలా ఉండనున్నాయి?

నేను స్వేచ్ఛగా పుట్టానని విశ్వసిస్తున్నాను. వెస్ట్ మినిస్టర్ తరహా ప్రజాస్వామ్యంలో పుట్టడం లేదా ఒక సోవియట్ శైలీ రాజ్యంలో జన్మించడం లేదా సంపూర్ణ నియంతృత్వం ఉన్న దేశంలో ప్రభవించడం లేక నిత్యం తగవులాడుకునే దేశంలో పుట్టడం అన్న దానిపై నాకు నియంత్రణ లేదు. నిర్దిష్ట హక్కుల– బదిలీ చేయలేని, అన్యాక్రాంతం చేయడానికి వీలులేని– తో జన్మించానని నమ్ముతున్నాను. ఏమిటీ హక్కులు? నా శరీరంపై నాకు స్వేచ్ఛ ఉంటుంది; ఎక్కడికైనా వెళ్లేందుకు నాకు స్వేచ్ఛ ఉంటుంది; దేని గురించైనా నా భావాలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు, రాసేందుకు నాకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉంటుంది; నా తోటి మనుషులతో కలిసి ఏదైనా ఒక లక్ష్యం కోసం సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు నాకు ఉంది.


తమను తాము వ్యవస్థీకరించుకునేందుకు నిర్ణయించుకున్న పౌరుల సాముదాయిక నామమే ‘రాజ్యం’. అది అంతకు మంచి మరేమీ కాదు. అలా నిర్ణయించుకున్నవారు ఒక ‘రాజ్యాన్ని’ ఏర్పాటు చేసుకుంటారు. పౌరులు తమకు తామే, వివిధ నియమనిబంధనలతో కూడిన ఒక అధికార పత్రాన్ని పౌరులు రూపొందించుకుని తమకు తామే ఇచ్చుకున్నప్పుడు అది వారు ఏర్పాటు చేసుకున్న రాజ్య సంవిధానం అవుతుంది. ఆ రాజ్యాంగంలో పొందుపరచుకున్న వాటికి మించి మరెలాంటి హక్కులు, విధులను అది నిర్దేశించదు. రాజ్యాంగేతర అధికారాలను రాజ్యం చెలాయించదు. చెలాయించకూడదు. రాజ్యాంగాన్ని ఆమోదించని పౌరుడు ఎవరైనా సదరు దేశం నుంచి వెళ్లిపోయి మరో దేశ పౌరసత్వాన్ని స్వీకరించ వచ్చు– ఆ కొత్త దేశ ప్రభుత్వం అంగీకరిస్తే. ఇదొక పరిపూర్ణమైన వివేకవంతమైన అర్థవంతమైన వ్యవస్థ. సాధారణంగా ఇటువంటి రాజ్య వ్యవస్థలో పౌరులు, రాజ్యం సహజీవనం చేస్తాయి అయితే ఒక సమస్య ఉంది. రాజ్యాంగంలో రాసుకున్న నియమ నిబంధనలు ఒక్కోసారి వివాస్పదమవుతాయి. అప్పుడు వాటి నిజమైన అర్థం ఇదని న్యాయకోవిదులు భాష్యం చెప్పవలసి ఉంది.


ఏవైనా తీర్పులు వివాదాస్పదమయినప్పుడు, సంబంధిత రాజ్యాంగ నిబంధనలకు సాధికారిక భాష్యం చెప్పే హక్కు పూర్తిగా న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంటుంది. మరెవ్వరికీ ఆ బాధ్యత ఉండదు. అయితే ఈ విషయాన్ని శాసన వ్యవస్థ సవాల్ చేసింది ఎందుకంటే శాసనాలు నిర్మించే అధికారం పూర్తిగా శాసన వ్యవస్థకే ఉంటుంది. న్యాయమూర్తులు సాధారణంగా నియమింపబడతారు. వారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. వివేకవంతమైన ఈ ఏర్పాటులో అప్పుడప్పుడూ లిఖిత నియమాలు, వాటి అర్థాల మధ్య ఘర్షణ నెలకొంటుంది. అలాగే ఒక అంశంపై శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ ఏకీభవించక పోవచ్చు.ఈ ఘర్షణలు, అభిప్రాయ భేదాల పరిష్కారమే పరిణత, నాగరీక సమాజానికి గీటురాయి.


అటువంటి సందర్భం ఒకటి అమెరికాలో 1973లో తటస్థించింది. గర్భస్రావాన్ని అనుమతించాలా, అనుమతించకూడదా అనే విషయమై సర్వోన్నత న్యాయమూర్తులు ప్రజల పక్షాన నిలబడి మహిళలకు గర్భస్రావం హక్కు ఉందని సమర్థించారు (రోయే వెర్సెస్ వేడ్). అటువంటి సందర్భం ఒకటి మన దేశంలోనూ 1976లో వచ్చింది. న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని సమర్థించి ప్రజలకు జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులను నిరాకరించారు (ఎడిఎమ్ జబల్పూర్ వెర్సెస్ ఎస్ఎస్ శుక్లా). గర్భస్రావంపై ఆంక్షలు విధిస్తూ చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? అమెరికా రాజ్యాంగంలో వ్యక్తిగత గోప్యత హక్కు ఉందని, ఆ హక్కు పరిధిలోకి గర్భస్రావం చేయించుకోవాలా అక్కర్లేదా అనే విషయమై మహిళల నిర్ణయం వస్తుందని అమెరికా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమెరికన్లలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. యావత్ అమెరికన్లు గర్భస్రావం అనుకూలురు లేదా వ్యతిరేకులుగా చీలిపోవడం జరిగింది. రోయె వెర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పునఃసమీక్షించిన పక్షంలో గతంలో కంటే మరింత తీవ్రంగా అమెరికన్లలో చీలికలు ఏర్పడే అవకాశముంది. ఒక పెండింగ్ కేసులో మెజారిటీ తీర్పు మొదటి ముసాయిదా ఒకటి ఇటీవల మీడియాకు లీక్ అయింది. 1973లో గర్భస్రావానికి అనుకూలంగా వెలువడిన తీర్పును నిరాకరించాలని లీక్ అయిన ముసాయిదా తీర్పు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అంతిమ ఆమోదం లభించినపక్షంలో అమెరికన్ సమాజం తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా సంతాన నిరోధం, స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రతికూలతలు నెలకొంటాయి. ప్రజల స్వేచ్ఛను వృద్ధి చేయడం లేదా పరిమితం చేసే విషయంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు చాలా కీలకమైనవి.


పౌరుల స్వేచ్ఛను ప్రభావితం చేసే పలు కేసులు మన సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: 1) నోట్ల రద్దు కేసు: దేశంలో చెలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో 86 శాతాన్ని ముందస్తు నోటీస్ ఇవ్వకుండా రద్దు చేయవచ్చా? ౨016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల కోట్లాది ప్రజలకు రోజుల తరబడి ఆహారం, మందులు అందుబాటులో లేకుండా పోలేదూ? 2) ఎన్నికల బాండ్ల కేసు: నష్టాల్లో ఉన్న కంపెనీలతో సహా కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకురావచ్చునా? సదరు చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని, అవినీతిని పాలకులు ప్రోత్సహించలేదూ? పాలక పక్షానికి అపరిమిత ఎన్నికల నిధులు సమకూర్చలేదూ? 3) లాక్‌డౌన్ : ప్రజలకు ముందుగా తెలియజేయకుండా సంపూర్ణ లాక్‌డౌన్ విధించవచ్చునా? 2020లో అలా విధించడం వల్ల కోట్లాది ప్రజలకు ఆహారం, తాగునీరు, మందులు, డబ్బు అందుబాటులో లేకుండా పోయాయి. బతుకు తెరువుకోసం సుదూర నగరాలకు వలస వచ్చిన వారు స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ప్రయాణ సదుపాయాలు లేక ఎదుర్కొన్న కష్ట నష్టాలు వర్ణనాతీతమైనవి. 4) అధికరణ 370 రద్దు : విలీన ఒప్పందం ద్వారా దేశంలో అంతర్భాగమైన ఒక రాష్ట్రాన్ని, ప్రజల సమ్మతి, ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించవచ్చునా? 5) దేశద్రోహం : భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124–ఎ కింద, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించిన లేదా పరిహసించిన వ్యక్తులపై దేశద్రోహం అభియోగం మోపవచ్చునా? 6) ఎన్‌కౌంటర్లు, బుల్ డోజర్లు : ప్రజల అసమ్మతిని, నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్‌కౌంటర్లు, భవనాలు కూల్చివేయడం మొదలైన పద్ధతులను ఉపయోగించవచ్చునా? 1950 జనవరి 26న ఉనికిలోకి వచ్చిన భారత రాజ్యవ్యవస్థ పునాదులను కూల్చివేసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోంది. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసేందుకు, వారి హక్కులను క్రమంగా హరించివేసేందుకు రహస్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘పత్రికా స్వాతంత్ర్య సూచీ–2022’లో భారత్ స్థానం 180 దేశాలలో 150వ స్థానానికి దిగజారిపోయింది. చైతన్యశీల పౌరులు ఈ విషయమై ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల నిరంతర కాపలాదారు కదా దేశ సర్వోన్నత న్యాయస్థానం. భారత ప్రజల స్వేచ్ఛ ఒక రక్షకుడి కోసం వేచి వున్నది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Read more