బుద్ధం.. శరణం.. బుద్ధవనం!

ABN , First Publish Date - 2022-05-12T09:55:21+05:30 IST

కృష్ణానదీ పరివాహక ప్రాంతం గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల.

బుద్ధం.. శరణం.. బుద్ధవనం!

  • నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలో మహాద్భుతం
  • దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద బౌద్ధ స్తూపం
  • బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే వందల విగ్రహాలు
  • రూ.70కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు..
  • 274 ఎకరాల్లో అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం
  • ఈ నెల 14న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌


బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్ని కళ్లకు కట్టేలా శిల్పాలు, అష్టాంగ మార్గానికి గుర్తుగా ఎనిమిది పార్కులు, ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతి పెద్ద స్తూపం, శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ.. ఇలా ఎన్నో విశేషాలతో రూపుదిద్దుకున్న బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను కళ్లకు కడుతూ నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం పర్యాటకులకు కనువిందు చేయనుంది.


నల్లగొండ, మే 11 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదీ పరివాహక ప్రాంతం గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. దీనికి గుర్తుగా నాగార్జున సాగర్‌ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2005లో నాటి పర్యాటక శాఖ అధికారులు బుద్ధవనం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2006లో బౌద్ధ మత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు. 17 ఏళ్ల పాటు కొనసాగిన పనులు.. ఎట్టకేలకు తుది దశకు చేరాయి. అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా రూపుదిద్దుకున్న బుద్ధవనాన్ని మంత్రులు కేటీఆర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, జగదీశ్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన ప్రారంభించనున్నారు.


అడుగడుగునా విశేషమే..

లుంబిని, సారనాథ్‌, బుద్ధగయ, కృషి నగర్‌ మాదిరిగా ప్రపంచంలోని బౌద్ధ మతస్తులకు ఇష్టమైన మరో ప్రదేశంగా సాగర్‌లోని బుద్ధవనాన్ని తీర్చిదిద్దారు. గౌతమ బుద్ధుడి జన నం నుంచి నిర్యాణం దాకా ప్రతి అంకమూ ఇక్కడ శిల్పమై కొలువుదీరింది. ఇక్కడి శిల్పాల కోసం కడప జిల్లా జమ్మలమడుగు నుంచి మల్వాల రాయిని సేకరించారు. బుద్ధ వనంలోకి ప్రవేశించే మూడు ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వినియోగించారు.  బుద్ధుడి జీవితం 22రకాల చెట్లతో ముడిపడి ఉంది. అందుకే బుద్ధ వనంలో ప్రత్యేకంగా 22 రకాల చెట్లను పెంచుతున్నారు. సిద్ధార్థుడు ఆహారం, నీళ్లు తీసుకోకుండా 48 రోజుల పాటు తపస్సు చేశాడు.


హృదేలా గ్రామంలో సుజాత దేవి ఇచ్చిన పాయసం తీసుకున్న తర్వాత అతడికి జ్ఞానోదయం అవుతుంది. దీన్ని ప్రతిబింబిచేలా మహాస్తూపం కింది భాగంలో మోకాళ్ల మీద కూర్చుని పాయసం తీసుకున్నట్లు ప్రతిమను చెక్కారు. బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబిచేలా అభివృద్ధి చేసేందుకు శ్రీలంక, టిబెట్‌, సిక్కిం, అమెరికా వాసులకు ఐదు ఎకరాల చొప్పున కేటాయించారు. బుద్ధిజంలో అష్టాంగ మార్గానికి గుర్తుగా ఈ వనంలో ఎనిమిది భాగాలుగా పార్కులను నిర్మించారు. మొదటి పార్కు లో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలు, రెండో పార్కులో 547 జాతక కథలతో 4 2రకాల వేదికలు ఏర్పా టు చేశారు. మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు కాగా, నాలుగోది ప్రపంచ స్థూపాల పార్కు. ఐదో పార్కులో   శ్రీలంక వాసుల సాయంతో 27అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆరవది ధ్యాన వనం, ఏడవది మహాస్తూపం, ఎనిమిదోది స్తూప వనం. 


మహాస్తూపం ఇలా..

21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసంతో మహాస్తూపాన్ని నిర్మించారు. కాంక్రీట్‌తో నిర్మించిన స్తూపాలలో ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్దది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అమరావతిలో శాతవాహనుల కాలంలో నిర్మించిన స్తూపానికి ప్రతిబింబంగా అవే కొలతలతో  ఇక్కడ నిర్మించారు. స్థూపం కింది భాగంలో లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం నిర్మించారు. స్తూపం లోపలి భాగంలో ఎనిమిది వైపుల ధ్యాన ముద్రలో ఉండే బుద్ధుడి విగ్రహాలను నిర్మించారు.


ప్రారంభంలో కేంద్రం నింధులతో..

శంకుస్థాపన చేసిన నాటి నుంచి 2014లో రాష్ట్ర విభజన జరిగే వరకూ బుద్ధవనం నిర్మాణ పనులకు  కేంద్రమే నిధులు ఇచ్చింది.  రాష్ట్ర విభజన అనంతరం బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత 2015 మే 2,3,4 తేదీల్లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిమిత్తం సాగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌.. బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధ వనం అభివృద్ధికి రూ.25కోట్లు కేటాయించడమే కాకుండా, మల్లేపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు. అప్పటి నుంచి  బుద్ధవనం పనులు కొనసాగుతున్నాయి. 

Read more