నిర్మించారు..వదిలేశారు!

ABN , First Publish Date - 2022-05-10T05:23:41+05:30 IST

కోట్లాది రూపాయలను ఖర్చు చేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించారు.. కానీ వాటిని కేటాయించకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

నిర్మించారు..వదిలేశారు!
నిరుపయోగంగా చేగుంట మార్కెట్‌ యార్డులోని దుకాణాలు

మెదక్‌, చేగుంట మార్కెట్‌ యార్డుల్లో  నిరుపయోగంగా 38 దుకాణాలు 

రూ. 2.60 కోట్లు వెచ్చించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం

ఏడాదిగా కేటాయించని వైనం

అలంకారప్రాయంగా దుకాణాల సముదాయాలు 

అద్దె ఎక్కువగా ఉండడంతో ముందుకు రాని వ్యాపారులు



 ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, మే 9 : కోట్లాది రూపాయలను ఖర్చు చేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించారు..  కానీ వాటిని కేటాయించకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మెదక్‌, చేగుంట మార్కెట్‌ యార్డుల్లో దుకాణాలను ఏడాదిగా ఎవరికీ కేటాయించలేదు. మార్కెటింగ్‌ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా మార్కెట్‌ కమిటీలకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతున్నది ఇక దుకాణాల అద్దె కూడా ఎక్కువగా ఉండడంతో కిరాయికి  వ్యాపారులు ఎవరూ రావడం లేదు.  మెదక్‌, చేగుంట మార్కెట్‌ యార్డుల్లో మొత్తం 38 దుకాణాలను నిర్మించారు. మార్కెట్‌ కమిటీలకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు రైతులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించారు. ఆయా దుకాణాల సముదాయ నిర్మాణానికి మెదక్‌లో రూ.1.70కోట్లు, చేగుంటలో రూ.90లక్షల వరకు ఖర్చు చేశారు. గతేడాది మే నెలలో కాంప్లెక్స్‌లను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఎవరికీ కిరాయికి ఇవ్వలేదు. 2 చోట్లా కలిపి మొత్తం 38 దుకాణాలు ఉన్నాయి. అధికారులు టెండర్‌ పిలిచి ఆసక్తి ఉన్న వారికి కేటాయించాలి. కానీ ఆ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంతో దుకాణాల సముదాయాలు వృథాగా ఉన్నాయి. 


మెదక్‌లో

మెదక్‌లోని మార్కెట్‌ యార్డులో దుకాణాల సముదాయానికి 2017లో అప్పటి మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. గతంలో ఇక్కడ రూ.25 లక్షలతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉల్లిగడ్డల నిల్వ కోసం గోదాములు నిర్మించింది. అయితే ఒక్క సీజన్‌లో మాత్రమే ఉల్లిగడ్డను నిల్వ చేశారు. ఆ తరువాత సివిల్‌ సప్లయింగ్‌, మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ గోదాములను కూల్చివేశారు.  రైతులకు సౌకర్యంగా ఉండే విధ ంగా పట్టణంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలైజర్‌, సీడ్‌ దుకాణాలు, వ్యవసాయ పనిముట్లు ఇలా అన్ని ఒకేచోట దొరికే విధంగా ప్లాన్‌ చేశారు. రూ.1.70 కోట్లతో 20 దుకాణాలతో కూడిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. గత మే నెలలో మంత్రి హరీశ్‌రావు దుకాణాల సముదాయాన్ని ప్రారంభించారు. 20 దుకాణాల్లో 9 జనరల్‌, 6 బీసీ, 3 ఎస్సీ, 1 ఎస్టీ, మరొకటి పీహెచ్‌సీకి కేటాయించారు. ఒక్కో దుకాణం అద్దె రూ.10వేలకు పైగా ఉండడంతో వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా రూ.కోట్లు ఖర్చు చేసిన నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ వృథాగా మారింది. తక్కువ కిరాయికి దుకాణాలు కేటాయిస్తే వ్యాపారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. 


చేగుంటలో

చేగుంట మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో రూ.90 లక్షలు ఖర్చు చేసి 18 దుకాణాలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టారు. కానీ ఎవరికీ కేటాయించకపోవడంతో అది కూడా వృథాగానే ఉంది. నాలుగేళ్ల క్రితం చేగుంటలోని మెదక్‌ రోడ్డులో దుకాణాల సముదాయం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. మెయిన్‌ రోడ్డు వైపు 9దుకాణాలు, లోపలి వైపు కూరగాయల వ్యాపారుల కోసం 9 దుకాణాలు నిర్మించారు. పది నెలల క్రితం దుకాణాల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ కేటాయింపు ప్రకియ చేపట్టడం లేదు. కొన్నినెలలుగా మార్కెట్‌ కమిటీలకు వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు టెండర్‌ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. 


త్వరలోనే దుకాణాల కేటాయింపు 

- మహ్మద్‌ షహబొద్దీన్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, మెదక్‌

మెదక్‌, చేగుంట మార్కెట్‌ యార్డుల్లో నిర్మించిన దుకాణాల కేటాయింపును త్వరలోనే పూర్తిచేస్తాం. చేగుంటలో టెండర్‌ నిర్వహించడానికి అనుమతి కోసం డైరెక్టర్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌కు ప్రతిపాదనలు పంపించాం. డైరెక్టర్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌ నుంచి ఉత్తర్వులు రాగానే పేపర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి వారంలో టెండర్‌ నిర్వహిస్తాం. మెదక్‌ మార్కెట్‌ యార్డులో నిర్మించిన దుకాణాలకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచాం. కానీ టెండర్లలో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.  మొత్తం 20 దుకాణాలను తీసుకునేందుకు మెదక్‌లోని ఫర్టిలైజర్‌ డీలర్లు ముందుకు వచ్చారు. ఈ మేరకు వారి నుంచి వచ్చిన వినతిని ప్రభుత్వానికి పంపించాం. రెండు, మూడు రోజుల్లో ఆర్డర్స్‌ వస్తాయి. ఆ తరువాత దుకాణాలన్నింటినీ ఫర్టిలైజర్‌ డీలర్లకు కేటాయిస్తాం.

 వినియోగంలోకి తీసుకురావాలి 

- చింతల భూపాల్‌, బీజేపీ చేగుంట మండల శాఖ అధ్యక్షుడు 

చేగుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్మించిన దుకాణాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. మంత్రి హరీశ్‌రావు దుకాణాల సముదాయాన్ని ప్రారంభించి నెలలు గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఫలితంగా మార్కెట్‌ కమిటీకి ప్రతి నెలా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నారు. వీలైనం త తర్వగా టెండర్లు పిలిచి దుకాణాలు కేటాయించాలి.  



Read more